- త్రివర్ణ పతాకం ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము
- ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈజిప్టు అధ్యక్షుడు అద్బెల్ ఫతా
- ఆకట్టుకున్న ఆర్మీ పరేడ్..
న్యూ దిల్లీ, జనవరి 26 : కర్తవ్య పథ్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ గీతం ఆలపించిన అనంతరం 21 గన్ సెల్యూట్ స్వీకరించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు అద్బెల్ ఫతా హాజరయ్యారు. రిపబ్లిక్ డే వేడుకల్లో ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, ప్రధాని నరేంద్రమోడీ, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. రాజ్ పథ్ పేరును కర్తవ్య పథ్‌గా మార్చిన అనంతరం తొలిసారి నిర్వహిస్తున్న గణతంత్ర వేడుకల్లో పరేడ్ ఆకట్టుకుంది. ఈసారి ఈజిప్ట్‌కు చెందిన సైనిక దళాలు పరేడ్‌లో పాల్గొన్నాయి. గణతంత్ర వేడుకల్లో ఈసారి సామాన్యులకు పెద్దపీట వేశారు. రిక్షా కార్మికులు, చిరువ్యాపారులకు పరేడ్ చూసేందుకు అవకాశం కల్పించారు. దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలోని కర్తవ్యపథ్‌లో మొదటిసారి నిర్వహించిన ఆర్మీ కవాతులో త్రివిధ దళాల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈసారి గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ’ఆత్మనిర్భర్’ కింద పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన యుద్ధ ట్యాంకులు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ కవాతు విజయ్‌చౌక్ వద్ద మొదలై ఎర్రకోట వరకు సాగుతుండగా.. దేశీయంగా అభివృద్ధి చేసిన ఆయుధాలు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. యావత్ దేశం 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న శుభసందర్భంగా దేశవాసులకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర సమరయోధుల కలలు నిజమవ్వాలంటే ఉమ్మడిగా ముందుకుసాగాలని దేశవాసులకు సందేశమిచ్చారు. ఈ మేరకు ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ‘భారతీయులు అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. స్వాతంత్య్ర అమృత్ మహోత్సవ్ సమయంలో జరుపుకుంటున్న ఈ గణతంత్ర దినోత్సవం విశిష్టమైనది. దేశం కోసం అసువులు బాసిన స్వాతంత్య్ర సమరయోధుల కలలు నిజం కావాలంటే ఉమ్మడిగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను‘ అని పేర్కొన్నారు. ఈ మేరకు హిందీలో ఆయన ట్వీట్ చేశారు.