Take a fresh look at your lifestyle.

‌ప్రజల ఆరోగ్య బాధ్యత ప్రభుత్వాలదే

దేశ అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన కొలమానం ఆరోగ్యం. భారత రాజ్యాంగం పౌరులకు ఆర్టికల్‌ 21 ‌ప్రకారం జీవించే హక్కు ప్రసాదించింది. జీవించడం అంటే కేవలం బతకడం మాత్రమే కాదు. ఆరోగ్యంగా బతకడమని అర్థం. అయితే వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా వుంది. నరేంద్ర మోడీ అధికారం లోకి వచ్చిన తర్వాత 2002 జాతీయ ఆరోగ్య పథకా’న్ని 2017లో కొంత మార్పులు చేర్పులు చేసి మళ్ళీ ‘జాతీయ ఆరోగ్య విధానం-2017’గా ప్రకటించినారు. ఆ పథకాన్ని 2018లో ‘ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌పథకం’గా మార్చి ప్రకటించినారు. ఈ విధంగా ఆరోగ్య పథకాలు మాత్రం అనేక రూపాంతరాలు చెంది చివరికి ‘ఆరోగ్య బీమా పథకం’ కింద మారిపోయింది. కేవలం పథకాల పేరు మార్పులు ఇతర విధంగా రూపాంతరం చెందినవి కానీ దేశ ప్రజల ఆరోగ్యం నానాటికి కృంగి కృషించి పోతున్నది  మరియు  ఆరోగ్య సూచికలు నానాటికీ దిగజారిపోతున్నాయి తప్ప మెరుగుపడలేదు, మెరుగుపరడానికి ఖచ్చితమైన ఎలాంటి చర్యలు తీసుకున్నట్లు కూడా కనపడడం లేదు.

భారత్‌లో వైద్య రంగానికి కేటాయిస్తున్న బడ్జెట్‌ ‌జిడిపిలో కేవలం 1.15 శాతం మాత్రమే.జాతీయ ఆరోగ్య విధానం ప్రకారం  ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు బడ్జెట్‌ ‌కేటాయింపు పెంచుతామన్నారు. కానీ గడిచిన సంవత్సరాల్లో సంవత్సరాల్లో ఆరోగ్య బడ్జెట్‌ ‌మొత్తం జీడీపీలో 1.1 శాతానికి మించి కేటాయించలేదు. అంతర్జాతీయ సగటు కేటాయింపులు చూస్తే 4.9 శాతంగా ఉంది. మళ్లీ ఇప్పుడు జాతీయ విధానం 2017 ప్రకారం ప్రస్తుతం 1.15 శాతంగా ఉన్న ఆరోగ్య బడ్జెట్‌ను 2025 నాటికి 2.25 శాతానికి పెంచుతామని ప్రభుత్వం పేర్కొన్నది. కానీ గత ప్రభుత్వాలు 3 శాతం పెంచుతామని పేర్కొన్న దానికంటే ప్రస్తుత ప్రభుత్వం తక్కువ ప్రతిపాదించింది. అంతర్జాతీయంగా ఉన్న కేటాయింపులు 5 శాతంతో పోల్చి చూస్తే ఈ కేటాయింపుల పెంపుదల సగం కంటే తక్కువగా ఉండటం బాధాకరం.

