కన్సర్వేషన్‌ రిజర్వ్‌ జీవో 49 నిలిపివేత

– మంత్రి సీతక్క హర్షం

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 21 : కొమురం భీం కన్సర్వేషన్‌ రిజర్వ్‌ ఏర్పాటు కోసం ఉద్దేశించిన జీవో 49ను రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసింది. సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు జీవోను నిలుపుదల చేస్తూ అటవీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరి అహ్మద్‌ నదీం మెమో జారీ చేశారు. జీవో నిలుపుదల చేయడం పట్ల పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌, ఎమ్మెల్సీ దండే విఠల్‌, మాజీ ఎంపీ సోయం బాబురావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆసిఫాబాద్‌ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌, ఇతర నేతలతో సచివాలయంలో సోమవారం సీఎంను కలిసి సన్మానించి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తడోబా టైగర్‌ రిజర్వ్‌, కవ్వాల్‌ టైగర్‌ రిజర్వలను కలిపేందుకు వాటి మధ్యలో ఉన్న ప్రాంతం కన్సర్వేషన్‌ రిజర్వ్‌గా ఏర్పాటుకు 2016 జూన్‌ 12న గత ప్రభుత్వం అంకుర్పార్పణ చేసింది. రాష్ట్ర వన్యప్రాణి బోర్డు మొదటి సమావేశంలో ప్రతిపాదిత ప్రాంతాన్ని కన్జర్వేషన్‌ రిజర్వ్‌గా ప్రకటించాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం చర్చించింది. 2017 ఫిబ్రవరి 27న రాష్ట్ర వన్యప్రాణి బోర్డు రెండో సమావేశంలో నోటిఫికేషన్‌ కోసం చర్యలు చేపట్టింది. 2018 జూన్‌ 26న ఛీఫ్‌ వైల్డ్‌ లైఫ్‌ వార్డెన్‌ ప్రతిపాదిత ప్రాంతాన్ని వన్యప్రాణులు అభయారణ్యంగా ప్రకటించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 2019 జూలై 11న కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ కారిడార్‌కు అనుబంధంగా ప్రతిపాదిత ప్రాంతాన్ని ఉపగ్రహ కేంద్రంగా ప్రకటించాలని నిర్ణయించారు. ఆ ప్రాంతాన్ని అత్యవసరంగా కన్జర్వేషన్‌ జోన్‌గా ప్రకటించాలని జాతీయ పులుల సంరక్షణ సంస్థ తెలంగాణ అటవీ శాఖను ఆదేశించింది. ఈ ప్రక్రియను కొనసాగిస్తూ బీజేపీ ఎంపీ గుడెం నగేష్‌, బీఆర్‌ఎస్‌ ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే కోవా లక్ష్మితోపాటు అన్ని పార్టీల ప్రజాప్రతినిధుల మద్దతుతో 2024 జూలై 10న ప్రభుత్వం ముసాయిదాను సిద్ధం చేసింది. కొమురం భీం కన్సర్వేషన్‌ రిజర్వ్‌గా ఏర్పాటు చేస్తూ జీవో 49ని జారీ చేసింది. అయితే ఈ జీవో పట్ల స్థానిక ప్రజలు అనుమానాలు, ఆందోళన వ్యక్తం చేయడంతో మంత్రి సీతక్క నేతృత్వంలో ఆదివాసీ, గిరిజన ఎమ్మెల్యేలతో సంక్షేమ భవన్‌లో 2025 జూన్‌ 10న సమావేశమై జీవోను నిలిపివేయాలని తీర్మానం చేసి స్థానికుల ఆకాంక్షలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు అటవీ పర్యావరణ శాఖ శాఖ మంత్రి కొండా సురేఖ, ఆదిలాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, మంత్రి సీతక్క అటవీ అధికారులు, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా ఎమ్మెల్యేలతో 2025 జూలై 3న సమావేశమై మరోసారి చర్చించి జీవో 49ని నిలుపుదల చేయాలని నిర్ణయించి సీఎంను ఒప్పించారు. కాగా, ప్రభుత్వ నిర్ణయం పట్ల స్థానిక ప్రజలు సంబురాలు చేసుకుంటుండగా వారి ఆకాంక్షల మేరకే జీవో 49పై ముందుకు వెళ్తామని మంత్రి సీతక్క స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *