Take a fresh look at your lifestyle.

కోర్టు అక్షింతలు వేసినా కదలని ప్రభుత్వాలు

వలస కార్మికుల  విషయంలో  న్యాయస్థానాలు   ఎన్ని మొట్టికాయలు వేసినా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీరు మార్చుకోవడం లేదు. పదిహోను రోజుల లోగా వలస కార్మికులను స్వ స్థలాలకు పంపాలని  ఆదేశించిన సర్వోన్నత న్యాయస్థానం  ఈ నెలారంభంలో ఆదేశించింది. మళ్ళీ ఇప్పుడు మంగళవారం నాడు ఇదే  అంశంపై రాష్ట్ర హైకోర్టు మరింత  తీవ్రంగా హెచ్చరించింది.  శ్రామిక్ రైళ్ళ కోసం రైల్వే శాఖను ఎందుకు అడగలేదని  రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వలస కార్మికుల విషయంలో కేంద్రం  ప్రదర్శిస్తున్న అలసత్వాన్ని మాజీ కేంద్ర మంత్రి  శశి థరూర్ కేంద్రాన్ని తప్పు పట్టారు. కొరోనాను ఎదుర్కొనేందుకు  కేంద్రం  ఐదువిడతలగా  ప్రకటిస్తూ వస్తోంది. ఇదే సమయంలో ప్యాకేజీలను ప్రకటిస్తూ వొస్తుంది . నిజానికి   ఈ లాక్ డౌన్ ల వల్ల రైతుల పరిస్థితి మరింత  ఛిద్రంగా మారిందే తప్ప వారికి ఏమాత్రం ప్రయోజనకరంగా లేవన్న  థరూర్ వ్యాఖ్యల్లో నిజమెంతో ఉంది. లాక్ డౌన్ ల వల్ల రైతులతో పాటు వలస కార్మికులు ఎక్కువ నష్టపోయారు.   దారీ, తెన్నూ లేని పరిస్థితిలో ఉన్న వలస కార్మికులను ఆదుకోవల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇంతవరకూ తీసుకున్న చర్యలు మొక్కుబడిగానే సాగుతున్నాయి.  కోర్టు ఉత్తర్వులను కూడా  ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.    ప్రభుత్వాల పరిస్థితి చూస్తుంటే చెవిటివాని ముందు శంఖం ఊదినట్టు ఉందంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు చాలా తీవ్రమైనవి.

జనాభా లెక్కల ప్రకారం దేశంలో  వలస కార్మికుల సంఖ్య  15  కోట్లు పైనే. వీరిలో వ్యవసాయ కూలీలు, నిర్మాణ రంగంలో పని చేసేవారు, ఇటుకల బట్టీల్లో పని చేసేవారు , క్వారీల్లో  ఎక్కువ మంది ఉన్నారు.  వీరు పని చేసే ప్రాంతాల్లో తగిన వసతులు ఉండవు.  ఖాళీ ప్రదేశాల్లో గుడిసెలు వేసుకుని   బతుకులీడుస్తున్నారు.   భవనాల పక్కన   వేసుకునే ఈ గుడిసెలపై  ప్రహరీ గోడలకు  భారీ వర్షాలకు కూలి వలస కార్మికులు మరణించడం   సర్వసాధారణం. వీరికి  ఏ చట్టాలూ  వర్తించవు. అందువల్ల వీరి కుటుంబాలకు  పరిహారం లభించడం లేదు. వలస కార్మికులకు గుర్తింపు కార్డులిస్తామంటూ   అధికారంలో ఉన్న నాయకులు ప్రకటనలు చేస్తుంటారు.   అలాంటి గుర్తింపు కార్డులు ఉంటే   పరిహారం క్లెయిమ్ చేయడానికి వీలుంటుంది. గుర్తింపు కార్డులనేవి మతపరంగా  మనుషులను వేరు చేయడానికి మాత్రమే ఇస్తున్నారు. అలాగే, వోటు బ్యాంకు రాజకీయాలకు అవి ఉపయోగ పడుతున్నాయి. వలస కార్మికులకు ప్రభుత్వాలు పంపిణీ చేసే  ఆహార ధాన్యాలూ, నిత్యావసర వస్తువులు దలారుల పాలవుతున్నాయి. దలారీ వ్యవస్థను రద్దు చేస్తే తప్ప ప్రభుత్వాలు  ఎన్ని ప్యాకేజీలు ప్రకటించినా, ఎంత సాయం అందించినా అవి అసలైన లబ్ధిదారులకు చేరవు.  1948 చట్టం ప్రకారం  పనికి తగిన వేతనాన్ని పొందే అర్హత వలస కార్మికులకు కూడా ఉంది. కానీ, వేతనాల చెల్లింపులో స్థానికులకూ, వలస కార్మికులకూ మధ్య వ్యత్యాసం గురించి అందరికీ తెలిసిందే. అయినా సుదూర ప్రాంతాల నుంచి వొస్తున్న వలస కార్మికులను కాంట్రాక్టర్లు, భవననిర్మాణ రంగానికి చెందిన బిల్డర్లు వేతనాల విషయంలో దోపిడీ చేస్తున్నారని  కార్మిక సంఘాలు ఎన్నో సందర్భాల్లో ఆరోపించాయి. కానీ, వాటి ఆరోపణలను పట్టించుకున్నవారెవరూ లేరు.  కొరోనా నేపథ్యంలో లాక్ డౌన్  సడలింపుల తర్వాత  ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైళ్ళలో తమకు జాగా దొరక్క , తిండి తిప్పలు లేక వ లస కార్మికులు స్టేషన్లలో పడిగాపులు కాస్తున్నారు. వారి పరిస్థితిని గమనించి తగిన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని  న్యాయస్థానాలు ఆదేశించినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు.  రైళ్ళ కోసం రోజుల తరబడి నిరీక్షించినా ప్రయోజనం లేకపోవడంతో   సామగ్రితో పిల్లలు, వృద్దులతో వలస కార్మికులు ఎన్నో వందల మైళ్ళు నడిచి వెళ్తున్నారు.

