Take a fresh look at your lifestyle.

శాంతించిన గోదావరి

మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ
కొనసాగుతున్న పునరావాస కేంద్రాలు

గత నాలుగు రోజులుగా ప్రజల్లో భయాందోళనలు నింపిన గోదావరి బుధవారం ప్రవాహం నాటికి శాంతించింది. భద్రాచలం వద్ద 61.7 అడుగులు చేరుకున్న గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతూ మూడు, రెండు, మొదటి ప్రమాద హెచ్చరికలను దిగువగా ప్రవహిస్తుంది. బుధవారం సాయంత్రానికి 42 అడుగులు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను కూడ ఉపసంహరించుకున్నారు. వరద ప్రభావంతో రెవెన్యూ కాలనీ, చప్టాదిగువ, సుబాష్‌ ‌నగర్‌ ‌కాలనీ, రామాలయం వీధి జలమయం కావడంతో ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్నప్పటికి ఆ ప్రాంతంలో నీరు ఉండటంతో అక్కడి ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే తలదాచుకుంటున్నారు. అధికారులు పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు అన్నీ సదుపాయాలు కల్పిస్తున్నారు. ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్‌ ‌యంవి రెడ్డి వరద పరిస్థితిపై స్పెషల్‌ ఆఫీసర్‌ ‌విజేతను అడిగి తెలుసుకుంటున్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని ఆదేశాలు జారీ చేసారు. అంతేకాకుండా ఎటువంటి అంటురోగాలు ప్రబలకుండా ఉండేవిధంగా పునరావాస కేంద్రాల వద్ద వైద్యశిబిరాలు ఏర్పాటు చేసారు. వరద ప్రభావం తగ్గు ముఖం పట్టడంతో లోతట్టు ప్రాంత ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు. వరద తాకిడి తగ్గు ముఖం పట్టడంతో గ్రామపంచాయితీ సిబ్బంది స్నాన ఘట్టాలను శుభ్రం చేసే పనిలో ఉన్నారు.

వరద స్నాన ఘట్టాల పైవరకు  ప్రవహించటంతో చెత్తతో పాటు మట్టి చేరుకుంది. అది శుభ్రం చేసే పంచాయితీ సిబ్బంది నిమగ్నమై ఉన్నారు. పుణ్యక్షేత్రం కావడంతో అనేక మంది భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి ఆ ప్రాంతం అంతా బ్లీచింగ్‌ ‌చల్లుతున్నారు. ఎటువంటి అంటురోగాలు రాకుండా చర్యలు చేపడుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో యంపి కవిత పర్యటన గోదావరి వరద ముంపుకు గురైన రెవెన్యూ కాలనీ, రామాలయం, చప్టాదిగువ, సుభాష్‌నగర్‌ ‌కాలనీ, అయ్యప్పకాలనీ, తదితర కాలనీల్లో వరద నీరు చేరుకుని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో మహబూబాబాద్‌ ‌పార్లమెంటు సభ్యురాలు మాలోత్‌ ‌కవిత, ఆ ప్రాంతాలలో పర్యటించారు. అలాగే పునరావాస కేంద్రాల్లో ఉన్న వరద బాధితులను నేరుగా కలుసుకున్నారు. వారికి అందుతున్న సౌకర్యాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతీ ఒక్కరికి ఏర్పాట్లు చేయాలనీ కోరారు. పునరావాస కేంద్రాల్లో ఉన్నవారు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని , వారిని చూసుకోవల్సిన భాధ్యత స్థానిక అధికారులపై ఉందని చెప్పారు. వరద బాధితులకు బ్రెడ్‌, ‌జ్యూస్‌ ‌ప్యాకెట్లు అందచేసారు. వరద బాధితులను ప్రభుత్వం అన్నీ విధాలుగా ఆదుకుటుందని తెలిపారు.

Leave a Reply