- రేపో, మాపో ఢిల్లీకి…
- తొలుత గ్రేటర్లో..అటు తర్వాత తమిళనాడులోనూ ప్రచారం
గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్పర్సన్, ప్రముఖ సినీ నటి విజయశాంతి అలియాస్ రాములమ్మ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. కాంగ్రెస్‌తో ఉన్న ఆరేండ్ల చెలిమిని మరి కొన్ని గంటలు, రోజుల వ్యవధిలో తెగతెంపులు చేసుకోనున్నట్లు అత్యంతమైన విశ్వసనీయవర్గాలు సోమవారమిక్కడ ‘ప్రజాతంత్ర’ప్రతినిధికి వివరించాయి. కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బిజెపిలో చేరేందుకు సిద్ధమవుతున్నారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉండి, సీఎం కేసీఆర్ అంటేనే ఒంటికాలిపై లేచే విజయశాంతి సొంతగూటికి చేరనున్నట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ ప్రజల్లో తనకంటూ గుర్తింపు ఉన్న రాములమ్మ ఎంట్రీ బిజెపికి కలిసివొస్తుందని ఆ పార్టీ జాతీయ నేతలు భావిస్తున్నారు. ఒకట్రెండు రోజుల్లోనే విజయశాంతి ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా లేదంటే, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో కాషాయం కండువాను కప్పుకునేందుకు తెరవెనుక ఏర్పాట్లు చకచకా జరుగుతున్నట్లు తెలుస్తుంది. బిజెపి పార్టీలో విజయశాంతికి సముచిత స్థానం, ప్రాధాన్యత కల్పిస్తామనీ ఇప్పటికే జాతీయ నేతల నుంచి హామీ లభించినట్లు సమాచారం. విజయశాంతి బిజెపిలో చేరగానే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడంతో పాటు వచ్చే సంవత్సరం జరగనున్న తమిళనాడు ఎన్నికల్లోనూ విజయశాంతితో ప్రచారం చేయించే ఆలోచనలో బిజెపి జాతీయ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తుంది. విజయశాంతిని కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం చేయకుండా సౌత్ ఇండియాలో ఆమె సేవలను ఉపయోగించుకునేలా బిజెపి జాతీయ నాయకత్వం రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నట్లు సమాచారం.