Take a fresh look at your lifestyle.

పిఆర్‌సి మంటలు

  • 7.5శాతం ఫిట్‌మెంట్‌ ‌ప్రతిపాదిస్తూ సీఎస్‌కు నివేదిక
  • నివేదిక ప్రతులు చింపేసిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు
  • పిఆర్‌సిపై భగ్గుమన్న విపక్షాలు, ఉద్యోగులకు అండగా ఉంటామని హామీ
  • సీఎస్‌తో ఉద్యోగ సంఘాల భేటీ, 43 శాతం ఫిట్‌మెంట్‌కు డిమాండ్‌
  • ‌ఫిట్‌మెంట్‌ ‌పేరుతో సీఎం కొత్త డ్రామా: బీజేపీ
  • ఉద్యోగులతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది: కాంగ్రెస్‌

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం (పిఆర్‌సి) నివేదిక విడుదలైంది. పిఆర్‌సిపై ప్రభుత్వం నియమించిన బిశ్వాల్‌ ‌కమిటీ బుధవారం నివేదికను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌కు అందజేసింది. ఉద్యోగుల మూల వేతనంపై 7.5 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ అమలు చేయాలని పీఆర్సీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచాలని సూచించింది. ఉద్యోగుల కనీస వేతనం రూ. 19 వేలు ఉండాలని, గరిష్ట వేతనం 1,62,070 వరకు ఉండొచ్చని సిఫారసు చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏను తగ్గించాలని ప్రతిపాదనలు చేసింది. గ్రాట్యుటీ పరిమితి రూ. 12 లక్షల నుంచి రూ. 16 లక్షలకు.. శిశు సంరక్షణ సెలవులు 90 నుంచి 120 రోజులకు పెంచింది. సీపీఎస్‌లో ప్రభుత్వ వాటా 14 శాతానికి పెంచాలని పీఆర్సీ సిఫార్సు చేసింది.

2018 జులై 1వ తేదీ నుంచి వేతన సవరణ అమలు చేయాలని కమిషన్‌ ‌సిఫార్సు చేసింది. కాగా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌ ‌నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ ఈ సాయంత్రం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపింది. ఈ మేరకు తొలిరోజు టీఎన్జీవో, టీజీవో సంఘాలకు ఆహ్వానం పంపింది. తొలుత ఉద్యోగ సంఘాలకే నివేదిక ఇవ్వాలని భావించినా.. ఆయా సంఘాల నేతల వినతితో 275 పేజీల నివేదికను వెబ్‌ ‌సైట్‌ ‌లో ప్రభుత్వం పెట్టింది. 7.5శాతం ఫిట్‌మెంట్‌ను బిశ్వాల్‌ ‌కమిటీ సిఫార్సు చేసింది. గురువారం నుంచి రెండు లేదా నాలుగు సంఘాల ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించనుంది. ఉద్యోగ సంఘాలతో చర్చలను పురస్కరించుకొని త్రిసభ్య కమిటీ విడిగా సమావేశం నిర్వహించింది. సీఎస్‌తో జరిగిన సమావేశంలో ఉద్యోగ సంఘాలు 43 శాతం ఫిట్‌మెంట్‌ను డిమాండ్‌ ‌చేశాయి. 31 నెలలు కసరత్తు చేసినా ఉద్యోగుల సమస్యలు తీర్చే విధంగా కమిటీ నివేదిక లేదని తీవ్ర అసంతపి వ్యక్తం చేశాయి.

ప్రభుత్వానికి పలు మార్లు ఇచ్చిన వినతులను కూడా కమిటీ పరిగణనలోనికి తీసుకోలేదనీ, కాలయాపన లేకుండా వెంటనే తుది నిర్ణయం తీసుకోవాలని సీఎస్‌ను కోరాయి. కాగా, బిశ్వాల్‌ ‌కమిటీ ప్రతిపాదించిన వేతన సవరణ సిఫార్సులను రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు ప్రతిపక్ష కాంగ్రెస్‌, ‌బీజేపీ కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి. ఐక్యవేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నివేదిక ప్రతులను చించివేశారు. ఇది తమ వేతనాలను పెంచడానికి కాకుండా తగ్గించడానికి వేసిన కమిటీ అని అగ్రహం వ్యక్తం చేశారు.63 శాతం ఫిట్‌మెంట్‌ ‌కావాలని తాము అడిగితే 7.5 శాతం ఇవ్వడం ఏమిటని ప్రశ్నించాయి. పీఆర్సీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతృత్వంలో నేతలు ఆందోళనకు దిగడంతో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆందోళనకు దిగిన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేయాల్సి వచ్చింది.

ఫిట్‌మెంట్‌ ‌పేరుతో సీఎం కొత్త డ్రామా: బండి సంజయ్‌
‌ఫిట్‌మెంట్‌ ‌పేరుతో సీఎం కేసీఆర్‌ ‌కొత్త డ్రామాకు తెరలేపారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌విమర్శించారు. ఉద్యోగులను మూడేళ్లుగా ఊరించి ఉసూరుమనిపించారని మండిపడ్డారు. 7.5 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వడానికి ప్రభుత్వానికి మూడేళ్లు సమయం కావాలా ? అని ప్రశ్నించారు. రోజురోజుకూ ఇంటి అద్దెలు పెరుగుతుంటే హెచ్‌ఆర్‌ఏ ‌తగ్గించడం ఏమిటని ప్రశ్నించారు. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి పేరుతో నిరుద్యోగులను, సన్న బియ్యం పేరుతో రైతులను మోసం చేసిన సీఎం కేసీఆర్‌ ఇప్పుడు ఉద్యోగులను కూడా మోసం చేశారని పేర్కొన్నారు. అసలు బిశ్వాల్‌ ‌నేతృత్వంలోని కమిటీని ప్రభుత్వం స్వేచ్ఛగా పనిచేయనిచ్చిందా ? బలవంతంగా పిఆర్‌సి రాయించారా ? అనే సందేహాలను వెలిబుచ్చారు. ఇంత దారుణమైన, అతి తక్కువ ఫిట్‌మెంట్‌ను ఉమ్మడి రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వమూ ఇవ్వలేదని బండి సంజయ్‌ ఆరోపించారు.

ఉద్యోగులతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది: చిన్నారెడ్డి
ఉద్యోగులతో టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం చెలగాటమాడుతోందని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత చిన్నారెడ్డి విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత తొలిసారిగా ప్రకటించిన పిఆర్‌సిలో ఉద్యోగులను టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని విమర్శించారు. గతంలో రోశయ్య సీఎంగా ఉన్నప్పుడే 35 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారని గుర్తు చేశారు. 43 శాతం కంటే 10 శాతం ఎక్కువ ఫిట్‌మెంట్‌ ఉం‌టేనే మంచిదని సీఎం కేసీఆర్‌కు సూచించారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు పిఆర్‌సిపై పోరాటంలో కాంగ్రెస్‌ అం‌డగా ఉంటుందని స్పష్టం చేశారు.

Leave a Reply