Take a fresh look at your lifestyle.

కంటి చూపును హరించే అదృశ్య శత్రువు గ్లాకోమా..

 (07 – 13 మార్చి ‘‘వరల్డ్ ‌గ్లాకోమా వీక్‌’’ ‌సందర్భంగా)

కంటి చూపు ఉన్నపుడే పంచరంగుల ప్రపంచాన్ని ఆస్వాదించవచ్చు. భగవంతుని సృష్టిని చూడగలగడమే అపూర్వ ఆస్తి. దృష్టి లేని అభాగ్యుల జీవితాల్లో చీకటే రాజ్యమేలుతుంది. కంటి చూపును పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలు విధిగా తీసుకోవాలి. ‘చికిత్స కన్న నివారణే మిన్న’ అని నిత్యం భావిద్దాం. తరుచుగా ( కనీసం 2 ఏండ్లకు ఓకసారి) నేత్ర పరీక్షలు చేయించుకుంటూ, ప్రమాదకర అంధత్వం గ్లాకోమా దుస్థితి నుంచి దూరంగా ఉందాం. కంటి చూపు క్రమంగా మందగించడంతో ఏర్పడే దృష్టి లోపాన్ని ‘గ్లాకోమా’ వ్యాధి అంటాం. గ్లాకోమా అనే కంటి సంబంధ లోపాన్ని నివారించడానికి తరుచుగా కంటి పరీక్షలు చేసుకోవడం, తొలి దశలోనే గుర్తించడం, వైద్యంతో నయం చేసుకోవడం జరుగుతుంది. గ్లాకోమా ముదిరితే కంటి చూపు తగ్గిపోతూ, వైద్యులప కూడా నయం చేయలేని నిస్సహాయ స్థితికి చేరి, చివరకు కోలుకోలేని అంధత్వం వస్తుంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2.3 శాతం ప్రజలు గ్లాకోమాతో సతమతం అవుతున్నారని, 4.5 మిలియన్ల గ్లాకోమా రోగులు దృష్టి కోల్పోయారని ప్రకటించింది. ఇండియాలో కనీసం 12 మిలియన్లు గ్లాకోమాతో బాధ పడుతున్నారని, వీరిలో 1.2 మిలియన్లు అంధత్వం పొందారని తేలింది. తెలంగాణలో 5 లక్షల గ్లాకోమా బాధితులు ఉన్నారని అంచనా. సాధారణంగా 90 శాతం కేసుల్లో గ్లాకోమా ముందస్తుగా గుర్తించటం జరగదు. వయసు పెరిగిన కొద్దీ గ్లాకోమా వ్యాధి బారిన పడే అవకాశం పెరుగుతుంది. ఇలాంటి ప్రమాదకర దృష్టి దోష సమస్య తీవ్రతను గుర్తించిన ‘ప్రపంచ గ్లాకోమా అసోసియేషన్‌‘ ‌నిరంతర కృషితో గ్లాకోమా వ్యాధి పట్ల సామాన్య ప్రజలకు అవగాహన కల్పించే క్రమంలో ప్రతి ఏటా 07 మార్చి నుంచి 13 మార్చి (కొన్ని దేశాల్లో 8 – 14 మార్చి) వరకు ‘ప్రపంచ గ్లాకోమా వారం (వరల్డ్ ‌గ్లాకోమా వీక్‌)’ ‌పాటించుట ఆనవాయితీగా వస్తున్నది. ‘ప్రపంచ గ్లాకోమా వారం-2021‘ నినాదంగా ‘ది వరల్డ్ ఈజ్‌ ‌బ్రైట్‌, ‌సేవ్‌ ‌యువర్‌ ‌సైట్‌’‌ను తీసుకొని అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది.

