Take a fresh look at your lifestyle.

గెరిల్లా యుద్ధం…!

ఎక్కడ అనకట్ట వెలిసినా
మునిగేది మా ఆధరువులే..

ఏ మైనింగ్‌ ఒళ్ళు విరిసినా
కూలేది మా బతుకుదెరువులే

ఏ అక్రమార్కుడు చొరబడినా
కరిగేది మా అటవీ భూములే

అడవి తల్లిని నమ్ముకునోల్లం
పోడు ఎవుసం చేసుకునేటోళ్లం
వన సంపదకు మేం వారసులం

ఇపుడు…
దోపిడీ మరిగిన రాక్షస రాజ్యం
చీకటి చట్టాలకు రూపులద్దింది

అటవీ సంపదను కొల్లగొట్టి
కార్పొరేట్లకు కట్టబెడుతుంది

పచ్చటి అడవిని ఆక్రమించి
వెచ్చటి రుధిరం పారిస్తుంది

ఆదివాసీ హక్కుల కాలరాసి
గెంటివేతకు తెగబడుతుంది

ఈ రాక్షస క్రీడ మానకుంటే ..
ఈ ధ్వంస కాండ వీడకుంటే …

చిగురుటాకులు …
కత్తులై పదునెక్కుతయ్‌

‌గడ్డి పరకలు …
కొదమ సింహాలై గర్జిస్తయ్‌

‌చలి చీమలు …
దండయాత్రకు దిగుతయ్‌

ఎ‌ర్ర పావురాలు ..
విల్లంబులను సందిస్తయ్‌

‌గోండు వీరులు దండుగట్టి
గెరిల్లా పోరుకు సిద్ధమైతయ్‌
‌దోపిడీ మూకలు..ఖబద్దార్‌ !

 (అటవీమాఫియాకు హెచ్చరికగా..)
– కోడిగూటి తిరుపతి, 9573929493

Leave a Reply