Take a fresh look at your lifestyle.

‌ప్రభుత్వం దిగిరావాలి

  • తక్షణమే చట్టాలు రద్దు చేయండి
  • ఢిల్లీని దుర్భేద్యమైన కోటగా మార్చేసింది
  • అన్నం పెట్టే రైతన్నపై లాఠీఛార్జ్ అమానుషం
  • రైతుల ముందు ప్రభుత్వం తలొగ్గాల్సిందే
  • రైతుల సమస్యలను పెండింగ్‌లో పెట్టడం దేశానికి శ్రేయస్కరం కాదు
  • కేంద్ర వైఖరిపై కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌గాంధీ తీవ్ర ఆగ్రహం

రైతులపట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతుల సమస్యలను పెండింగ్‌లో పెట్టడం దేశానికి శ్రేయస్కరం కాదని ఆయన హెచ్చరించారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు రెరడు నెలలకుపైగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం వారి సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని రాహుల్‌ ‌సూటిగా ప్రశ్నించారు. బుధవారం మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో మాట్లాడిన రాహుల్‌గాంధీ.. రైతులపట్ల కేంద్ర అనుసరిస్తున్న వైఖరి సబబు కాదని మండిపడ్డారు. రైతులు దేశానికి అన్నం పెడుతున్నారని, ఢిల్లీ సరిహద్దుల్లో నెలల తరబడి రైతులు నిరసన వ్యక్తంచేస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని రాహుల్‌గాంధీ ప్రశ్నించారు.

ఉద్యమిస్తున్న రైతులను ప్రభుత్వం ఎందుకు భయాందోళనలకు గుర్తిచేస్తున్నదో చెప్పాలని ఆయన నిలదీశారు. రైతులపై ప్రభుత్వం ఎందుకు లాఠీలను ఝుళిపిస్తుందో వివరణ ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. కేంద్ర సర్కారు ఢిల్లీని దుర్భేద్యమైన కోటగా మార్చేసిందని విమర్శించారు. వ్యవసాయ చట్టాల విషయంలో రైతులు ఏమాత్రం వెనక్కి తగ్గరని, ప్రభుత్వమే దిగిరావాలని డిమాండ్‌ ‌చేశారు. రైతులు దేశానికి వెన్నెముక లాంటివారని, కేంద్ర ప్రభుత్వం ఆ వెన్నెముకను తుంచేయాలని చూస్తున్నదని రాహుల్‌గాంధీ మండిపడ్డారు. సాగు చట్టాలను శాశ్వతంగా రద్దు చేయాలన్న రైతుల డిమాండ్‌ను కేంద్రం పెడచెవిన పెడుతున్నదని ఆయన విమర్శించారు.

చట్టాలను శాశ్వతంగా ఉపసంహరించుకోవాల్సిన ఆవశ్యకత ఉందనే విషయాన్ని కేంద్రం గ్రహించిందా..? లేదా..? అని నిలదీశారు. ప్రభుత్వం రైతుల డిమాండ్‌ల నుంచి పారిపోకుండా సమస్యలను విని శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఉందన్నారు. చైనా వ్యవహారంపై కేంద్రం వ్యవహరిస్తున్న శైలిని రాహుల్‌ ‌విమర్శించారు. చైనా భారత భూభాగంలోకి ప్రవేశించడమే కాకుండా, భారత భూభాగాన్ని కూడా ఆక్రమించిందని మరోమారు ఆరోపించారు. రక్షణ రంగానికి సంబంధించిన వ్యయాన్ని ఏమాత్రం పెంచడం లేదని, మూడువందల కోట్ల నుంచి నాలుగు వందల కోట్లకు మాత్రమే కేంద్రం పెంచిందని, ఈ పెంపు ద్వారా ఏం సందేశాన్ని పంపిస్తున్నారని మండిపడ్డారు. ’’రక్షణ రంగానికి సంబంధించి వ్యయం ఏమాత్రం పెంచడం లేదు.

మూడు వందల కోట్ల నుంచి నాలుగు వందల కోట్లకు మాత్రమే పెంచారు. దీని ద్వారా రిచ్చే సందేశమేంటి? చైనా ఎప్పుడైనా రావొచ్చు. ఏమైనా చేసుకోవచ్చు. మేము మాత్రం రక్షణ బలగాలకు మద్దతివ్వం. అన్న సందేశాన్ని పంపదలచారా?‘ అని రాహుల్‌ ‌తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నూతన బడ్జెట్‌ ‌ద్వారా 99 శాతం ప్రజానీకానికి ప్రభుత్వం మద్దతిస్తుందని తాము ఆశించామని, కానీ ఈ బడ్జెట్‌ ఒకశాతం మందికే మద్దతిచ్చిందని ఎద్దేవా చేశారు. చిన్న, మధ్యతరహా ప్రజానీకం నుంచి ప్రభుత్వం డబ్బులు లాక్కొని, ఐదు, పది మంది జేబులను నింపుతోందని రాహుల్‌ ఆరోపించారు.

Leave a Reply