Take a fresh look at your lifestyle.

ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

  • అన్ని స్థాయిల ఉద్యోగులకు వేతనాలు పెంపు
  • 9,36,976 మంది ఉద్యోగులకు లబ్ది
  • ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎస్‌ అధ్యక్షతన కమిటీ
  • ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నియామకాలు
  • సీఎం కేసీఆర్‌ ‌కీలక కీలక నిర్ణయాలు
  • ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్ష

‌రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తీపి కబురు అందించారు. రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు పెంచాలనీ, ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచాలని నిర్ణయించారు. అలాగే, అన్ని ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈమేరకు సీఎం కేసీఆర్‌ ‌మంగళవారం ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో సుదీర్ఘ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌ అధ్యక్షతన ఓ కమిటీని నియమించారు. ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ ఉద్యోగులు, వర్క్ ‌చార్టర్‌ ఉద్యోగులు, దినసరి ఉద్యోగులు, పూర్తి స్థాయి కాంటింజెంట్‌ ఉద్యోగులు, పార్ట్ ‌టైం ఉద్యోగులు, హోం గార్డులు, అంగన్వాడీ వర్కర్లు, కాంట్రాక్టు, ఉద్యోగులు, ఔట్‌ ‌సోర్సింగ్‌ ఉద్యోగులు, ఆశ వర్కర్లు, విద్యా వలంటీర్లు, సెర్ఫ్ ఉద్యోగులు, గౌరవ వేతనాలు అందుకుంటున్న వారితో పాటు పెన్షనర్లకు కూడా వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించారు.

కొత్త సంవత్సరం మార్చి నుంచి ఉద్యోగుల సమస్యలు శాశ్వతంగా పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అన్ని రకాల ఉద్యోగులు కలిపి 9,36,976 మంది ఉంటారనీ, వీరందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని సీఎం చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులకు పెంపు వల్ల సంస్థపై పడే ఆర్థిక భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు తక్కువ వేతనాలున్న ఆర్టీసీ ఉద్యోగులకు సైతం వేతనాల పెంపు వర్తిస్తుందనీ, అలాగే, కారుణ్య నియామకాల ప్రక్రియను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులు కలిపి 9,36,976 మంది ఉంటారనీ వీరందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందన్నారు. అలాగే, ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల పెంపుతో పాటు ఉద్యోగ విరమణ వయస్సు పెంపు, పదోన్నతులు ఇవ్వడం, అవసరమైన బదిలీలు చేయడం, సరళీతరమైన సర్వీసు నిబంధనల రూపకల్పన రిటైర్‌ అయ్యే ప్రభుత్వ ఉద్యోగులకు అన్ని రకాల ప్రయోజనాలు అందించి గౌరవంగా వీడ్కోలు పలకడం, కారుణ్య నియామకాలన్నీ వెంటనే పూర్తి చేయడం వంటి ఉద్యోగ సంబంధ అంశాలన్నింటినీ ఫిబ్రవరిలోగా సంపూర్ణంగా పరిష్కరించనున్నట్లు వెల్లడించారు.

అలాగే, అన్ని ప్రభుత్వ శాఖలలో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నియామకాల ప్రక్రియను చేపట్టనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ అంశాలన్నింటిపై అధ్యయనం చేయడానికి, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ ‌కుమార్‌ అధ్యక్షతన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ ‌కుమార్‌ ‌సభ్యులుగా ప్రత్యేక కమిటీని సీఎం నియమించారు. ఈ కమిటీ జనవరి మొదటి వారంలో వేతన సవరణ సంఘం నుంచి అందిన నివేదికను అధ్యయనం చేయడంతో పాటు రెండో వారంలో ఉద్యోగ సంఘాలతో సమావేశమవుతుందని వెల్లడించారు. ప్రభుత్వానికి నివేదిక అందిన వెంటనే మంత్రివర్గం సమావేశమై వీటికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన వెంటనే ప్రభుత్వం ఉద్యోగులకు 42 శాతం ఫిట్‌మెంట్‌తో వేతనాలు పెంచిందనీ, ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు అన్ని స్థాయిల ఉద్యోగులకు వేతనాలు పెంచిదని సీఎం కేసీఆర్‌ ‌గుర్తు చేశారు. మారిన పరిస్థితుల కారణంగా వీరందరికీ మరోసారి వేతనాలు పెంచాల్సిన అవసరం ఉందనీ, ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక పరిమితుల మేర ప్రభుత్వానికి సేవలు అందిస్తున్న అన్ని రకాల ఉద్యోగులకు కచ్చితంగా ఎంతో కొంత వేతనాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ‌ప్రకటించారు.

Leave a Reply