Take a fresh look at your lifestyle.

పెట్టుబడి ఇచ్చి..గిట్టుబాటు పెంచి..!

“నాడు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలో అవసరానికి భూములు అమ్మకానికి పెడితే కొనేవారు కరువయ్యారు. ఇప్పుడు అవే భూములకు పదింతలు చెల్లిస్తామన్నా అమ్మేవారు ముందుకురావడం లేదు. రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు రైతుల్లో ధైర్యాన్ని నింపాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ వ్యవసాయం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. పంటల సాగులో ‘ప్రాణవాయువు’ లాంటి సాగునీరు లేక రైతులు తల్లడిల్లేవారు. అనావృష్టి పరిస్థితులు తరచుగా ఎదురవ్వటంతో పంటలు ఎండిపోయేవి. రైతులు పంటలు కోల్పోయి నష్టాల పాలయ్యేవారు. కొద్దిపాటి సాగునీటికి ‘బోరు బావులే’ ఆధారం. నాణ్యమైన విద్యుత్‌ అం‌దుబాటులో లేకపోవటంతో బోర్లు ఫెయిలై పెట్టుబడి ఖర్చులు అమాంతం పెరిగిపోయేవి. పత్తి లాంటి ప్రధాన పంటలు రైతులు సాగు చేస్తుంటే నకిలీ విత్తనాలు, చీడ-పీడల సమస్య, అధిక విత్తన ధరలతో సతమతమవుతుండే.”

‘దండుగన్న వ్యవసాయాన్ని’ పండుగలా చేసి చూపించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుంది. ఈ విజయాన్ని సాధించటానికి కేసీఆర్‌ ‘‌మహా యజ్ఞమే చేశారు. కాడి వదిలేసి పట్టణాలకు వలసవెళ్లిన రైతులను తిరిగి పల్లెలకు తెప్పించగలగడంలో కేసీఆర్‌ ‌రూపొందించిన రైతు సంక్షేమ పథకాలైన ‘రైతు బంధు’, ‘రైతు బీమా’, రైతు రుణమాఫీలాంటివి ముఖ్య పాత్ర పోషించాయి. తెలంగాణలో వరి పండదన్న అవహేళన చేసిన ఆంధ్రా పాలకుల నోట ‘తెలంగాణ రాష్ట్రం’ దేశ అన్నపూర్ణ’గా ఎదిగిందని చెప్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ది. ఈ అద్భుత విజయానికి కర్త, కర్మ, క్రియ కేసీఆరే అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

నాడు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలో అవసరానికి భూములు అమ్మకానికి పెడితే కొనేవారు కరువయ్యారు. ఇప్పుడు అవే భూములకు పదింతలు చెల్లిస్తామన్నా అమ్మేవారు ముందుకురావడం లేదు. రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు రైతుల్లో ధైర్యాన్ని నింపాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ వ్యవసాయం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. పంటల సాగులో ‘ప్రాణవాయువు’ లాంటి సాగునీరు లేక రైతులు తల్లడిల్లేవారు. అనావృష్టి పరిస్థితులు తరచుగా ఎదురవ్వటంతో పంటలు ఎండిపోయేవి. రైతులు పంటలు కోల్పోయి నష్టాల పాలయ్యేవారు. కొద్దిపాటి సాగునీటికి ‘బోరు బావులే’ ఆధారం. నాణ్యమైన విద్యుత్‌ అం‌దుబాటులో లేకపోవటంతో బోర్లు ఫెయిలై పెట్టుబడి ఖర్చులు అమాంతం పెరిగిపోయేవి. పత్తి లాంటి ప్రధాన పంటలు రైతులు సాగు చేస్తుంటే నకిలీ విత్తనాలు, చీడ-పీడల సమస్య, అధిక విత్తన ధరలతో సతమతమవుతుండే. ఆంధ్రా రైతులతో పోలిస్తే తెలంగాణ రైతులకు వ్యవసాయం ద్వారా నికర లాభం తక్కువగా ఉండేది. పంటల ఉత్పత్తి ఖర్చులు దేశంలోని రాష్ట్రాలలో తెలంగాణలోనే ఎక్కువ. ఆంధ్రలో కాలువల ద్వారా సాగునీరు పంటలకు అందుబాటులోకి గ్రావిటీ ద్వారా పారితే, తెలంగాణలో కరెంటు వాడి, బోర్ల నుంచి తోడుకోవలసి ఉండేది. అసలే భూగర్భ జలమట్టాలు తక్కువ కావటం, బోర్లు విఫలమవ్వటంతో సాగుఖర్చులు పెరిగేవి. ఇలా దశాబ్దాల పాటు ఆంధ్రా పాలకులు చేసిన అన్యాయాన్ని కేసీఆర్‌ ‌కేవలం ఏడేండ్లలో సవరించారు. ఉమ్మడి పాలకులు బిందు, తుంపర సేద్యం, హరితగృహాలలో సాగు వంటి ఆధునిక సాగు పరిజ్ఞానం తెలంగాణ రైతులకు పరిచయం చేసిన పాపానపోలేదు. ఫలితంగా తెలంగాణ రాష్ట్రంలో పంటల సాగంటే కష్టం, నష్టం. తెలంగాణ రైతంటే ఆత్మహత్యలకు దగ్గరన్నట్టే. తెలంగాణలో వ్యవసాయం మరిసిపోయిన వ్యాపకంగా ఉండేది.

