Take a fresh look at your lifestyle.

గ్లోబలీ ‘కరోనా’ !

మనిషీ!
చెబితే విన్నావు కదూ!!
నిన్నటిదాకా ఎంత విర్రవీగావ్‌!!!

‌సమస్తం నేనేనని!
పంచభూతాలు  నా కంబంధహస్తాల్లోని
కంప్యూటర్లో బంధీకృతమయ్యాయని!!
గ్లోబలీకరణతో గ్లోబు మొత్తం
ఒక కుగ్రామమైందనీ
ఎంత అహంతో ప్రకటించావు!!

అణుబాంబన్నావు!
నా జోలికి వచ్చేవాళ్ళంతా భస్మీపటలమన్నావ్‌!!
అణువణువు పరమాణువు
నేనెలా చెబితే అలా వింటాయని
ఎంత వికటాట్టహాసం చేసావ్‌!!!

ఎం‌త సేపు నీ ధ్యాస నీదే తప్ప
నీ సహచరుల యావ లేదు గాక లేదు!
నీ కంటే ముందో వెనుకో ప్రకృతిలో పుట్టి
నీతోపాటు జీవించాల్సిన ఎన్ని జీవుల
హక్కులను కాలరాసి అంతంచేసావ్‌!?

‌గెలిచాను.. గెలిచాను.. ..గెలిచాను.. .. ..
అని ప్రకటించావు కదా!
ఏమైంది నీ గెలుపు?

భూ కంపాలు, సునామీలు,
వరదలు, అగ్నిపర్వతాల లావాలు,
ప్లేగు, ఎబోలా, ఏయిడ్స్, ‌సార్స్
‌కలరా, మశూచీలేవైనా కావచ్చు
నీ పాలిట హెచ్చరిక జెండాలేనని
కళ్ళు నెత్తికెక్కిన నీకు
అవి గ్లోబలీకరణమై కోట్ల మందిని మింగిన
నీకు అర్థమయ్యే అవకాశం లేదెందుకు!

మార్కెట్‌.. ‌మార్కెట్‌.. ..‌మార్కెట్‌.. .. ..
‌దేహాల్ని, దేశాల్ని దేన్నీ వదలకుండా
అంతా మార్కెట్‌ ‌మయం చేసావ్‌!
‌విస్తరణకై యుద్ధాల పీడకలలు కన్నావు!!
చూడురా చూడు ఇప్పుడు
నువ్వు ఆ సృష్టించిన మార్కెట్‌, ‌విధ్వంసాల నుండే
మానవ జాతి అంతరించే
మారణహోమం ప్రారంభమైంది గుడ్లప్పగించి చూడు!!!

నువ్వే కాదు
ఇప్పుడు నీవల్ల ఆ కొరోనా కూడా
గ్లోబలీకరణమైంది!

మనిషి!
నీ దుశ్శాసనాల్ని, దుర్మార్గాల్ని
నీ ధ్వంసాల్ని, విధ్వంసాల్ని, వికృత క్రీడల్ని
చూసిన కవిని నేను
క్రాంతదర్శిని నేను
ఇప్పటికైనా చెబుతున్నా విను!!
ప్రకృతి చెత్తలోంచి
ఊపిరి పీల్చుకునే ఒక్క వైరస్‌ ‌చాలు
భూగోళంపై  నీ ఉనికిని ప్రశ్నార్థకం చేయడానికి..!!!

ఆపు ఇక నీ ధ్వంసాన్ని, విధ్వంసాన్ని ఆపు
నీతో పాటు సమస్త జీవరాశులను
స్వేచ్ఛ, సమానత్వ, సౌబ్రాతృత్వాలతో
జీవించనివ్వు, నువ్వు సుఖంగా జీవించు!
ఇప్పటికైనా అర్థమైందా
సర్వేజనః సుఖినో భవంతు మాత్రమే కాదు!!
సర్వేపి సుఖి నః సంతు అని!!!

 – డాక్టర్‌ ఏరుకొండ నరసింహుడు
9701007666

Leave a Reply