- గల్ఫ్ వలస కార్మికుల కుటుంబాల దుర్భర జీవితాలు
- అనేక కారణాలతో రోజుకు 15 మంది ఎన్ఆర్ఐల మృత్యువాత
- ఎన్ఆర్ఐ పాలసీ ప్రవేశ పెట్టాలని ప్రభుత్వానికి గల్ఫ్ వలస కార్మికుల డిమాండ్
రామ కిష్టయ్య సంగన భట్ల…
దేశ సరిహద్దులు దాటి అరబ్ గల్ఫ్ దేశాలలో సేవలందిస్తున్న వలస కార్మికులు భారతదేశానికి అపారమైన విదేశీ మారకద్రవ్యం ఆర్జించి పెడుతున్నారు. దేశ సరిహద్దుల్లో సేవలందిస్తున్న భారత సైనికుల మాదిరిగా వలస కార్మికులు కూడా దేశాభివృద్ధికి పాటుపడుతున్నారు. గల్ఫ్ దేశాలకు వలస వెళ్లే వారు 95% ఒంటరిగానే వెళుతున్నారు. తక్కువ వేతనం వలన కుటుంబాన్ని వెంట తీసుకెళ్ళలేరు. కార్మికులు తమ భార్యా బిడ్డలను, తల్లి దండ్రులను, కుటుంబాన్ని, కన్న ఊరును, దేశాన్ని వొదిలి విదేశాల్లో ఒంటరిగా జీవిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులు కూడా ఎడబాటుతో బాధపడుతున్నారు. బతుకు తెరువు కోసం ఎడారి బాట పట్టిన 15 లక్షల మంది తెలంగాణ గల్ఫ్ వలస కార్మికుల, వారి కుటుంబాలవి దుర్భర జీవితాలు. వలస వెళ్లిన అభాగ్యులు ఎందరో వివిధ కారణాలలో గల్ఫ్ దేశాలలో అసువులు బాస్తున్నారు. ఆరు గల్ఫ్ దేశాలలో 89 లక్షల మంది భారతీయులు నివసిస్తుండగా ఇందులో సగటున రోజుకు పదిహేను మంది ఎన్నారైలు మృత్యువాత పడుతున్నారు.
ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్ 2018లో విడుదల చేసిన నివేదిక ప్రకారం ఎన్నారైలు ఎక్కువగా హృదయ సంబంధిత సమస్యల కారణంగా మరణిస్తున్నారు. పగలు ఎండలో..రాత్రి ఏసీ వాతావరణంలో నివసించడం, శారీరక, మానసిక ఒత్తిడి, జీవన శైలి, నిద్ర లేమి, ఆహారపు అలవాట్లు, స్మార్ట్ ఫోన్ అధిక వినియోగం, ఆరోగ్య రక్షణకు తగిన చర్యలు తీసుకోకపోవడం లాంటి కారణాలు ఆకస్మిక మరణాలకు కారణాలని కొందరి అభిప్రాయం.
గల్ఫ్ దేశాల్లో భారతీయుల బలవన్మరణాలు పెరుగుతున్నాయి. మానసిక, వ్యక్తిగత సమస్యలు, అప్పులు, కలలు కల్లలవడం, పనిలో ఒత్తిడి, అధమ స్థాయిలో జీవన పరిస్థితులు, సరి అయిన వేతనాలు లేకపోవడం, భౌతిక దోపిడీ, మోసం, ద్రవ్యోల్బణం, ప్రియమైన కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం, ఒంటరితనం, సమస్యలను భావాలను పంచుకోవడానికి ఒక సర్కిల్ లేకపోవడం, వైవాహిక జీవితానికి దూరం, నిరాశ, మద్యానికి బానిస అవడము లాంటి కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 2014 నుండి 2019 వరకు ఆరు సంవత్సరాల కాలంలో ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో 33,930 మంది ప్రవాస భారతీయులు మృతి చెందారని ప్రభుత్వం 20 నవంబర్ 2019 న లోక్ సభకు తెలిపింది. ఆరేళ్లలో సౌదీ అరేబియా (15,022), యుఏఈ (9,473), కువైట్ (3,580), ఓమాన్ (3,009), ఖతార్ (1,611), బహరేన్ (1,235) మంది ఎన్నారైలు చనిపోయినట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