సాధారణంగా బ్రాండెడ్‌ ఔషధాలను తయారు చేసే కంపెనీలే జనరిక్‌ ‌మందులను కూడా ఉత్పత్తి చేసి మార్కెట్‌ ‌చేస్తుంటాయి. కాబట్టి బ్రాండెడ్‌ ‌మందుకి జనరిక్‌ ‌మందుకి వాటి నాణ్యతా ప్రమాణాలలో, పని తీరులో ఎటువంటి తేడా ఉండదు. కానీ ధరలలో 300 శాతం నుంచి 1000 శాతం వరకు భారీగా తేడా ఉంటుంది. జనరిక్‌ ‌మందు ఖరీదు రూ.2 ఉంటే మందులు కంపెనీలు బ్రాండెడ్‌ ‌మందు ధరలను రూ. 40 నుండి రూ. 50 గా నిర్ణయిస్తాయి. అంతేకాకుండా జనరిక్‌ ‌మందులపై అత్యంత దుర్మార్గంగా దుష్ప్రచారం చేస్తున్నారు.  మందులు కంపెనీలు జనరిక్‌ ‌మందులను తొక్కేస్తూ బ్రాండెడ్‌ ‌మందుల ద్వారా భారీ స్థాయిలో దోపిడీ చేస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను తట్టుకునేందుకు వాడుతున్న మందులు, మాస్కులను కూడా నకిలీవి తయారు చేసి ఇబ్బడి ముబ్బడిగా అమ్మేస్తూ ప్రజలను అత్యంత దారుణంగా దోపిడికి గురి చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం వైద్యుల నిష్పత్తి  పెరుగుతున్న జనాభా అనుగుణముగా ఉండడం లేదు.మన దేశంలో నేటికీ లక్షల మంది డాక్టర్లు, నర్సుల కొరత ఉన్నది. ఇంతే కాక టెక్నీషియన్ల కొరత ఎప్పటికీ తోడుగానే ఉంటున్నది. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వైద్య ఆరోగ్య సిబ్బందిని మినహాయిస్తే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో దాదాపు 50 శాతం తక్కువగా ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ విధమైన సిబ్బంది కొరతతో ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలు అందించడం  చాలా కష్టంతో కూడుకున్న పని.

మన దేశంలో ప్రస్తుతం ఆరోగ్య అవసరాలను తీర్చేందుకు దాదాపు 85 శాతం కార్పొరేట్‌  ‌వైద్య వ్యవస్థలే ఆధారంగా మారిపోయాయి. అనేక కార్పొరేట్‌ ‌సంస్థలు వైద్య రంగంలో ప్రవేశించి వైద్యాన్ని వ్యాపారంగా మార్చేసినావి. ఎందుకంటే అవసరం ఉన్నా లేకున్నా వైద్య పరీక్షలు అన్నింటినీ రాసి ఖర్చును తడిసి మోపెడు చేయడం మందుల రేట్లు 300 శాతం నుంచి 1000 శాతం వరకు అదనంగా వేసి దోచుకోవడం, డాక్టర్ల ఫీజులు కింద లక్షలాది రూపాయలు వసూలు చేయడం మొదలైన చర్యలతో మానవ విలువలు తుంగలో తొక్కి పేషెంట్లను దోపిడీ చేస్తూ ప్రజారోగ్యాన్ని పెద్ద వ్యాపారంగా మార్చుతనే ఉన్నారు తత్ఫలితంగా మిగిలి ఉన్న ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలు ప్రభుత్వ విధానాల పర్యవసానంగా రోజురోజుకు దిగజారిపోతూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నాయి. ప్రపంచీకరణవలన ప్రజారోగ్య రంగంలోకి కొన్ని విదేశాలలో ఉన్న విధముగా ఆరోగ్య బీమాలు దేశంలోనికి ప్రవేశించినాయి. ఇన్సూరెన్స్ ‌రెగ్యులేటరీ అండ్‌ ‌డెవలప్‌ ‌మెంట్‌  అథారిటీ(ఐఆర్‌డిఏ) చట్టం తెచ్చి భారతదేశం లోకి విదేశీ ప్రైవేట్‌ ఇన్సూరెన్స్ ‌కంపెనీలకు తలుపులు తెరిచినారు. దేశంలో కూడా కొత్త కొత్త ప్రైవేట్‌ ఇన్సూరెన్స్ ‌కంపెనీలు పుట్టుకొచ్చినాయి. ప్రభుత్వం ఈ విధమైన చట్టాలను తెచ్చి ప్రభుత్వ ప్రైవేటు ఇన్సూరెన్స్ ‌కంపెనీలకు అవకాశం కల్పించింది.

