ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బుధవారం ఉదయం రెండు ఎమ్మెల్సీలకు వోట్ల లెక్కింపు జరుగనుంది. సాయింత్రానికి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నారు. మహబూబ్‌నగర్- రంగారెడ్డి-హైదరాబాద్, వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల వోట్ల లెక్కింపునకు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ప్రతి రౌండులో 56 వేల వోట్ల చొప్పున లెక్కించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.
నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీలో నిలవటంతోహొవోట్ల లెక్కింపునకు అధిక సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గం పరిధిలో 5,31,268 మంది వోటర్లకు గాను 3,57,354 మంది తమ హక్కు వినియోగించుకున్నారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ నియోజకవర్గంలోని 12 జిల్లాల పరిధిలో 5,05,565 మంది వోటర్లకు గాను 3,86,320 మంది తమ హక్కును వినియోగించుకున్నారు.
రెండు నియోజకవర్గాల్లో వోట్ల లెక్కింపు కోసం 1,606 మంది సిబ్బందిని వినియోగించనున్నారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి 806 మంది సిబ్బందిని ఖరారు చేసింది. వరంగల్-ఖమ్మం-నల్గొండ వోట్ల లెక్కింపు కోసం 800 మంది పనిచేయనున్నారు. ఒక్కో టేబుల్‌కు ఒక సూపర్వైజర్, ఇరువురు సిబ్బంది, ఒక సూక్ష్మ పరిశీలకుడిని నియమించారు. తొలుత చెల్లుబాటయ్యే వోట్లను గుర్తించి 25 చొప్పున కట్టలు కడతారు. ఆ తరవాత ప్రాధాన్య క్రమంలో వోట్ల లెక్కింపును ప్రారంభిస్తారు.