75వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లు సీఈఓ సుందర్ పిచాయ్ ప్రకటన
భారతీయ ఆవిష్కర్తలకు భారీ ఊతం ఇస్తూ గూగుల్ సంస్థ డిజిటల్ ఇండియాలో భారీ పెట్టుడులు పెట్టింది. భారతీయ స్టార్ట్ అప్స్‌లో సుమారు 75 వేల కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. గూగుల్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారీ పెట్టుబడులను ప్రకటించారు. పది బిలియన్ల డాలర్ల నిధులతో భారతీయ డిజిటల్ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కానున్నట్లు సుందర్ పిచాయ్ తన ట్విట్టర్‌లో తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన డిజిటల్ ఇండియా కార్యక్రమానికి మద్దతు ఇవ్వడం గర్వంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
డిజిటల్ ఇండియా విజన్‌తో ప్రధాని మోదీ పనిచేస్తున్న తీరు పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం ప్రధాని మోదీ ఓ ట్వీట్ చేశారు. సుందర్ పిచాయ్‌తో అర్థవంతమైన చర్చలో పాల్గొన్నట్లు తన ట్విట్టర్‌లో వెల్లడించారు. పలు రకాల అంశాలపై పిచాయ్‌తో మాట్లాడినట్లు మోదీ తెలిపారు. భారతీయ రైతులు, యువత, పారిశ్రామిక వేత్తలను మార్చడంలో టెక్నాలజీ పోషించే పాత్ర గురించి చర్చించినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు.