Take a fresh look at your lifestyle.

తిరుమలలో వైభవంగా పవిత్రోత్సవాలు: వైవి సుబ్బారెడ్డి

దర్శనాల్లో ఎలాంటి ఆటంకాలు లేవన్న వైవి సుబ్బారెడ్డి

తిరుమల,జూలై 30: తిరుమల తిరుపతి దేవస్థానంలో వేంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో మొదటి రోజు శాస్తోక్త్రగా పవిత్ర పతిష్ట కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారిని మండపంలోని యాగశాలలో ప్రతిష్టించి హోమాలు, వైదిక కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం ఉదయం 9గంటల నుంచి 11గంటల వరకు సంపంగి ప్రాకారంలో స్నపన తిరుమంజనం కనులపండువలా జరిపారు. పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 4గంటల నుంచి స్వామి, అమ్మవార్లకు విశేష సమర్పణ కార్యక్రమం నిర్వహించనున్నారు.
అలాగే సాయంత్రం 6నుంచి 7గంటల వరకు ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారిని ఆలయంలోని రంగనాయక మండపంలో ప్రతిష్టించి, యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుపనున్నారు.  ఇదిలావుంటే భక్తులకు స్వామి వారి దర్శనం యథావిధిగా ఉంటుందని టీటీడీ చైర్మన్‌ ‌వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఆలయం ఎదుట ఆయన డియాతో మాట్లాడారు. స్వామి వారి అనుగ్రహంతో కరోనా మహమ్మారి పీడ తొలగి, ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి ఏటా ఆలయంలో పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఇందులో భాగంగా గురువారం ఉత్సవాలు శాస్తోక్త్రగా ప్రారంభమయ్యాయని, కరోనా నివారణ చర్యల్లో భాగంగా మూడు రోజుల పాటు ఏకాంతంగా నిర్వహించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో త్రిదండి రామానూజ చినజీయర్‌ ‌స్వామి, టీటీడీ చైర్మన్‌ ‌వైవీ సుబ్బారెడ్డి, ఈఓ అనిల్‌కుమార్‌ ‌సింఘాల్‌, అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి, డిప్యూటీ ఈఓ శ్రీహర్రీందనాథ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

error: Content is protected !!