Take a fresh look at your lifestyle.

వైభవంగా మహాశివరాత్రి…..

భక్తులతో కిక్కిరిసిన వేమువాడ
— శ్రీస్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ మంత్రి,టిటిడి బృందం
సిరిసిల్ల, మార్చి 11 ,(ప్రజాతంత్ర ప్రతినిధి) : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణలో అతిపెద్ద శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ భక్తులతో గురువారం కిక్కిరిసిపోయింది.లక్షలాది భక్తులు శ్రీ స్వామివారిని దర్శించుకోవడానికి వేములవాడకు విచ్చేయడంతో అన్ని రోడ్లు,ఖాళీస్దలాలు,వీధులు నిండిపోయాయి.వేలాది భక్తులు బుధవారం అర్ధరాత్రి నుండి శ్రీస్వామివారిని దర్శించుకోవడానికి,కోడె మొక్కులు చెల్లించుకోవడానికి క్యూలైన్లలో బారులు తీరారు.ఈ భక్తులంతా శ్రీస్వామివారిని దర్శించుకోవడానికి కనీసం 6 గంటల పాటు క్యూలైన్లలో వేచిఉండాల్సి వచ్చింది.

ఈ పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీస్వామివారికి పట్టువస్త్రాలను రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి,రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్‌,‌దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ ‌లు గురువారం ఉదయం సమర్పించారు.ఈ పట్టువస్త్రాలను సమర్పించే క్రమంలో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోగా పోలీసులు గట్టి బందోబస్తును బందోబస్తును నిర్వహించారు..అంతకు ముందు టిటిడి తరపున టిటిడి చైర్మన్‌ ‌వైవి సుబ్బారెడ్డి భార్య వైవి స్వర్ణలత అధ్వర్యంలో అర్చకులు,అధికారుల బృందం రాజన్న గుడికి చేరుకుని పట్టువస్త్రాలను సమర్పించారు. ఈ పర్వదినం సందర్భంగా పలువురు ప్రముఖులు శ్రీస్వామివారిని దర్శించుకున్నారు.

నార్త్ ‌జోన్‌ ఐజి నాగిరెడ్డి దంపతులు,జిల్లా పరిషత్‌ ‌చైర్‌పర్సన్‌ ‌న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి,కరీంనగర్‌ ‌జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ ‌తుల ఉమ రాజేందర్‌,‌రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ ‌కృష్ణ భాస్కర్‌,ఎస్పీ రాహుల్‌ ‌హెగ్డే,అదనపు కలెక్టర్‌ అం‌జయ్య,ఆర్డీఓ శ్రీనివాస రావు,డిఎస్పీ చంద్రకాంత్‌,‌రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ,దేవస్థానం మాజీ చైర్మన్‌ ఆది శ్రీనివాస్‌,‌జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు శ్రీస్వామివారిని దర్శించుకున్నారు.సాయంత్రం ఆరుగంటలకు శ్రీస్వామివారి కళ్యాణమండపంలో స్ధానాచార్య అప్పాల భీమాశంకర్‌ ‌శర్మ,ప్రధానార్చకులు సురేశ్‌,ఉమేశ్‌,‌శరత్‌,‌నమిలికొండ రాజేశ్వరశర్మ తదితర వేదపండిల అధ్వర్యంలో మహాలింగార్చనను,అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో శ్రీస్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు.ఇదే సమయంలో వేలాది భక్తులు ఆలయ ఆవరణలో,తాము బస చేసిన స్థలాల్లో జాగరణలు చేయగా,భాసా సాంస్క్కతిక శాఖ అధ్వర్యంలో సోమవారం రాత్రి నుండి మంళవారం వేకువ జాము వరకు శివార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

Leave a Reply