Take a fresh look at your lifestyle.

గవర్నర్‌ ‌వ్యవస్థని రద్దు చేయాలి

స్వాతంత్య్ర భారతదేశంలో నాటి నుండి నేటి దాకా  కొన్ని రాష్ట్రాల్లోని  గవర్నర్లు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించకుండా తమ ఇష్టారాజ్యంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై పెత్తనాలు సాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఒక రకంగా సమాంతర ప్రభుత్వాలని నడిపిస్తున్నారు. ఆ  విధంగా వ్యవహరించే వారి ఆధిపత్య ధోరణులు ఏమాత్రం సహేతుకం కావు. ఇలాంటి  సంకుచిత పరిస్థితుల్లో గవర్నర్ల విధి విధానాలపై  అడపాదడపా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల తమిళనాడు అసెంబ్లీ నుండి ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌.ఎస్‌.‌రవి సభ నుండి అర్ధాంతరంగా నిష్క్రమించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడమే కాకుండా ప్రజాస్వామ్యానికి మాయనిమచ్చగా మిగిలింది.  ముఖ్యంగా గత కొంతకాలంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్‌ ‌మరియు గవర్నర్‌ ‌రవికి మధ్య పొసగడం లేదు. ప్రభుత్వం పంపిన దాదాపు 20 బిల్లులను గవర్నర్‌ ‌తొక్కిపెట్టారని ప్రచారంలో ఉంది.  ఈ క్రమంలోనే తమిళనాడులో గవర్నర్‌ ‌మరియు ప్రభుత్వాల మధ్య ఘర్షణలు మరింతగా చోటుచేసుకుంటూనే ఉన్నాయి.

కొత్త సంవత్సరంలో  జరిగే తమిళనాడు శాసనసభ తొలి సమావేశాలను ఉద్దేశించి గవర్నర్‌ ‌ప్రసంగించడం ఆనవాయితీగా జరుగుతుంది. శాసనసభా సమావేశాల తొలిరోజు జనవరి 9 నాడు గవర్నర్‌  ‌రవి ప్రవర్తించిన తీరు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. అసెంబ్లీలో 48 పేజీల ఆంగ్ల ప్రసంగాన్ని చదివిన గవర్నర్‌ ‘‌తమిళనాడు’ మరియు ‘ద్రావిడ’ అనే పదాలకు ప్రత్యామ్నాయ పదాలను వాడారు. ప్రభుత్వ ప్రసంగ పాఠంలోనూ  33 చోట్ల తమిళనాడు ప్రభుత్వం అని ఉంటే  ఆ పదాన్ని దాటవేసి ‘ఈ ప్రభుత్వం’ అంటూ ఆయన ఉచ్చరించారు.   పెరియార్‌, అం‌బేద్కర్‌, అన్నాదురై, కామరాజ్‌  ‌మరియు కరుణానిధి మొదలైన వారి పేర్లు ఉన్న  వాక్యాలను  ఆయన  ఉద్దేశ్యపూర్వకంగా పూర్తిగా వదిలివేశారు.  అలాగే  ముఖ్యంగా ‘రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయి అని, విదేశీ పెట్టుబడులు ఆకర్షిస్తూ అన్ని రంగాల్లో ముందు ఉంటుంది అని, అలాగే ఎన్ని కష్టాలు ఎదురైనా తమిళభాషని కాపాడుకుందాము అని,  మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం నడుచుకుంటుంది’ అని ఉన్న వాక్యాలను కూడా  ఆయన వదిలివేశారు. అంతేకాకుండా తమిళనాడుకు బదులు ‘తమిళగం’  అనే పేరుగా సవరించాలని ప్రకటించడం పట్ల  డి.ఎం. కె, అన్నా డి.ఎం. కె సహా రాష్ట్రంలోని అన్ని పార్టీలు  గవర్నర్‌ ‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రసంగ పాఠాన్ని గవర్నర్‌ అసెంబ్లీలో చదవడం సంప్రదాయం. ముఖ్యంగా  గవర్నర్‌ ఆమోదంతోనే ప్రసంగ పాఠాన్ని ముద్రించిననూ ఆయన రాజ్యాంగ నియమాలకు తిలోదకిస్తూ  ఆ పాఠాన్ని సరిగ్గా చదవకుండా తాను నిర్దేశించుకున్న రీతిలో చదవడం అనే చర్యలు రాష్ట్ర శాసనసభా సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్నాయి. అంతిమంగా ఆయన విధంగా వ్యవహరించడం ఏమాత్రం సహేతుకం కాదు. ఆయన ఒక రకంగా గవర్నర్‌ ‌గా కాకుండా కేంద్ర ప్రభుత్వ ప్రతినిధినిగా వ్యవహరించి రాజ్యాంగ విలువలను నిసిగ్గుగా మంటగలిపి గవర్నర్‌ ‌పదవికి మాయని మచ్చని మిగిల్చారు అని పేర్కొనవచ్చు. గవర్నర్‌ ‌రవి తీరును  ముఖ్యమంత్రి స్టాలిన్‌ ‌తీవ్రంగా నిరశించారు. గవర్నర్‌ ఆమోదంతో సభ్యులు అందరికి పంపిణీ చేసిన ఆంగ్ల  ప్రసంగాన్ని యథాతథంగా సభ రికార్డులో పొందుపరచాలని  ముఖ్యమంత్రి స్టాలిన్‌ ‌స్పీకర్‌ ‌ని కోరారు. అంతేకాకుండా ఆ  ప్రసంగ పాఠంలో లేకుండా గవర్నర్‌ ‌చదివిన వాక్యాలను రికార్డులో పొందుపరచరాదని  ఆయన పేర్కొన్న దరిమిలా యథావిధిగా అసెంబ్లీ తీర్మానాన్ని సభ ఆమోదించింది.

