Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ బడులు కాపాడాలి..

“ప్రారంభం కావల్సిన కొత్త విద్య సంవత్సరం వికృతరూపం సంతరించుకోనున్నది .సమాయానుసారం తెరచుకోవల్సిన బడిని తెరవక పోవటమే ప్రభుత్వ బడులకు ప్రమాదంగా పరిణమిస్తున్నది. ప్రయివేట్ బడులు ఆన్ లైన్ పేరిట విద్యా సంవత్సరం ప్రారంభించటంతో హెచ్చుతగ్గులు ప్రస్ఫుటమవుతున్నాయి.ప్రభుత్వం ఈ విపత్తు విసిరిన సవాళ్ళను ఎదుర్కోలేక చతికిలబడిననేపథ్యంలో  ఉపాధ్యాయులే సంఘాల నాయకత్వాన సర్కార్ చదువులను రక్షించుకునే ప్రయత్నాలు చేయటానికి ప్రయత్నించాలి.విద్యాసంవత్సరం నష్టపోవటాన్ని అడ్డుకునేందుకు బేషరతుగా బడులు తెరవాలని ప్రాతినిధ్యం చేయాలి.”

కొరొనా విపత్తు నిర్వహణలో పాలకుల వైఫల్యానికి ప్రభుత్వ విద్య బలి కాకుండా కాపాడాలని బుద్దిజీవులు కోరుతున్నారు.కానీ కరోనా విజృంభణ లెక్కలు లొక్ డౌన్ ల మీద లాక్ డౌన్ల వైపు నడిపిస్తున్నాయి. కరోనా విపత్తు పూర్తిగా తుడిచిపెట్టుకు పోయే రోజంటూ వస్తుందని ఊహించటానికి కూడా ఆస్కారం లేదు.ఈ పరిస్థితులలో ఇంకా ఎంతో కాలం బడులకు తాళాలేయటం సరికాదు.కరోనాను ఎదుర్కొని నిలిచే విధంగా బడుల మనుగడకు దోహదపడే విప్లవాత్మక ఆచరణకు పిలుపునివ్వాల్సిన అవసరం బుద్ది జీవులకు వుంది. ఆ మేరకు విద్యావంతులు,ఉపాధ్యాయ,విద్యార్థి సంఘాలు ప్రభుత్వ విద్యా పరిరక్షణ సంస్థలు ఉమ్మడి కార్యాచరణకు నడుంకట్టాల్సిన అవసరాన్ని గుర్తించాలి.

విభజించి పాలించే ఎత్తుగడతోనే ఒక గొడుగు కింద వుండాల్సిన సర్కార్ విద్యను ముక్కలుగా చీల్చారు. రకరకాల పేర్లతో యాజమాన్యాల కింద సర్కార్ విద్య చీలిక పేలికలతో సమాజానికి దూరం కాబడుతున్నది. విపత్తు నేపథ్యంలో ప్రభుత్వ ఆచరణ వైఫల్యాల వల్ల సర్కార్ విద్య సమాజానికి మరింత దూరమయ్యే దుస్థితి కనిపిస్తోంది. ప్రపంచాన్ని భయపెట్టిన కోవిడ్ 19 విపత్తు ఉధృతిని అంగీకరిస్తూనే సర్కార్ విద్య అస్థిత్వాన్ని కాపాడే దిశగా కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం వున్నది.పాలనా పరమైన సవాళ్ళను ఎదుర్కొనే క్రమంలో పాలకుల వైఫల్యాలు వాటి ఫలితాలు మానవ సమాజాన్ని అతలాకుతలం చేయక మానవు.మే నెల చివరలో పాఠశాలల పై నిర్ణయం తీసుకునేందుకు నిర్వహించాల్సిన సమావేశం ఇంత వరకూ అతీగతి లేదు.విపత్తు సాకుగా చూపి తమ లోపాలను కప్పిపుచ్చుకునే కొత్త విషయాలకు తెరలేపుతుంటాయి.
.
ఈ విపత్తు ప్రభావానికి రాష్ట్ర అభివృద్ధి నిలిచిపోయింది.కావల్సిన పది పరీక్షలు నిర్వచనం మారింది.ప్రారంభం కావల్సిన కొత్త విద్య సంవత్సరం వికృతరూపం సంతరించుకోనున్నది .సమాయానుసారం తెరచుకోవల్సిన బడిని తెరవక పోవటమే ప్రభుత్వ బడులకు ప్రమాదంగా పరిణమిస్తున్నది. ప్రయివేట్ బడులు ఆన్ లైన్ పేరిట విద్యా సంవత్సరం ప్రారంభించటంతో హెచ్చుతగ్గులు ప్రస్ఫుటమవుతున్నాయి.ప్రభుత్వం ఈ విపత్తు విసిరిన సవాళ్ళను ఎదుర్కోలేక చతికిలబడిననేపథ్యంలో ఉపాధ్యాయులే సంఘాల నాయకత్వాన సర్కార్ చదువులను రక్షించుకునే ప్రయత్నాలు చేయటానికి ప్రయత్నించాలి.విద్యాసంవత్సరం నష్టపోవటాన్ని అడ్డుకునేందుకు బేషరతుగా బడులు తెరవాలని ప్రాతినిధ్యం చేయాలి. కోవిడ్ – 19 సంక్షోభం విసిరిన సవాళ్ళ నుండి ప్రభుత్వ విద్యను రక్షించుకోవటంలో నిర్లిప్తత సమాజానికి చేటు కల్గిస్తుంది.ఈ నేపథ్యంలో మన సమాజానికి,ప్రభుత్వ చదువులకూ పెరుగుతున్న దూరాన్ని తగ్గించేందుకైనా తక్షణమే పాఠశాలలను బేషరతుగా తెరవాల్సిన అవసరముంది.బోధన మరియు బోధనేతర సిబ్బంది హాజరయ్యేలా ప్రభుత్వ ఆదేశాలు జారీ చేయటం మేలని భావించాలి.కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదలైన రోజు పిల్లలు బడికి హాజరవుతారు.ఈలోగా పాఠశాలను సిద్దంచేసే అవకాశముంటుంది. జూన్ మూడవ వారంలో ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో బోధన బోధనేతర సిబ్బంది పాల్గొంటారు.