గత దశాబ్ద కాలంగా గ్లాకోమా సంబంధ దృష్టి లోపాన్ని అనుభవిస్తున్న ప్రజల్లో, ముఖ్యంగా వృద్ధులలో 30 శాతం పెరిగిందని తేలింది. కంటి చూపుకు ప్రధానమైన ‘దృష్టి నాడి (ఆప్టిక్‌ ‌నర్వ్)’ ‌దెబ్బతినడం కారణంగా బయట పడే దృష్టి లోపాన్ని గ్లాకోమాగా పిలుస్తారు. నేత్రాలు సక్రమంగా విధులు నిర్వహించడానికి, ఆకారం నిలవటానికి నిర్దిష్ట నేత్ర పీడనం (11 – 21 యంయం మెర్క్యురీ) అవసరం అవుతుంది. దృష్టి నాడి బలహీన పడడం లేదా దెబ్బతినడంతో నేత్ర పీడనం అతిగా పెరగడం జరిగినపుడు దృష్టి నాడి దెబ్బతిని కంటి చూపు క్రమంగా తగ్గిపోతూ, సకాలంలో గుర్తించని యెడల శాశ్విత అంధత్వం రావచ్చు.

Glaucoma is an invisible enemy to eyes

నేత్ర వ్యవస్థలో నిరంతరం నియమిత పరిమాణంలో జల ద్రవాలు ఊరుతూ, కొంత ద్రవం కంటిలోంచి బయటకు వస్తుంది. ఈ జల ద్రవం అవసరం కన్న తక్కువ ఉత్పత్తి అయినపుడు కంటి వ్యాధికి దారి తీస్తుంది. గ్లాకోమా వ్యాధికి తీవ్రమైన లక్షణాలు ఏవీ కనిపించవు. కంటి నొప్పి లాంటి లక్షణాలు అనుభవంలోకి వచ్చినపుడు నేత్ర వైద్యున్ని సంప్రదించాలి. తరుచుగా కంటి పరీక్షలు చేయించుకోవడం అనే సూత్రమే గ్లాకోమాను ఎదుర్కొనే ఏకైక మార్గమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గ్లాకోమా వ్యాధిలో దీర్ఘకాలిక (క్రోనిక్‌) ‌మరియు తీవ్రమైన (అక్యూట్‌) ‌గ్లాకోమా రకాలు ఉన్నాయి. వయస్సు, మానవ జాతి, బిపి, షుగర్‌, ఇతర వ్యాధులు, కుటుంబ నేపథ్యం మరియు హ్రస్వ దృష్టి లాంటి అంశాలపై దీర్ఘకాలిక గ్లాకోమా ఆధారపడి ఉంటుంది. నేత్ర పీడనం అతిగా పెరిగినపుడు తీవ్రమైన (అక్యూట్‌) ‌గ్లాకోమా లక్షణాలకు దారి తీస్తుంది.

తొలి దశలో గ్లాకోమాను గుర్తిస్తే నయం చేసి దృష్టిని కాపాడవచ్చు. వ్యాధి ముదురుతే నయం చేయడం వీలుకాదని తెలుసుకుందాం. తొలి దశలో గుర్తించబడిన రోగులకు కంటి చుక్కలు, ఔషధాలు మరియు శస్త్రచికిత్స విధానంతో నయం చేసే ప్రయత్నాలు చేస్తారు. గ్లాకోమా ప్రమాదం 40 ఏండ్లు దాటిన ప్రజల్లో సాధారణంగా కనిపిస్తాయని తెలుసుకొని, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి విధిగా నేత్ర పరీక్షలు చేసుకొని గ్లాకోమాకు దూరంగా, జీవిత వెలుగులకు దగ్గరగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఎలాంటి వ్యాధి లక్షణాలు లేక పోవడంతో గ్లాకోమా పట్ల ప్రజలు జాగరూకత అత్యవసరం. ప్రపంచ గ్లాకోమా వారం సందర్భంగా సమాజంలో ఉచిత నేత్ర పరీక్షల నిర్వహణ, గ్లాకోమా రోగులకు అవసర చికిత్స, అవగాహన వేదికలు, ఉపన్యాసాలు, ప్రసార మాద్యమాలద్వారా ప్రచారం, విద్యాలయాలలో వ్యాధి పట్ల సంపూర్ణ అవగాహన కల్పించడం జరగాలి. అదృశ్య శత్రువు గ్లాకోమా, ముందు చూపుతో తరుచుగా పరీక్షలు చేయించుకొని గ్లాకోమాను అంతం చేద్దాం.

Dr. Burra Madhusudan Reddy Recipient of the National Best Faculty Award, Retired Principals, Government Degree PG, College Karimnagar
డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి
జాతీయ ఉత్తమ అధ్యాపక ఆవార్డు గ్రహీత , విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ, కళాశాల
కరీంనగర్‌ – 99497 00037

Leave a Reply