స్టాలిన్‌ ‌ప్రసంగిస్తుండగానే గవర్నర్‌  ‌కనీసం రాజ్యాంగ బాధ్యతలు కూడా విస్మరించి అసెంబ్లీ నుండి వెళ్లిపోయారు. సహజంగా ప్రతిపక్షాలు వాకౌట్‌ ‌చేస్తాయి. కాని గవర్నర్‌ అసెంబ్లీ నుండి వాకౌట్‌ ‌చేసి అందర్నీ ఆశ్చర్యపరిచి సంచలన వార్తగా నిలిచారు. ఈ విధంగా ఒక రాష్ట్ర గవర్నర్‌ ‌సభ నుండి వాకౌట్‌ ‌చేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం కావడం గమనార్హం. ఏది ఏమైనా సభ నడుస్తున్న సమయం లోనే   జాతీయ గీలాపన కూడా  జరగక ముందే గవర్నర్‌  ‌రవి సభ నుండి కావాలని నిష్క్రమించడం ఏమాత్రం సహేతుకం కాదు. నిజానికి గవర్నర్‌ ‌రాష్ట్ర శాసనసభ సమావేశాలను ప్రారంభిస్తూ ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని చడవాల్సి ఉన్ననూ ఆయన ఆవిధంగా చదవకపోవడం తమిళ సంస్కృతిని  అగౌరవపరచడమే అని డి.ఎం.కె. సభ్యులు  మరియు విపక్షాలు పేర్కొనడం  గమనార్హం. తమిళనాడు డి.ఎం. కె సర్కారుకు, రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. ‌రవికి మధ్య సభలో చోటుచేసుకున్న పరిణామాలు చిలికి చిలికి గాలివానగా మారి  తమిళనాట గోడలపైకి ఎక్కాయి. ‘రాష్ట్రం నుండి వెళ్లిపోండి’ అంటూ మరుసటి రోజు చెన్నై పలు ప్రాంతాలలో పోస్టర్‌ ‌లు వెలిశాయి.

నేడు కొన్ని రాష్ట్రాలలో కొందరు గవర్నర్లు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ గవర్నర్‌ ‌పదవికి తీవ్ర కళంకం తీసుకువస్తున్నారు. ఇటీవలి కాలంలో కేరళ గవర్నర్‌ అరిఫ్‌  ‌మహమ్మద్‌  ‌ఖాన్‌, ‌తెలంగాణ గవర్నర్‌ ‌తమిళిసై మొదలైన వారు ఆయా  రాష్ట్ర ప్రభుత్వాలతో వైరాలు కొనితెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ గవర్నర్‌ ‌తమిళిసై అనుసరిస్తున్న నిరంకుశ అప్రజాస్వామిక విధానాలని నిరసిస్తూ  ఇటీవల భారత కమ్యూనిస్ట్ ‌పార్టీ చలో రాజభవన్‌ ‌కి పిలుపు ఇచ్చి ‘గవర్నర్‌ ‌వ్యవస్థని రద్దు చేయాలి’ అని నినదించడం విశిష్ట ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఏది ఏమైననూ ‘రబ్బర్‌ ‌స్టాంప్‌ ‌వంటి ఏలాంటి ఉపయోగం లేని గవర్నర్‌ ‌వ్యవస్థని రద్దు చేయడం సముచితం’ అని ఘంటాపథంగా చెప్పవచ్చు.
– జె.జె.సి.పి. బాబూరావు
రీసెర్చ్ ‌స్కాలర్‌, ‌సెల్‌: 94933 19690.

Leave a Reply