- చెల్లదంటూ అసెంబ్లీలో డిఎంకె తీర్మానం
- వాకౌట్ చేసిన గవర్నర్ రవి
చెన్నై,జనవరి9 : తమిళనాడు అసెంబ్లీ నుంచి ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ రవి వాకౌట్ చేశారు. గవర్నర్ ప్రసంగం చేస్తున్న సమయంలో అధికార డీఎంకే కూటమి చెందిన సభ్యలు సోమవారం సభలో గందరగోళం సృష్టించారు. నినాదాలు చేస్తూ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్ జోక్యం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాసి ఇచ్చిన ప్రసంగాన్ని మాత్రమే రికార్డులోకి తీసుకోవాలని, గవర్నర్ తన ప్రసంగంలో కొత్తగా జోడించిన అంశాలను తీసివేయాలని సీఎం స్టాలిన్ స్పీకర్‌ను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం రాసి ఇచ్చిన ప్రసంగాన్ని మాత్రమే గవర్నర్ ఒరిజినల్ స్పీచ్‌గా రికార్డు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశారు.
దీంతో మళ్లీ స్టాలిన్, గవర్నర్ మధ్య వైరం కొత్త స్థాయికి చేరినట్లు అయ్యింది. ఇటీవల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, గవర్నర్ ఆర్ రవి మధ్య భిన్నాభిప్రాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ ప్రసంగంలో గవర్నర్ రవి.. ద్రవిడ నేతల గురించి ప్రస్తావించలేదు. అంబేద్కర్, ద్రవిడ మోడల్‌కు చెందిన విషయాలను ఆయన చదవలేదు. ప్రసంగంలో ఉన్న 65వ పేరాకు చెందిన స్పీచ్‌ను గవర్నర్ విస్మరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ద్రవిడార్ ఖజగం వ్యవస్థాపకుడు పెరియార్, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్, మాజీ సీఎం కామరాజ్, అన్నాదురైల గురించి ఉన్న వ్యాఖ్యలను గవర్నర్ తన ప్రసంగం సమయంలో స్కిప్ చేశారు. ఈ ఘటన తర్వాతే సీఎం స్టాలిన్ ఆదేశాల మేరకు గవర్నర్ ప్రసంగంపై తీర్మానం చేపట్టారు.