Take a fresh look at your lifestyle.

కొరోనా బాధితులకు దేవుడే దిక్కు ..!

కొరోనా ప్రారంభ దశలో ‘ఫ్రంట్ లైన్ వారియర్స్’ అని పూలవర్షం కురిపించిన ప్రజలే ఇప్పుడు వైద్యులనూ, వైద్య వృత్తినీ నిందిస్తున్న పరిస్థితులు ఏర్పడటానికి వ్యవస్థలో లోపమే కారణం. ఇన్నేళ్ళ స్వాతంత్ర్యం తర్వాత కూడా మన దేశంలో వైద్య,ఆరోగ్య రంగాల పరిస్థితిలో అణు మాత్రం మార్పు రాకపోవడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యమే కారణం. ప్రభుత్వాలు మారినా, వైద్యరంగంపై తగిన అజమాయిషీ లేకపోవడం వల్లనే పరిస్థితుల్లో మార్పు రాలేదన్నది కాదనలేని సత్యం. కొరోనా అనేది గతం లో ఎన్నడూ కనీవినీ ఎరుగని వైరస్. దానిని నిరోధించడంలో అగ్రరాజ్యాలు, అభివృద్ది చెందిన దేశాలే విఫలమవుతున్నాయి. మన దేశంలో అంతకన్నా దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. కొరోనా ప్రారంభ దశలో మన దేశంలో పీపీఈ కిట్లు లేవు.హాస్పిటల్స్ లో శానిటేజర్లు, గ్లౌజులు, మాస్క్ లు లేవు. టెస్టింగ్ లాబ్ లు లేవు. రోగుల సంఖ్య పెరగడంతో ప్రభుత్వ్ దవాఖానాల్లో ఒక్కొక్కటీ సమకూర్చుకుంటూ వొస్తున్నారు. వ్యాధిగ్రస్తుల సంఖ్య ప్రభుత్వాలు ఊహించిన దాని కన్నా ఎక్కువ కావడంతో ప్రైవేటు హాస్పిటల్స్ సహకారాన్ని తీసుకోవల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రైవేటు రంగంలో హాస్పిటల్స్ లోనే కాదు , దేనిలోనైన వ్యాపార దృక్పథం ఉండటం సహజమే. కానీ, తెలుగు రాష్ట్రాల్లో కార్పొరేట్ వైద్యం పేరిట వెలసిన ఆధునిక వైద్య శాలలలో సామాన్యులు ప్రవేశించలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఆధునిక సౌకర్యాలు ఉంటాయన్న పేరే కాని అక్కడా అవి అంతంత మాత్రమే. సర్కార్ దవాఖానాల్లో వైద్యులు నిర్లక్ష్యాన్నీ, ఉదాసీనత్వాన్ని ప్రదర్శిస్తారన్న అపవాదు ఉంది. ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్ లలో పరిస్థితులు అంతకన్నా భిన్నంగా లేవు. పైగా ప్రతి నిమిషం డబ్బు వెదజల్లుతూ ఉండాల్సిందే. పోనీ డబ్బు ఖర్చయినా, వ్యాధిగ్రస్తుల ప్రాణాలు దక్కుతున్నాయా అంటే అదీ లేదు. వ్యాధిగ్రస్తుల ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నిస్తారు. ప్రాణాలను నిలిపే శ క్తి వారి చేతుల్లో లేదు. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్న సంఘటనలు కళ్ళు బైర్లు కమ్మే నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంది. ఈ విషయంలో వైద్యుల పాత్ర కన్నా, హాస్పిటల్స్ యాజమాన్యాల వ్యాపార దృక్పథం ప్రదాన పాత్ర వహిస్తోంది. లక్షలకు లక్షలు కుమ్మరిస్తే తప్ప అక్కడ వైద్యం లభించడం లేదు.

