Take a fresh look at your lifestyle.

అధికారుల అండా.. అక్రమార్కుల దందా..

  • కోట్ల విలువైన ప్రభుత్వ భూములు హాంఫట్‌..!
  • ‌కబ్జాదారులకు కొమ్ముకాస్తున్న అధికారులు..?

స్థానిక అధికారుల అండదండలతో, మియాపూర్‌ ‌రెవిన్యూ ప్రాంతంలోని భూ కబ్జాదారుల ఆగడాలకు హద్దూ అదుపు లేకుండా పోయింది. అందినకాడికి ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేసి వాటిని విక్రయించి అక్రమ పద్ధతిలో సొమ్ముచేసుకుంటున్నారు. అందులకు నిలువెత్తు నిదర్శనంగా స్థానిక రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్‌ 100, 101’’ఎం ఏ ‌నగర్‌’‌మరియు స్టాలిన్‌ ‌నగర్‌ ‌నందు భారీ స్థాయిలో అక్రమంగా భూములు కబ్జా చేసి నిర్మిస్తున్న నిర్మాణాలే కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. ఈప్రాంతం మియపూర్‌ ‌ప్రధాన రహదారికి సమీపంలో ఉండడంతో అధిక ధర పలకడంతో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ‘‘ఎందుకిలా జరుగుతుంది..?’’ ఇక్కడ అధికారులు లేరా..?’’ అనే ప్రశ్నలకు వివిధ రకాలుగా సమాధానాలు ప్రత్యక్షమవుతున్నాయి.

స్థానిక రెవెన్యూ అధికారులు అక్రమ పద్ధతిలో ముడుపులు తీసుకుని అక్రమార్కులను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనితో, స్థానిక రెవెన్యూ అధికారుల అండదండలు మెండుగా ఉన్నట్లు ఆయా ప్రాంత వాసులలో గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూమి కబ్జాలను ప్రారంభ దశలోనే నిలిపి వేయాల్సిన అధికారులు మాత్రం ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం పూర్తి కావస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు, తమకేమీ సంబంధం లేనట్లుగా చూడడం సరైన చర్య కాదని పలువురు వాపోతున్నారు. ఇదిలా ఉండగా ఇందులో ప్రజాప్రతినిధుల పాత్ర భారీ స్థాయిలో ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

‘‘దొంగలు దొంగలు కలిసి ఊళ్లు పంచుకున్నట్లు’’గా ఇక్కడ రెవిన్యూ అధికారులు, కబ్జాదారులు కలిసి అక్రమాలను సజావుగా సాగిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన రహదారికి సమీపంలోనే జరుగుతున్న భూ కబ్జాలపై చర్యలు తీసుకోలేదంటే, సదరు అధికారులకు ముడుపులు భారీ స్థాయిలోనే ముట్టాయనే ఆరోపణలలో వాస్తవం కనిపిస్తున్నదని, స్థానికులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకుంటూ కూడా, రెవెన్యూ అధికారులు అక్రమ పద్ధతులను అవలంబిస్తూ, అక్రమ సంపాదనకు లాలూచీ పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతటి అవినీతిలో అధికారులు పూర్తిగా మునిగి పోయారు అంటే వీరి బుద్ధి ఎలాంటిదో ప్రజలకు అర్థం అవడమే కాక, ప్రజలకు ప్రభుత్వ అధికారుల పై ఉన్న గౌరవం, నమ్మకం కూడా పోతున్నది.

స్థానిక మియాపూర్‌ ‌సర్వేనెంబర్‌ 100,101 ‌నందు భారీగా జరిగిన భూ కబ్జాలను చూస్తే, ఇక్కడ రెవిన్యూ అధికారుల అక్రమ సంపాదన ఏ స్థాయిలో ఉంటుందో అని ఆయా ప్రాంత వాసులు ఆలోచనలో మునిగి పోతున్నారు. ఫిర్యాదుదారులు అక్రమ భూ కబ్జాలు, నిర్మాణాలపై చరవాణి ద్వారా సమాచారం అందిస్తే, స్థానిక రెవెన్యూ అధికారులు మాత్రం తాత్కాలికంగా అప్పటివరకు ఏదో సమాధానం చెప్పి, సమయ పాలన కొనసాగిస్తూ, అక్రమాలను ప్రోత్సహిస్తున్నారనడానికి, ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు ప్రధాన సాక్ష్యాలుగా మిగులుతున్నాయి. ఇప్పటికైనా, ఆర్‌ ‌డి ఓ, కలెక్టర్‌ ‌మరియు పై అధికారులు స్పందించి, స్థానిక రెవెన్యూ అధికారులలో జరుగుతున్న అవినీతిని గుర్తించి, జరుగుతున్న అక్రమాలకు ఏమాత్రం అడ్డుకట్ట వేస్తారో వేచి చూడాలి.

Leave a Reply