బిజెపి సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి
సిద్దిపేట కలెక్టరేట్, ఆగస్టు 5 (ప్రజాతంత్ర విలేఖరి): రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర వీడి ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని భారతీయ జనతాపార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొంగొని సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసి,నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలన్న డిమాండ్‌తో బిజేఆర్ చౌరస్తా నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు గురువారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ… నీళ్లు, నిధులు, నియామకాల హామీలతో అధికారంలోకి వచ్నిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే ఇంటికొక ఉద్యోగం ఇస్తామన్న కేసీఆర్ ప్రభుత్వం ఊరికి ఒక ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయిందని ఎద్దేవా చేశారు.
మాయమాటలతో అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకుండా జాప్యం చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగ భృతి చెల్లించకుండా నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తేరుకొని రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేసి, నిరుద్యోగ భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బిజెపి, బీజేవైఎం ఆధ్వర్యంలో మంత్రులను ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అడ్డుకుని రాబోయే రోజులలో ప్రగతి భవన్‌ను ముట్టడి చేస్తామని శ్రీకాంత్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్ణకంటి నరేష్, కార్యదర్శి కొరిమి అనిల్, భాస్కర్, జిల్లా నాయకులు నీలం దినేష్, లింగాల జనార్ధన్, నరేష్, కమ్మ శ్రీను, రాహుల్, తాటికొండ శ్రీనివాస్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.