హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3 : రెండేళ్ల సుధీర్ఘ కాలం తర్వాత గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టారు. గతేడాది సాంకేతిక కారణాలతో గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ ఏడాది కూడా గవర్నర్ స్పీచ్ లేకుండానే సమావేశాలు నిర్వహించాలనుకున్నా చివరకు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. నాటకీయ పరిణామాల మధ్య గవర్నర్ ప్రసంగానికి ఓకే చెప్పింది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వొచ్చిన గవర్నర్ తమిళిసైకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వాగతం పలికారు.
శాసనసభ, మండలి సభ్యులకు చిరునవ్వుతో అభివాదం చేస్తూ గవర్నర్ ముందుకు కదిలారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమెను అనుసరించారు. ఇటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా తమకు కేటాయించిన సీట్లలో నుంచి లేచి గవర్నర్‌కు, ముఖ్యమంత్రికి అభివాదం చేశారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ పోచారం..గవర్నర్‌ను పోడియం వద్దకు తీసుకెళ్లారు. అందరూ జాతీయగీతం పాడారు. ఆ తర్వాత గవర్నర్ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించి… ‘జై తెలంగాణ’…జై హింద్ నినాదాలతో గవర్నర్ స్పీచ్ ముగించారు. ప్రసంగం పూర్తయిన తర్వాత సభ నుంచి వెళ్తున్న సమయంలో మండలి చైర్మన్, స్పీకర్, సీఎం కేసీఆర్, మంత్రి వేముల తమిళిసై వెంట వెళ్లి వీడ్కోలు పలికారు.