Take a fresh look at your lifestyle.

సిరిసిల్ల చేనేతకు మంచిరోజులు… కార్మికులకు చేతినిండా పని

  • పెద్దూర్‌ అపరెల్‌ ‌పార్కులో 10వేల మందికి ఉపాధి
  • గోకల్‌దాస్‌ ఇమెజేస్‌ ‌ఫ్యాక్టరీ నిర్మాణానికి మంత్రి కెటిఆర్‌ ‌శంకుస్థాపన
  • త్వరలోనే బీమాసౌకర్యం అమలు చేస్తామని వెల్లడి

టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం వొచ్చిన తర్వాత సిరిసిల్లకు మంచి రోజులు వొచ్చాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు. చేనేత కార్మికులకు పని కల్పించి వారి ఉపాధికి ఢోకాలేకుండా చేయడమే తమ లక్ష్యమన్నారు. పెద్దూర్‌ అపరెల్‌ ‌పార్కులో 10 వేల మందికి ఉపాధి కల్పిస్తామని, సీఎం కేసీఆర్‌ ఆశీస్సులతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నామని పేర్కొన్నారు. పెద్దూర్‌ అపరెల్‌ ‌పార్కులో గోకల్‌దాస్‌ ఇమెజేస్‌ ‌ఫ్యాక్టరీ నిర్మాణానికి శుక్రవారం మంత్రి కేటీఆర్‌ ‌శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గోకుల్‌దాస్‌ ఎం‌డీ సువి•ర్‌ ‌హిందూజాతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ.. సిరిసిల్లలో అపరెల్‌ ‌పార్కు ఉండాలనేది ఈ ప్రాంత ప్రజలు ఎప్పట్నుంచో కల కంటున్నారని, 2005లో నాటి సీఎం వైఎస్‌ ‌రాజశేఖర్‌ ‌రెడ్డి అపరెల్‌ ‌పార్కు పెడుతామని మాటిచ్చారు కానీ అమలు చేయలేదని, సీఎం కేసీఆర్‌ ‌నేతృత్వంలో ఇవాళ దానికి బీజం పడిందని అన్నారు.

సిరిసిల్ల ప్రజల కల నెరవేరిందని, ఈ పార్కులో రాబోయే రోజుల్లో 10 వేల మంది ఉపాధి పొందబోతున్నారని, 80 శాతానికి పైగా మహిళలకే ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. బతుకమ్మ చీరలు, గవర్నమెంట్‌ ‌స్కూల్స్ ‌యూనిఫాం ఆర్డర్లు వొస్తున్నాయని, దీంతో నేతన్నల ఆదాయం పెరిగిందని కేటీఆర్‌ ‌తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ఫ్యాక్టరీలను నెలకొల్పుతున్నట్లు కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. ఇక్కడ ఉత్పత్తి చేసే బట్టలు అంతర్జాతీయ మార్కెట్‌కు వెళ్తాయని, అందుకే ఆ స్థాయిలో ఈ ఫ్యాక్టరీలను డెవలప్‌ ‌చేస్తున్నారని చెప్పారు. ఈ పార్కులో వైద్య సదుపాయాలు కూడా కల్పిస్తామన్నారు. బేబీ కేర్‌ ‌సెంటర్‌ ‌కూడా అందుబాటులో ఉంటుందన్నారు. ఈ 60 ఎకరాల్లో రాబోయే రోజుల్లో రెండు, మూడు ఫ్యాక్టరీలు వరుసగా రాబోతున్నాయని, రాబోయే 6 నెలల్లో గోకల్‌దాస్‌ ‌కంపెనీ ప్రారంభం కాబోతుందని కేటీఆర్‌ ‌తెలిపారు. ఈ ఫ్యాక్టరీలో 1000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అత్యధికంగా మహిళలకే ప్రాధాన్యత ఇస్తామని కేటీఆర్‌ ‌చెప్పారు. అయితే ఇప్పటికే చాలా మంది మహిళలు శిక్షణ కూడా పూర్తి చేసుకున్నట్లు పేర్కొన్నారు. భారతదేశంలోనే అత్యధికంగా పత్తి పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నంబర్‌ ‌వన్‌ ‌స్థానంలో నిలిచిందని కేటీఆర్‌ ‌చెప్పారు. అత్యుత్తమైన, నాణ్యత గల పత్తి తెలంగాణలో దొరుకుతుందని సౌత్‌ ఇం‌డియా మిల్స్ అసోసియేషన్‌ ‌వారు చెబుతున్నారని, మన పిల్లలకు ఉపాధి అవకాశాలు దక్కాలనే ఆలోచనతో తెలంగాణ టెక్స్ ‌టైల్‌, అపెరల్‌ ‌పాలసీని తీసుకొచ్చామన్నారు.

ఈ పాలసీలో భాగంగా దేశంలోని ప్రముఖమైన టెక్స్ ‌టైల్‌ ‌సంస్థలను కలిశాశామని, వరంగల్‌ ‌కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ ‌పార్కులో యంగ్‌ ‌వన్‌ అనే సంస్థ 300 ఎకరాల్లో పెట్టుబడులు పెడుతుందన్నారు. దీంతో 12 వేల మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయని, కేరళకు చెందిన కిటెక్స్ ‌సంస్థ వెయ్యి కోట్ల పెట్టుబడితో 4 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వరంగల్‌కు తరలివచ్చిందని కేటీఆర్‌ ‌గుర్తు చేశారు. నేతన్న సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ అనేక పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి కేటీఆర్‌ ‌తెలిపారు. చేనేత బీమా కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. ఈ పథకం కింద రూ. 5 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తామన్నారు. నేతన్నకు చేయూత కార్యక్రమం అమలవుతుందన్నారు. దీని ద్వారా కొరోనా కాలంలో 26 వేల కుటుంబాలకు 110 కోట్లు ఇచ్చి ఆదుకున్నామని పేర్కొన్నారు. కేసీఆర్‌ ‌నాయకత్వంలో మరమగ్గాలు, చేనేత కార్మికులకు రుణమాఫీ చేశామన్నారు. మరమగ్గాల ఆధునీకరణకు కోట్లాది రూపాయాలు ఖర్చు పెట్టడం జరిగిందని కేటీఆర్‌ ‌చెప్పారు. పెద్దూర్‌లోనే 88 ఎకరాల్లో రూ. 400 కోట్లు ఖర్చు పెట్టి వర్కర్‌ ‌టూ ఓనర్‌ అనే పోగ్రామ్‌కు పనులు జరుగుతున్నాయని తెలిపారు. భారతదేశంలో నేతన్నల సంక్షేమం కోసం ఇంత గొప్ప కార్యక్రమం ఎక్కడా జరగడం లేదన్నారు. పెద్దూర్‌ అపరెల్‌ ‌పార్కులో మంచి వాతావరణాన్ని సృష్టించి.. మహిళలకు అన్ని సదుపాయాలు కల్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదని మంత్రి కేటీఆర్‌ ‌స్పష్టం చేశారు.

Leave a Reply