విదేశాలలో ప్రమాదాల్లో మరణించిన భారతీయుల వివరాలను 3 డిసెంబర్ 2021న ప్రభుత్వం లోక్ సభలో వెల్లడించింది. గత మూడేళ్లలో 63 దేశాలలో 2,384 మంది ఎన్నారైలు ప్రమాదాలలో మృతి చెందారు. సౌదీ అరేబియా (683), యుఏఈ (370), కువైట్ (195), ఓమాన్ (94), ఖతార్ (60), బహరేన్ (44) ఆరు గల్ఫ్ దేశాలలో 1,446 మంది ప్రమాదాలలో మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన భారతీయుల ప్రమాద మరణాలలో గల్ఫ్ లోనే 61 శాతం సంభవించాయి. ఇదిలా ఉండగా గత మూడేళ్లలో నేపాల్(227), ఫిలిప్పీన్స్(153), మలేసియా(76), సింగపూర్(55) మంది ప్రమాదాల్లో మృతి చెందారు. విదేశాల్లో 468 ప్రమాద పరిహార కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కువైట్ (142), ఓమాన్ (127), సౌదీ అరేబియా (85), ఖతార్ (41), యుఏఈ (24) కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
విదేశాలలో కోవిడ్ వలన 4,048 మంది ఎన్నారైలు మృతి చెందారని ప్రభుత్వం 3 డిసెంబర్ 2021న లోక్ సభకు తెలిపింది. సౌదీ అరేబియా (1,154), యుఏఈ(894), కువైట్(668), ఓమాన్(551), బహరేన్(200), ఖతార్(109) ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో 3,576 మంది కోవిడ్‌తో చనిపోయారు. అన్ని దేశాల మొత్తం మరణాలలో పోలిస్తే గల్ఫ్‌లోనే 88 శాతం మంది కోవిడ్‌తో మృతి చెందారు.
2015 నుండి 2019 వరకు అయిదు సంవత్సరాల కాలంలో 125 దేశాలలో మృతి చెందిన 21,930 మంది మృతదేహాల శవపేటికలను భారత్‌కు తెప్పించామని ప్రభుత్వం 5 ఫిబ్రవరి 2020న లోక్ సభకు తెలిపింది. వీటిలో అత్యధికం గల్ఫ్ దేశాలలో సంభవించడం గమనార్హం. శంషాబాద్ విమానాశ్రయం పోలీస్ స్టేషన్ రికార్డుల ప్రకారం..ప్రతి సంవత్సరం దాదాపు 200 శవపేటికలు గల్ఫ్ దేశాల నుండి తెలంగాణకు చేరుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2 జూన్ 2014 నుండి ఏప్రిల్ 2022 వరకు దాదాపు ఎనిమిదేళ్ల కాలంలో సుమారు 1,600 మంది తెలంగాణ వలస కార్మికుల శవపేటికలు రాష్ట్రానికి చేరుకున్నాయి. శవపేటికల కోసం నెలల తరబడి ఎదిరి చూడాల్సి వొస్తున్నది. కొందరిని అక్కడే ఖననం చేస్తున్నారు. గల్ఫ్ దేశాల హాస్పిటళ్ల మార్చురీ(శవాగారం) లలో వందలాది భారతీయుల మృతదేహాలు దిక్కులేక మగ్గుతున్నాయి.
ఇదిలా ఉండగా…మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి ఆనాటి ఉమ్మడి ఆంధప్రదేశ్ ప్రభుత్వం రూ. ఒక లక్ష చొప్పున ఎక్స్ గ్రేషియా (మృతధన సహాయం) ప్రకటిస్తూ 9 మే 2008 నాడు జీఓ నెం.266ను జారీ చేసింది. తర్వాతి కాలంలో గల్ఫ్ దేశాలలో వివిధ కారణాలతో చనిపోయిన పేద కార్మికులకు కూడా ఆర్ధిక సహాయం చేయడం ప్రారంభమైంది. కొంత మందికి ఎక్స్ గ్రేషియా అందింది.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన 15 లక్షల మంది కార్మికులు గల్ఫ్ దేశాలలో నివసిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ప్రవాస భారతీయుల పాత్ర ముఖ్యంగా…గల్ఫ్ దేశాలలోని వలస కార్మికుల పాత్ర మరువలేనిది. గతంలో సీఎం కేసిఆర్ ప్రకటించిన విధంగా…గల్ఫ్ బాధితులను ఆదుకోవడం కోసం ప్రభుత్వం 500 కోట్ల నిధులు ఏర్పాటు చేయాలని, గల్ఫ్ మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, ఎన్నారై పాలసీ(ప్రవాసీ విధానం) ఏర్పాటు చేయాలని, ఆరోగ్య బీమా, జీవిత బీమా, ప్రమాద బీమా, పెన్షన్ లాంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని గల్ఫ్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.