అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం
హైదరాబాద్ నగరంలో అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. జీవో నెంబర్ 46కు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించడంతో నగరంలోని పలు పాఠశాలలో విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. మణికొండ మౌంట్ లిటేరాజీ స్కూల్, బంజారాహిల్స్ మెరీడియన్ స్కూల్..హిమాయత్‌నగర్ ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్, అమిర్పేట్ నీరజ్ పబ్లిక్ స్కూల్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, బేగంపేట సెయింట్ ఆండ్రూస్ స్కూల్, డీడీ కాలనీ నారాయణ స్కూళ్లలో విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేశారు.
స్కూళ్లలో తనిఖీలపై నివేదికను మంత్రికి విద్యాశాఖ అధికారులు సమర్పించారు. జివో ప్రకారం ఫీజులు పెంచరాదని ఉంది. అలాగే ట్యూషన్ ఫీజులను మాత్రమే వసూలు చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో అధిక ఫీజులపై హైకోర్టులో కేసు కూడా దాఖలయ్యింది. దీంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.