Take a fresh look at your lifestyle.

విద్య, నిరుద్యోగ సమస్యలపై ప్రభుత్వాల శీతకన్ను

సమస్యలపై పాలకుల మెడలు వంచే పోరాటాలకు సిద్దం కావాలి
ఇచ్చిన హామీలు బుట్టదాఖలు చేస్తున్న బీజేపీ, టీఆర్‌ఎస్‌లు
సమరశీల పోరాటాల ద్వారానే హక్కులు సాధ్యం
– సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ

మేడిపల్లి, ఆగస్టు 23 (ప్రజాతంత్ర విలేఖరి) : విద్య, నిరుద్యోగ సమస్యలపై పాలకవర్గాలు పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌ ‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల ముందు బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ఇచ్చిన హామీలు బుట్టదాఖలు చేస్తూ విద్యా రంగ సమస్యలు పరిష్కరించకుండా, ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నాయని ఏరు దాటాక తెప్ప తగలేసినట్లు వ్యవహరిస్తున్నాయని ఈ సమస్యల పరిష్కారానికి సమరశీల పోరాటాలు తప్ప మరో మార్గం లేదని స్పష్టం చేశారు. ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విభాగాల ఆధ్వర్యంలో ‘‘విద్యార్ధి, నిరుద్యోగ పోరు సదస్సు’’ ఉప్పల్‌ ‌డిపో సమీపంలో సోమవారం నాయకులు సత్యప్రసాద్‌, ‌గ్యార క్రాంతికుమార్‌ల అధ్యక్షతన నిర్వహించారు. ఈ సదస్సులో చాడ వెంకట్‌ ‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని విద్య, నిరుద్యోగ సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న తీరును తూర్పారబట్టారు. ఎన్నికలకు ముందు ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కేంద్రంలో నరేంద్ర మోడీ, ఇంటికో ఉద్యోగం ఇస్తామని రాష్ట్రంలో కేసీఆర్‌ ‌మాయమాటలతో అధికారం చేజిక్కించుకుని ఆ వాగ్దానాలు తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు.

కేంద్రంలో మోడీ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ రాజ్యాంగం కల్పించిన హక్కులు, రిజర్వేషన్లు లేకుండా చేయాలని వ్యూహ రచన చేయడంతో పాటు నూతన జాతీయ విద్యా విధానం – 2000 పేరుతో విద్యను కాషాయీకరణ, ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో నీళ్ళు, నిధులు, నియామకాల పేరు చెప్పుకుని అధికారం అనుభవిస్తున్న టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఉద్యోగాల ఖాళీలన్నింటినీ భర్తీ చేయకుండా నిప్పులమీద నీళ్ళు చల్లినట్లు తూతూ మంత్రంగా అరకొర భర్తీలు చేపట్టి గొప్పలు పోతోందని చాడ దుయ్యబట్టారు. దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాలు నిండినా ఆ ఫలాలు సామాన్య ప్రజలకు ఇప్పటికీ అందకపోవడం ప్రభుత్వాల దివాళాకోరు, అసమర్ధ పరిపాలనకు నిదర్శనమని ఎద్దేవా చేశారు.

న్యాయ పరంగా రావాల్సిన ఉద్యోగాలను ప్రభుత్వాలు ఎందుకు భర్తీ చేయడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. సమస్యలపై పాలకుల మెడలు వంచే పోరాటాలకు సిద్దం కావాలని పిలుపునిచారు. సదస్సులో ఏఐఎస్‌ఎఫ్‌ ‌రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.ఎ ‌స్టాలిన్‌, ఉపాధ్యక్షుడు పుట్ట లక్ష్మణ్‌, ఏఐవెఎఫ్‌ ‌ప్రధానకార్యదర్శి ఎం.అనిల్‌, ‌నాయకులు ఉమామహేష్‌, ‌కె. నాగజ్యోతి, కె. ధర్మేంద్ర, పి. శివ, చన్నబాబు, హరీష్‌, ‌వినీల్‌, ‌రాజు, రఘు, సాయి, శ్రీకాంత్‌, ‌వినయ్‌, ‌రాము, శివానంద్‌, ‌వంశీ, శంకర్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply