- యాసంగి పంటకు రంగనాయకసాగర్ నీళ్లొదిలి నా జన్మ చరితార్థమైంది
- కేసీఆర్ పుట్టిన రోజు కానుకగా పంటకు నీళ్లొదిలిన మంత్రి హరీష్‌రావు
- ఘనంగా కేసీఆర్ బర్త్ డే వేడుకలు
- మరో పదేండ్లు కేసీఆరే సిఎం: సిద్ధిపేటలో మంత్రి హరీష్‌రావు
ఈ గడ్డ మీద పుట్టి స్వరాష్ట్రాన్ని సాధించడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ ప్రాంతానికి గోదావరి నీళ్లు తెచ్చిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మ ధన్యమైతే…సిఎం కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా తొలిసారిగా యాసంగి పంటకు నీళ్లు విడుదల చేయడంతో నా జన్మ చరితార్థమైందనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు పురస్కరించుకుని బుధవారం సిద్ధిపేట, చిన్నకోడూరు తదితర ప్రాంతాలలో మంత్రి హరీష్‌రావు మొక్కలు నాటారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. అనంతరం రంగనాయకసాగర్ రిజర్వాయర్ వద్ద మొక్కలు నాటి రైతుల కోరిక మేరకు సిఎం కేసీఆర్ బర్త్‌డే కానుకగా రంగనాయకసాగర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం యాసంగికి పంట పొలాలకు నీళ్లను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ…కేసీఆర్ పుట్టిన రోజు నాడు మొట్టమొదటిసారిగా ఈ ప్రాంత రైతులకు యాసంగి పంటకు రంగనాయకసాగర్ నుంచి నీళ్లను ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఎండాకాలం వొచ్చిందంటే రైతుల శ్రమ, డబ్బు బోరు పొక్కల్లో పోయేదనీ, అయితే, గోదావరి నీళ్లు తెచ్చి ఈ ప్రాంతంలో సాగునీటి వెతలకు సిఎం కేసీఆర్ శాశ్వత పరిష్కారం చూపారన్నారు. రాష్ట్ర చరిత్రలో యాసంగిలో ఏనాడు 20 లక్షల ఎకరాలకు మించేది కాదనీ, కానీ ఈ యాసంగిలో 50 లక్షల ఎకరాలు జిల్లాలో సాగులోకి వొచ్చిందన్నారు. సిఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నీళ్లు తేవడంతోనే ఇది సాధ్యమైందన్నారు. ఒకనాడు తాగడానికి గుక్కెడు నీళ్లు లేని దుస్థితి నుంచి కేసీఆర్ ముందు చూపుతో యాసంగి పంటకు నీళ్లు ఇచ్చే స్థితికి చేరుకున్నామనీ, ఇది సిద్దిపేట ప్రాంత ప్రజల అదృష్టమన్నారు. ఈ ప్రాంత ప్రజలకు గోదావరి నీళ్లు ఒక కల.. ఆ కలను సిఎం కేసీఆర్ నిజం చేశారనీ, ఈ యాసంగిలో ఒక్క మడి ఎండకుండా సాగు నీరు అందిస్తామన్నారు. సిద్దిపేట, సిరిసిల్ల, హుస్నాబాద్ తదితర మూడు నాలుగు నియోజకవర్గాలకు ఈ సాగునీరు అందనుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, స్థానిక సర్పంచి సూరగోని చంద్రకళ రవిగౌడ్, ఎంపిపి మాణిక్‌రెడ్డి, ఏఎంసి ఛైర్మన్ కాముని శ్రీనివాస్, టిఆర్ఎస్ నేతలు వేలేటి రాధాకృష్ణశర్మ, రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.
మరో పదేండ్లు కేసీఆరే సిఎం…
కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు లేకుంటే తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేది కాదనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. బుధవారం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సిద్ధిపేటలో పలు కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ… తెలంగాణ సాధకుడైన కేసీఆర్ మీద తెలంగాణ ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలు మరువలేనివనీ, తెలంగాణ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను చాలా రాష్ట్రాలు తెలంగాణను ఆదర్శంగా తీసుకున్నాయనీ, తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారిందన్నారు. సిద్దిపేటను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చేసుకుంటున్నామంటే దానికి కారణం ముఖ్యమంత్రి కేసీఆరేననీ, ఇంకా పది సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలతో ముఖ్యమంత్రిగా కేసీఆరే కొనసాగుతాడన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగేదనీ, ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే తెలంగాణ సాధ్యమైందనీ, తెలంగాణ రావడం వల్లే గోదావరి జలాలు సిద్ధిపేటను తాకాయన్నారు. సిద్దిపేట రక్షిత మంచినీటి పథకం మిషన్ భగీరథకు స్ఫూర్తిగా దేశానికే ఆదర్శంగా నిలిచిందనీ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆకాశాన్ని తాకేలా తీసుకెళ్లిన కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను గల్లీ గల్లీలో నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందనీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం తనకెంతో ఆనందంగా ఉందనీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ నేతలు పెద్దయెత్తున పాల్గొన్నారు.
గజ్వేల్‌లో….
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పుట్టిన సందర్భంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌లో టిఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన పలు కార్యాక్రమాలలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పాల్గొన్నారు. కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా మంత్రి హరీష్‌రావు కేక్ కట్ చేశారు. రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మునిసిపల్ ఛైర్మన్ ఎన్‌సి.రాజమౌళి, ఏఎంసి ఛైర్మన్ మాదాసు అన్నపూర్ణ శ్రీనివాస్, ఎంపిపి దాసరి అమరావతి శ్యాంమోహన్, టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు పెద్దయెత్తున పాల్గొన్నారు.