Take a fresh look at your lifestyle.

‌ప్రభుత్వ విధానాలే ఆర్థిక దుస్థితికి కారణం

Governmental policies are the cause of economic distress

దేశంలో బ్యాంకుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని నోబెల్‌ ‌బహుమతి గ్రహీత అభిజత్‌ ‌బెనర్జీ వ్యక్తం చేసిన ఆందోళన వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. బ్యాంకులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయన్న ఆయన మాటలు నూరు శాతం వాస్తవం. కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు తమ పార్టీ ఎంపీలను ఆర్థికపరమైన కుంభకోణాల నుంచి రక్షించేందుకు బ్యాంకులపై తీవ్రమైన ఒత్తిడ తెస్తున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్‌, ‌బీజేపీలది ఒకటే వైఖరి. ఆర్థిక నేరస్థులకు ఈ రెండు పార్టీలు కొమ్ము కాస్తున్నాయన్న వామపక్షాల ఆరోపణల్లో అణువంతైనా అసత్యం లేదు. కాంగ్రెస్‌ ‌నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ పాలనలో బ్యాంకులకు వందల కోట్లు బకాయి పడిన ప్రజాప్రతినిధులంతా బీజేపీలో చేరిపోయారు. అలాంటి వారు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ మంది ఉన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉండిన ఆటోమొబైల్‌ ‌రంగం ఇప్పుడు ఎటువంటి ఆదరణ లేకుండా కునారిల్లుతోంది. ప్రజల్లో కొనుగోలు శక్తి బాగా తగ్గిపోయింది. పరిశ్రమలు మూత పడటంతో ప్రజల చేతికి అవసరమైన నగదు అందడం లేదు. అంతేకాక, దారిద్య్ర నిర్మూలన కార్యక్రమాలు మందకొడిగా సాగుతున్నాయి. యూపీఏ హయాంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం వ్యవసాయ కూలీలు, సన్నకారు రైతులకు ఎంతో ఉపయోగంగా ఉండేది. మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని ఒక పథకం ప్రకారం నీరు గార్చింది. గ్రామాల్లో ఏడాదికి కొన్ని చోట్ల వంద రోజులు, మరి కొన్న చోట్ల 150 రోజులు ఉపాధి దొరకేది. ఇప్పుడు అది కనుమరుగు అయింది. పట్టణాలకు, నగరాలకూ వలసలు వెళ్తున్నారు. బ్యాంకుల వద్ద వందలాది కోట్ల రూపాయిల రుణం తీసుకున్న వారు పరిశ్రమలు స్థాపించి ఉపాధి కల్పంచాల్సింది పోయి, ఆ సొమ్మును వేరే వ్యాపారాలకు వెచ్చిస్తున్నట్టు బ్యాంకు ఉద్యోగ సంఘాల సమాఖ్య చేసిన ఆరోపణ యథార్థం. ప్రైవేటు పరిశ్రమల, కంపెనీలపై ప్రభుత్వానికి అదుపు లేదు.

 

పన్నులు చెల్లించేవారూ, కార్పొరేట్‌ ‌వర్గాల పట్ల గౌరవంగా వ్యవహరించాలనీ, వారిని వేధించరాదంటూ ప్రధానమంత్రి చేసిన హెచ్చరిక పన్ను వసూళ్ల యంత్రాంగాలకు సాకుగా దొరికింది. గతంలో చెల్లించాల్సిన పన్నులకు తోడు ఇంకా ఎక్కువ మొత్తాలను పరిశ్రమల యాజమాన్యాలు బకాయి పడటం వల్ల ఆశించిన స్థాయిలో ఆదాయం రావడం లేదు. ఈ ఏడాది బడ్జెట్‌ ‌రూపకల్పన ఆర్థిక మంత్రికి పెను సవాల్‌. ‌జిఎస్టీ పన్ను రాబడి నికరంగా ఉండటం లేదు. దాని వల్ల ఏ నెలలో ఎంత రాబడి వొస్తుందో తెలియని స్థితిలో ఆర్థిక మంత్రిగా ఎవరున్నా అంచనాలను తయారు చేయడం కష్టమే. బడ్జెట్‌ అం‌చనాలకూ, వసూళ్ళకూ పొంతన ఉండకపోవడానికి కారణం ఇదే. చాలా రంగాల్లో నిర్దేశిత లక్ష్యాలకు దూరంగా ఆదాయం ఉంటోంది. ఇందుకు కారణం ఆర్థిక రంగంలో మందగమనానికి తోడు పథకాలు అమలు జరిపే వారిలో చిత్తశుద్ది లేకపోవడమే. అన్నింటికీ మించి ప్రభుత్వ పథకాల అమలులో రాజకీయ జోక్యం ఎక్కువై పోతున్నది. పన్ను బకాయిదారుల పట్ల కఠిన వైఖరి వొద్దని ప్రభుత్వంలోని పెద్దలే చెబుతుంటే అధికారులు, సిబ్బందికి ఇక ఎదురేముంటుంది. అంతేకాక, పన్ను ఎగవేతదారుల పట్ల కొరడా ఝళిపిస్తామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ఎవరూ లెక్క చేయడం లేదు. ఆర్థిక రంగంలో ప్రధాని మోడీ ప్రయోగాల వల్ల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా తయారైంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత కుదైలైన ఆర్థిక పరిస్థితి ఇంకా కుదుట పడలేదు. ఈ పరిస్థితిలో త్వరలో అంటే వొచ్చే నెల ఒకటవ తేదీన ప్రవేశ పెట్టే బడ్జెట్‌లో పేదలు, వృద్ధులకు తాయిలాలు ఉంటాయని ఆశించడం అత్యాశే అవుతుంది. ఈ పరిస్థితికి ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలి. ముఖ్యంగా ప్రధానమంత్రి చేస్తున్న ప్రయోగాలు అటు కాశ్మీర్‌లోనూ, ఇటు ఆర్థిక రంగంలోనూ తీవ్ర విఘాతానికి కారణం.

Tags: Governmental policies, cause of economic, distress

Leave a Reply