లాక్ డౌన్ (1.0) ఫలితంగా అకస్మాత్తుగా మూత బడిన నేపథ్యంలో పెండింగ్ పనులు మరియు నూతన విద్యా సంవత్సరానికి సంబంధించిన ఏర్పాట్లు చేసేందుకై బోధన, బోధనేతర సిబ్బందికి ఈ సమయం కలిసొస్తుంది. పైగా ఇప్పటికే ఆలస్యం జరిగిన అడ్మిషన్ల ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికపై (ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ )నిర్వహించవచ్చును.జీరో మరియు స్వల్ప,అతిస్వల్ప నమోదు వున్న,వుండేటి బడులను కాపాడుకోవాలి.ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించటం ద్వారా విద్యార్థుల నమోదు శాతం
కాపాడుకోవచ్చును. ప్రతిరోజు కొంత సంఖ్యను నిర్ధారించుకొని వారినే పిలిపించి(కోవిడ్ -19 నియమావళి అనుసారం భౌతికదూరం,మాస్క్ లు,శానటైజేషన్ పాటిస్తూ) పుస్తకాలు పదిరోజుల వ్యవధిలో అందజేయ వచ్చును.పాఠశాలలో యూనిఫాంల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలి.ప్రతిరోజు నిర్ధారించుకొన్న సంఖ్య మేరకు వారినే పిలిపించి కోవిడ్ -19 నియమావళి అనుసారం భౌతిక దూరం,మాస్క్ లు,శానిటైజేషన్ పాటిస్తూ)యూనిఫాంలు అందించేందుకు మరో పదిరోజులు పట్టవచ్చును.

పాఠశాల తరగతి హాజరు రిజిష్టర్ల ఆధారంగా ఇంటి వద్దవుండేటి బడి విద్యార్థులందరిని (కోవిడ్ -19 నియమావళి మేరకు)పిలిపించి ప్యాకింగ్ చేసిన వారికి సంబంధించిన నెలవారి బియ్యం మరియు నెలవారిగుడ్లు వారికి ఏకమొత్తంలో అందజేయాలి.వంట నిర్వహణ ఖర్చులు (కూరలు) సంబంధించిన పిల్లల వైయుక్తిక లెక్కల మేరకు సంబంధిత నెలవారి మొత్తం డబ్బును విద్యార్థుల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలలో జమ చేయాలి.అదే సమయంలో విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా సమాచారం ఇవ్వటం,వివిద అంశాల పైన సూచనలు చేయటం ప్రారంభించాలి.కోవిడ్-19 నేపథ్యంలో బడి నియామావళి వివరించాలి.పాఠశాల గ్రంథాలయం కంప్యూటర్ లాబ్, సైన్స్ లాబ్ తెరచి సంబంధిత ఉపాధ్యాయుల పర్యవేక్షణలో వుంచాలి.ఆసక్తి గల విద్యార్థులు పాఠశాలకు హాజరై వాటిని సక్రమంగా వినియోగించుకునే అవకాశాలు కల్పించాలి.విద్యార్థులు పాఠశాలకు రాలేని పరిస్థితులు సరైన సమయంగా భావించి ప్రభుత్వం ఉపాధ్యాయుల జిల్లా,అంతర్ జిల్లా బదిలీలు,చాలాకాలంగా ఎదురుచూస్తున్న పదోన్నతులను నిర్వహించేలా ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ కార్యక్రమం రూపొందించాలి. చేయాలి. కరోనా విపత్తును ఎదుర్కోవాలని కలిసి సహజీవనం చేయాలని ప్రభుత్వం చెపుతూన్నది.కానీ అందుకు కావల్సిన మార్గదర్శకాలు విడుదల చేయటంలేదు.

కొరోనా విపత్తును,దాని ప్రభావాల్ని ముందస్తుగా అంఛనా వేయటంలోనే కాదు జూన్ నెలలో దానిని నిలువరించటంలోనూ,టెస్టింగ్లలోనూ,వైద్యులకందించే మౌలిక సదుపాయాల కల్పన లోనూ ఆద్యంతమూ వైఫల్యాల ఫలితమే రాష్ట్రంలో కోవిడ్ 19 విజృంభణ.లాక్ డౌన్ కు ఇచ్చిన ప్రాధాన్యత టెస్టింగ్ లకు ఇవ్వక పోవటం,రోజు వారి ఆరోగ్య,వైద్య సంరక్షణ చర్యల నివేదికలకు పొంతనలేక పోవటం పై విమర్శలను పెడచెవిన పెడ్తున్నారు. ప్రజాసంక్షేమం విషయంలో ప్రభుత్వ అసమర్ధతను ప్రజలు అర్ధంచేసుకోవాలి. కరోనా విపత్తు నేపథ్యంలో రోగ నిరోధకత గల తరగతి గదులతో ప్రతి బడిని ఆధునీకరించాల్సిన అవసరముంది.ప్రత్యేక విపత్తు నిర్వహణ నిధులు కేటాయించి ఆధునిక బడి పునర్నిర్మాణానికి పక్కాప్రణాలికలు రూపొందించాలి.
అజయ్ బాబు వాడపల్లి ,
వరంగల్

Leave a Reply