దేహం కసిరింది
చేతులు ముడుచుకున్నాయ్
కళ్ళు వింటున్నా
చెవులు కథలు చెబుతున్నాయ్
నోరు మూసుకుని
నాలుక చోద్యం చూస్తుంది
కాళ్ళు కన్నీళ్ళ పర్యంతమవుతున్నయ్
నరాలు పరిగెడుతూ
మెదడు తన చుట్టూ తను తిరుగుతూ
గుండె కుత కుత కుత ఉడికి
ఆవిర్లు కక్కుతుంది
ఒక మొహం అలా రక్తం కాలువలో కొట్టుకొస్తూ
ఒక స్వగత గీతం పాడుతుంది
కొన్ని కుక్కల నీడలు చూపుడు వేళ్ళు
తోసుకుంటున్నయ్
ఒక ఎముకల గూడు తన వెన్నుముకతో
వయోలిన్ వాయిస్తూ
వర్షంలో తడుస్తుంది దగ్గుతూ
దేశపటం గాల్లో గీసుకుంటుంది ఆ శబ్దానికి
అల్లంత దూరంలో గొంతులు
ఉరికొయ్యను కౌగిలించుకుంటూ
ఆ రక్కసి సంధ్యా సంద్రంలో
అక్కసు కక్కుతూ ఒక విలీన దృశ్యం!!
– రఘు వగ్గు