వాస్తవానికి రాజ్యాంగం ప్రకారం ప్రజారోగ్యం ప్రభుత్వాల బాధ్యత. ప్రజల హక్కు. కానీ ప్రభుత్వాలు రాజ్యాంగ నిబంధనలు తుంగలో తొక్కి ప్రజారోగ్య బాధ్యత నుంచి తప్పుకోవాలని ఆరోగ్య పథకాలు ప్రకటించడం సిగ్గుచేటు. కేవలం అత్యవసర వైద్య అవసరాల కోసం ఒక్క శాతానికి ఉపయోగపడే ఇటువంటి పథకాలను ప్రవేశ పెడుతూ భారత ప్రజలందరి పేరుతో ప్రజాధనాన్ని ప్రైవేట్‌ ‌కంపెనీలకు, కార్పొరేట్‌  ‌వైద్యశాలలకు ధారాదత్తం చేయడం అత్యంత శోచనీయమైన విషయం. ప్రభుత్వాలు ఇన్సూరెన్సు కంపెనీలకు చెల్లించే మొత్తంను ప్రభుత్వ వైద్య ఆరోగ్య సంస్థల మీద ఖర్చు పెడితే అంతకు పది రెట్లు నాణ్యమైన వైద్యాన్ని ప్రభుత్వ రంగంలోనే అందించే అవకాశం ఉన్నది. మన దేశ భారత ఆరోగ్య రంగాన్ని పరిశీలిస్తే మానవ మనుగడకే ప్రమాదకరంగా పరిణమించిన ఎన్నో తీవ్రమైన వ్యాధులు, ఆరోగ్య విపత్తుల సమయంలో కేవలం ప్రభుత్వ వైద్య ఆరోగ్య వ్యవస్థలు మాత్రమే భారత ప్రజల ప్రాణాలు రక్షించేందుకు కృషి చేశాయి.

నేడు మన దేశాన్ని గానీ, యావత్‌ ‌ప్రపంచాన్ని గానీ గడగడలాడిస్తున్న కరోనా (కోవిడ్‌-19) ‌పై యుద్ధం చేస్తున్నది కూడా 99.9 శాతం ప్రభుత్వ వ్యవస్థలే. కావున వైద్య ఆరోగ్య రంగాన్ని జాతీయీకరణ చేయాలి. అందులో భాగంగా భారత ప్రజలందరికీ ఆరోగ్యాన్ని ఒక హక్కుగా చట్టబద్ధత కల్పించాలి.  కార్పొరేట్‌ ‌వైద్యశాలల నియంత్రణ చట్టాన్ని తీసుకుని రావాలి. ఈ వైద్యశాలలో   తక్కువ ఆదాయం కలిగి ఉన్నవారికి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న నిరుపేదలందరికీ, తెల్ల రేషన్‌ ‌కార్డు ఉన్న పేదలకు ఉచిత వైద్యాన్ని అందించే విధముగా నియమ నిబంధనలు రూపొందించాలి. డాక్టర్ల ఫీజులు, వైద్య పరీక్షల ధరలు, మందుల ధరలను కూడా ప్రభుత్వమే నిర్ణయించాలి. ఉల్లంగించిన వైద్యశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి. అందరికీ సమానమైన నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించాలి.ప్రభుత్వ రంగంలోని వైద్య ఆరోగ్య వ్యవస్థలను బలోపేతం చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థల కమిటీలు సూచించినట్లు ఆరోగ్య బడ్జెట్‌ను దేశ జిడిపిలో కనీసం 10 శాతం కేటాయించాలి.ప్రభుత్వ రంగంలోని వైద్య ఆరోగ్య వ్యవస్థలన్నింటిలో డాక్టర్లు, నర్సులు, సాంకేతిక నిపుణులను, పారిశుధ్య సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించాలి. వారికి గౌరవ ప్రదమైన వేతనాలతో పాటు ఉద్యోగ భద్రతను కల్పించాలి.  ప్రజారోగ్య వ్యవస్థలను బలోపేతం చేసి ఆరోగ్యభారతముగా దేశాన్ని రూపొందించాలి.
– దండంరాజు రాంచందర్‌ ‌రావు
రిటైర్డ్ ‌డిప్యూటీ సూపరింటెండెంట్‌
‌సింగరేణిభవన్‌ ‌హైదరాబాద్‌
9849592958

Leave a Reply