 మూడు నెలలుగా   రేషన్ బియ్యం తీసుకోని వారికి  12 కిలోల బియ్యం, 1500 రూపాయిల నగదు ఎందుకు ఇవ్వలేదో తెలియజేయాలని  ప్రభుత్వాన్ని  కోర్టు ఆదేశించింది. ఇటుక బట్టీల్లో, గనుల్లో పని చేసే కార్మికులంతా బీహార్, తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారే. వారిని పనుల్లో నియమించే కాంట్రాక్టర్లు, గనుల యజమానులు    వారి యోగక్షేమాల గురించి పట్టించుకోకపోవడం పట్ల కోర్టు  తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. వలస కార్మికుల సంక్షేమం విషయంలో రాష్ట్రానికో రీతిలో   నిబంధనలు అమలు జరగడం పట్ల కూడా కోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. కేంద్రం ఈ విషయంలో శ్రద్ధ తీసుకుని రాష్ట్రాల మధ్య సమన్వయం ఉండేట్టు చూడాలని ఆదేశించింది.

 మరో వంక లాక్ డౌన్ నిబంధనలను సడలించినప్పటికీ ముడి సరకు లేకపోవడం వల్ల  పరిశ్రమలు ప్రారంభం కావడం లేదు. పరిశ్రమల్లో పని చేసే కార్మికులలోనూ వలస కార్మికులు ఉంటారు. వారంతా స్వస్థలాలకు వెళ్ళిపోవడం వల్ల కార్మికుల కొరత ఏర్పడినట్టు సమాచారం.  తమిళనాడు, బెంగాల్ ల నుంచి ఇనుప సామగ్రి రవాణా జరగక పోవడం వల్ల  వాటి ధరలు  పది నుంచి  15 శాతం పెరిగాయని పారిశ్రామిక వేత్తలు చెబుతున్నారు. పరిశ్రమలకు ముడి సరకు ఎంత ముఖ్యమో, శ్రామిక శక్తి అంతే ముఖ్యం,. పరిశ్రమలను  ప్రారంభించేందుకు అనుమతులు ఇస్తున్న ప్రభుత్వాలు  వలస కార్మికులను ఇక్కడే ఉంచి వారికి తగిన వసతి సౌకర్యం కల్పించి ఉండాల్సిందని పలువురు పరిశ్రమల యజమానులు పేర్కొంటున్నారు. లాక్ డౌన్ నిబంధనల విధింపులో కానీ,  సడలింపులో కానీ, ప్రభుత్వం తగిన రీతిలో వ్యవహరించకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అంతేకాక, ముడిసరకు సేకరణలో ప్రభుత్వం జారీ చేసే ఆదేశాలు సక్రమంగా అమలు జరగడం లేదు,. దశాబ్దాలుగా తిష్ఠ వేసిన  దలారీ వ్యవస్థ వల్లనే  ఇటు కార్మికులకూ, అటు ప్రభుత్వానికీ తీరని నష్టం జరుగుతోంది.

Leave a Reply