ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం
హైదరాబాద్- రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌తో పాటు నల్గొం-వరంగల్-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల రెండో వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలలో పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ పెట్టెలు, నూతన వోటర్ల నమోదు పక్రియ పూర్తి వంటి అంశాలపై ఎన్నికల సంఘం ఇప్పటికే దృష్టి సారించింది. నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పరిధిలోని 12 కొత్త జిల్లాలకు ఒక్కో సహాయ రిటర్నింగ్ అధికారి చొప్పున నియమించేందుకు 12 మంది అధికారులను ఎంపిక చేశారు.
ఇందుకు గాను ఆయా జిల్లాలలోని అదనపు కలెక్టర్లు , వారు అందుబాటులో లేని చోట ఇతర సీనియర్ అధికారులకు ఏఆర్వో బాధ్యతలు అప్పగించనున్నారు. ఇందుకు సంబంధించి ప్రతీ జిల్లాలలోనూ ఒక్కో అధికారి ఉండాల్సి ఉండగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మాత్రం రెవెన్యూ డివిజన్‌కు ఒకరు చొప్పున ఏఆర్వోలు బాధ్యతలు నిర్వహించనున్నారు. అలాగే, రిటర్నింగ్ అధికారి (ఆర్వో) అయిన అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగనున్నందున నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ రెవెన్యూ డివిజన్లకు ప్రత్యేక ఏఆర్వోలను ఇప్పటికే ఎన్నికల సంఘం నియమించింది. దీంతో పాటు సహాయ రిటర్నింగ్ అధికారుల జాబితాను ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేశారు.
కాగా, ఎన్నికల ప్రకటన వచ్చి నామినేషన్ల స్వీకరణకు వారం ముందు వరకు కూడా దరఖాస్తుల పక్రియ కొనసాగనుంది. వోటరు నమోదుకు గడువు ఇంకా ఉన్నందున పట్టభద్రుల నుంచి దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఎన్నికల యంత్రాంగం భావిస్తోంది. కొత్త జిల్లాల పరిధిలో మొత్తం 546 పోలింగ్ కేంద్రాలకు గాను 4 లక్షల 91 మంది వోటర్లు ఉన్నారు. రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేసి ఈనెల రెండో వారంలో నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తున్నది.