ఒక వేళ కుమ్మరించినా ప్రాణాలు దక్కుతాయన్న గ్యారంటీ లేదు. వ్యాధి ఏ స్థాయిలో ఎలా ఉందో ఎప్పటికప్పుడు చెప్పరు. రక్త సంబంధీకులను సైతం బెడ్స్ వద్దకు అనుమతించరు. హాస్పిటల్స్ గేట్ల వద్ద బాధిత బంధువులు పడిగాపులు కాయాల్సిందే. వైద్యులు, సిబ్బంది ఎప్పటికప్పుడు ఎంత డబ్బు కట్టమంటే అంత కట్టడమే తప్ప ఎదురు అడిగే హక్కు వారికి లేదు. ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్ లో వ్యాధిగ్రస్తుని చేర్చుకునే ముందే లక్షలకు లక్షలు డబ్బు కట్టించుకుంటారు. వ్యాధి నయమైతే అదనంగా మిగిలిన డబ్బు కట్టించుకుని డిశ్ఛార్జ్ చేయడం సాధారణమే. వ్యాధిగ్రస్తుడు చనిపోతే వెంటనే ఆ సమాచారం తెలియజేయరు. సంబంధీకులు పదే పదే ప్రాథేయ పడిన తర్వాత చావుకబురు చల్లగా చెబుతారు. అంతకు అంత డబ్బు కట్టి శవాన్ని తీసుకుని వెళ్ళమని చెబుతారు.అలాంటప్పుడు రక్త సంబంధీకుల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయమేస్తుంది. ఇలాంటి సంఘటనలు హైదరాబాద్, విజయవాడలలో ఎన్నో జరిగాయి. దీనంతటికీ కారణం ప్రైవేటు హాస్పిటల్స్ పై ప్రభుత్వాలకు అజమాయిషీ లేకపోవడమే. ఒక రకంగా ప్రైవేటు హాస్పిటల్స్ ప్రభుత్వాలను లెక్క చేయడం లేదు.ఈ విషయంలో తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటీవల పలు సార్లు నిలదీసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినీ, వైద్య శాఖ కార్యదర్శినీ పిలిపించి పలువిధాల ప్రశ్నించింది. హైకోర్టు ఇలా జోక్యం చేసుకోవడం ఇటీవల కాలంలో ఎన్నడూ జరగలేదు.అయినప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. కొరోనా టెస్ట్ ల విషయంలో తెలంగాణ లో కన్నా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి కొంత మెరుగే.అయినప్పటికీ,అక్కడ కూడా ప్రైవేటు హాస్పిటల్స్ పై ప్రభుత్వానికి పట్టు తప్పిందనడానికి ఒక హాస్పిటల్ కి అనుబంధమైన హోటల్ లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం.

ఈ ప్రమాదంలో 10 మంది ఆహుతయ్యారు. ఇందుకు బాధ్యులెవరు హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యమని హోటల్ వారూ, హొటల్ లో సరైన సౌకర్యాలు లేకపోవడమే కారణమని హాస్పిటల్ వారు ప్రకటనలు చేశారు. అలాంటి ప్రకటనల వల్ల ప్రజలకు ఒరిగేది ఏమిటి అందుకే, ఏ నోటితో అయితే వైద్యులను ప్రజలు ఫ్రంట్ లైన్ వారియర్స్ అని పొగిడారో ఆ నోటితోనే దూషించే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి ఘటనల్లో వైద్యుల పాత్ర ఏమీ లేదని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ –ఐఎంఎ—వాదిస్తోంది. ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యాలనే బాధ్యులను చేయాలని డిమాండ్ చేస్తోంది.అది సహేతుకమే. కానీ, ప్రైవేటు హాస్పిటల్స్ యాజమన్యాలు త్రివిక్రమునిలా ఎదిగి పోయారు. కేంద్రంలో, రాష్ట్రంలో వాటికి లాబీలు ఉన్నాయి వాటిని రక్షించేందుకు పై స్థాయినుంచి ఒత్తిళ్ళు వొస్తాయి. విజయవాడ సంఘటనలో నిందితులను కాపాడేందుకు అస్మదీయ కార్డులను ఉపయోగిస్తున్నారు. జంటనగరాల్లో ప్రైవేటు హాస్పిటల్స్ తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన హైకోర్టు నిబంధనలను పాటించని హాస్పిటల్స్ కు ఇచ్చిన భూమిలీజునూ, ఇతర సౌకర్యాలనూ ఎందుకు రద్దు చేయరని ఆయా హాస్పిటల్స్ పేర్లను ఉటంకిస్తూ హైకోర్టు ప్రభుత్వాన్ని సూటిగానే ప్రశ్నించింది. అయినా అవి లెక్కచేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలాంటి హాస్పిటల్స్ యాజమాన్యాలను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాయి. డబ్బూ పోయింది. ప్రాణమూ పోయిన చందంగా బాధితుల కుటుంబాలు రోదిస్తున్నాయి. వారి రోదనను పట్టించుకునేది ఎవరు..! ఇలాంటి సందర్భాల్లో ‘దేవుడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం..’ అనే పాత సినీ పాట గుర్తుకొస్తుంది.

Leave a Reply