ఆ వ్యవసాయ చీకటి (అగ్రికల్చర్‌ ‌బ్లాక్‌ ‌డేస్‌) ‌రోజులను చీల్చుతూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ ‌వ్యవసాయ బంగారు రోజులు (అగ్రికల్చర్‌ ‌గోల్డెన్‌ ‌డేస్‌)‌ను తీసుకువచ్చారు. ఇందుకు దశాబ్దాలు పట్టలేదు. కేవలం ఏడేండ్లే పట్టింది. ఏ దేశ చరిత్ర చూసినా ఏదైనా చరిత్ర సృష్టించటానికి ‘దశకాలు’ పట్టాయని అధ్యయనాలు చెప్తున్నాయి. ‘తెలంగాణ రాష్ట్రంలో’ వ్యవసాయరంగం అభివృద్ధి చెందే క్రమంలో ప్రతి దశలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‘‌విధానాలు’ స్పష్టంగా కనిపిస్తున్నాయి. వ్యవసాయ రంగంపై గంటల తరబడి చర్చించడానికి ఆయన ఇష్టపడుతారు. అందుబాటులో ఉంటారు. వంద శాతం ప్రాక్టికల్‌ ‌చర్యలుంటాయి. సమగ్ర విధానాలకే మొగ్గు చూపుతారు కేసీఆర్‌. ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఏ పథకంలో కూడా వెనుకకు తగ్గింది లేదు. వ్యవసాయరంగ అభివృద్ధి పట్ల కేసీఆర్‌కు ఉన్న నిబద్ధత అది. చెప్పినదానికంటే ప్రకటించే సమయంలో రెండు రెట్లు అదనంగా ఇవ్వటమే ఆయనకు సంతోషాన్నిచ్చే అంశం.

తెలంగాణ ఆవిర్భావ అనంతరం రాష్ట్రం వ్యవసాయ ఆదాయ వృద్ధి రేటులో 6.59 శాతంతో దేశంలో రెండవ ర్యాంకు సాధించింది. పెద్ద రాష్ట్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే తెలంగాణదే మొదటి ర్యాంకు. వ్యవసాయ రంగంలోని ప్రతి అంశంలో తీసుకున్న సమగ్ర ప్రణాళికలే దీనికి గల ప్రధాన కారణాలు. కేవలం ఏడేండ్ల కాలంలో 4.85 కోట్ల టన్నుల ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీటి విలువ రూ.84 వేల కోట్ల పైనే.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు లక్షలాది మంది రైతుబంధు సభ్యులు, ప్రతి గ్రామానికి రైతు వేదికల నిర్మాణాలతో కేసీఆర్‌ ‌సాగుకు నూతనోత్సాహం తెచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో రైతు రుణమాఫీ అయ్యింది. సాగునీటి బాధ తప్పింది. కరెంటు రంది లేదు. రైతుబంధుతో రైతులకు పెట్టుబడి కోసం అప్పులు చేయాల్సిన బాధలు తప్పాయి. ప్రభుత్వం పంటలను మద్దతు ధరకే కొనుగోలు చేసి గిట్టుబాటు ధర అందిస్తున్నది. సాగులో సూచనలకు విస్తరణాధికారులు రైతులకు అందుబాటులో ఉన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే విత్తనం కొనుగోలు నుంచి గిట్టుబాటు ధర వచ్చేదాన్క ప్రభుత్వమే రైతుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. వీటన్నింటికి కారణం ఒక్కటే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన. ఆ ఆలోచన ఫలితమే నేటి వ్యవసాయరంగ ప్రాధాన్య ‘బంగారు తెలంగాణ’. ‘రైతు తెలంగాణ’ సాకారం కావటం.

– చిట్నేని రవిందర్‌ ‌రావ,• జగిత్యాల

Leave a Reply