Take a fresh look at your lifestyle.

ప్రశ్నించే గొంతుక ల పట్ల ప్రభుత్వాలు కక్షపూరిత చర్యలు విడనాడాలి

తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర నాయకులు పందుల సైదులు
నల్లగొండ: ప్రజాస్వామికవాది ,కవి,ప్రజా గొంతుక వరవరరావు తో పాటు దేశ వ్యాప్తంగా ఆకారణంగా వివిధ జైల్లో నిర్బంధించబడిన ప్రజా ఉద్యమకారులందరిని విడుదల చేయాలని తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర నాయకులు పందుల సైదులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసారు. గురువారం నల్లగొండ పట్టణంలో  విద్యావంతుల వేదిక కార్యాలయంలో  వరవరరావు, సాయిబాబా తో పాటు అక్రమంగా నిర్బంధించబడిన రాజకీయ ఖైదీలందరిని విడుదల చేయాలని తన కుటుంబ సభ్యులతో కలిసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహజ న్యాయ సూత్రాలను, చట్టాలను అతిక్రమిస్తూ దేశ వ్యాప్తంగా విద్యార్థులు, కవులు, రచయితల, మేధావులపై ప్రభుత్వాలు నిర్బంధాన్ని విధిస్తున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రశ్నించే గొంతులను బలవంతంగా నొక్కే కార్యక్రమం కొనసాగుతున్నదని అందులో భాగంగానే తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎనబై ఏండ్ల వయస్సు పైబడి వున్న వరవరరావును,సాయిబాబా  ఆరోగ్యాలు క్షీణిస్తున్నా మోసపూరిత అవాస్తవ అర్థరహిత అభియోగాలను మోపి హింసిస్తున్నారన్నారు.
వృద్దులు, వికలాంగులు, మహిళలు, అమాయక యువకులని కూడా చూడకుండా ఏండ్ల కొలది జైల్లల్లో పెట్టి  కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. దేశ ద్రోహ అభియోగాలు మోపబడుతున్నాయన్నారు. నిజానికి వీరి కార్యక్రమాలు, నమ్మే సిద్ధాంతాలు రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకొనుటకే నని తెలంగాణ విద్యావంతుల వేదిక బలంగా నమ్ముతున్నదన్నారు. భీమాకోరెగావ్ కేసు విషయంలో తెలంగాణ తొలిదశ ఉద్యమ కారుడు, కవి, రచయిత, హక్కుల కార్యాకర్త వరవర రావుని 2018 నవంబరు నుండి జైల్లో పెట్టారు. ఆయన మీదనే కాక సురేంద్ర గాడ్లింగ్, శోమసేన్, రోనా విల్సన్, సుధీర్ ధావలే, మహేష్ రౌత్, సుధా భరద్వాజ్, వర్మన్ గొన్సాల్వేస్, అరుణ్ పెరిరా లపై అభియోగాలను మోపి అరెస్ట్ చేసారన్నారు. గత రెండేళ్లుగా ఈ కేసు విచారణ దర్యాప్తు సాక్ష్యాధారాల విషయంలో ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. ఆదివాసుల హక్కుల కోసం నిరంతరం పోరాడిన వారు 90% పైబడి శరీర అవయవాల వికలత్వంతో చక్రాల కుర్చీలో గత నాలుగేండ్లుగా జైల్లో న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫసర్ జి.ఎన్. సాయిబాబా. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పౌరసత్వ సవరణ చట్టం (సి ఏ ఏ ) జాతీయ పౌరసత్వ రిజిస్టర్ (ఎన్ ఆర్ సీ ) లకు వ్యతిరేకంగా 2019 డిసెంబర్ నుండి ఢిల్లీ షాహిన్ భాగ్ కేంద్రంగా దేశావ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. యూనివర్సిటీ విద్యార్థులు, మహిళలు ఈ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు.
కరోనా లాక్డౌన్ ను ఆసరాగా తీసుకొని గత రెండు నెలలుగా సాఫురా జర్గర్, మీరన్ హైదర్,  ఆసిఫ్ ఇక్బల్ తన్హా, నటాషా నార్వల్,  దీవంగనా కలీ, ఇష్రత్ జహా, గుల్ ఫీషా ఫాతిమా, షాజీల్ ఇమామ్ మరియు వందల కొలది యువతీ యువకులపై వివిధ కేసులు మోపి జైళ్ళల్లో బంధించారు. కోవిడ్ ను పురస్కరించుకొని జైల్లో ఉండే ఖైదీలను విడుదల చేయమని, జైళ్లు ఖాళీ చేయమని సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను  బుట్ట దాఖలు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న ఈ నిర్బంధాన్ని,  ప్రజా కవుల పట్ల రచయితల పట్ల ప్రభుత్వాల దమనకాండను తెలంగాణ విద్యావంతుల వేదిక తీవ్రంగా ఖండిస్తుందన్నారు. వర వరరావు, సాయిబాబా తో పాటు వివిధ కేసులలో అభియోగాలు మోపబడిన విద్యార్థులను, కవులు, మేధావులు మరియు రాజకీయ ఖైధీలను విడుదల చేయాల్సిందిగా తెలంగాణ విద్యావంతుల వేదిక డిమాండ్ చేస్తుందన్నారు.

Leave a Reply