Take a fresh look at your lifestyle.

భారత్‌కు బంగారం ‘నీరజ్‌ ‌చోప్డా’

  • టోక్యో ఒలింపిక్స్‌లో అద్భుత రీతిలో జావెలిన్‌ ‌త్రోలో బంగారు పతకాన్ని సాధించిన ఘనుడు
  • 100 సంవత్సరాల తర్వాత అథ్లెటిక్స్ ‌ఫీల్డ్ అం‌డ్‌ ‌ట్రాక్‌లో పతకం
  • ఊహించని ఈవెంట్‌లో ఉత్తమ ప్రతిభ..ప్రశంసల వెల్లువ
  • రెజ్లింగ్‌లో భజరంగ్‌ ‌పూనియాకు కాంస్యం..భారత్‌ ‌ఖాతాలో మరో పతకం

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ అథ్లెట్‌ ‌నీరజ్‌ ‌చోప్డా జావెలిన్‌ ‌త్రో ఫైనల్లో అద్భుత ప్రతిభను కనబరిచి అనూహ్యంగా బంగారు పతకాన్ని సాధించాడు. 100 సంవత్సరాల తర్వాత భారత్‌కు అథ్లెటిక్స్ ‌ఫీల్డ్ అం‌డ్‌ ‌ట్రాక్‌ ‌విభాగంలో పతకాన్ని అందించి రికార్డు సృష్టించాడు. మ్యాచ్‌ ‌వివరాల్లోకి వెళితే మొదటి రౌండ్‌లోనే 87.03 మీటర్లు విసిరి టాప్‌ ‌పొజీషన్‌లో ఉన్న నీరజ్‌ ‌రెండో రౌండ్‌లోనూ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి ఏకంగా 87.58 మీటర్లు విసిరి సీజన్‌ అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేశాడు. ఆ తర్వాత మూడో రౌండ్లో 76. 79 మీటర్లు విసిరినప్పటికి తొలి రెండు రౌండ్లలో స్పష్టమైన ఆధిక్యం కనబరచడంతో తొలి స్థానంలో కొనసాగాడు. ఇక నాలుగవ, ఐతవ రౌండ్‌లో త్రో వేయడంలో విఫలమయ్యాడు. ఇక చివరగా ఆరో రౌండ్‌లో 84.24తో ముగించాడు.

ఓవరాల్‌గా 87.58తో సీజన్‌ అత్యుత్తమ ప్రదర్శనతో స్వర్ణం దక్కించుకున్నాడు. ఇక భారత్‌కు వ్యక్తిగత విభాగంలో స్వర్ణం తెచ్చిన రెండో ఆటగాడిగా నీరజ్‌ ‌చోప్డా చరిత్రలో కెక్కాడు. 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో షూటింగ్‌ ‌విభాగంలో అభివన్‌ ‌బింద్రా భారత్‌కు తొలి స్వర్ణం అందించాడు. హర్యానాకు చెందిన నీరజ్‌ ‌చోప్డా పానిపత్‌ ‌జిల్లాలోని కందారా గ్రామంలో 1997, డిసెంబర్‌ 24‌న జన్మించాడు. చంఢీఘర్‌లోని డీఏవీ కాలేజ్‌లో చదువుకున్న నీరజ్‌ ‌చిన్న వయసులోనే ఇండియన్‌ ఆర్మీకి సెలక్ట్ అయ్యాడు. ప్రస్తుతం భారత సైన్యంలో నాయబ్‌ ‌సుబేదార్‌గా పనిచేస్తున్నాడు. 2018 ఏషియన్‌ ‌గేమ్స్‌లో జావెలిన్‌ ‌త్రో ఫైనల్లో 88.06 మీటర్లు విసిరి చరిత్ర సృష్టించిన నీరజ్‌ ‌స్వర్ణం గెలవడం ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వొచ్చాడు. ఇప్పటికీ 88.06 మీటర్ల ప్రదర్శన అతని అత్యుత్తమ ప్రదర్శనగా ఉంది. ఆ తర్వాత 2018లోనే జరిగిన కామన్‌వెల్త్ ‌గేమ్స్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచిన నీరజ్‌ ‌చోప్డా 86.47 మీటర్లు విసిరి మరోసారి స్వర్ణం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు.

భారత్‌ ‌ఖాతాలో మరో పతకం..రెజ్లింగ్‌లో భజరంగ్‌ ‌పూనియాకు కాంస్యం
టోక్యో ఒలింపిక్స్‌లో మొదటిసారిగా పాల్గొన్న భజరంగ్‌ ‌పూనియా రెజ్లింగ్‌లో కాంస్యం సాధించాడు. సెమీస్‌లో ఓడినప్పటికి రెజ్లింగ్‌ 65 ‌కేజీల ఫ్రీస్టైల్‌ ‌విభాగంలో కాంస్య పతక పోరులో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. తన ప్రత్యర్థి కజకిస్తాన్‌కు చెందిన రెజ్లర్‌ ‌దౌలత్‌ ‌నియాజ్‌బెకోవ్‌కు కనీస అవకాశం ఇవ్వకుండా 8-0 తేడాతో చిత్తుగా ఓడించాడు. ఉడుం పట్టు అంటే ఏంటో ప్రత్యర్థికి రుచి చూపించిన భజరంగ్‌ ‌తన కాంస్యంతో టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఆరో పతకాన్ని అందించాడు. అంతేగాక ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌ ‌విభాగంలో దేశానికి పతకం అందించిన ఆరో రెజ్లర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు భారత్‌కు 2 రజతాలు, 4 కాంస్య పతకాలు వొచ్చాయి.

Leave a Reply