Take a fresh look at your lifestyle.

మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణపై సమగ్ర నివేదిక ఇవ్వండి

  • ఎస్‌ఇసికి గవర్నర్‌ ‌తమిళిసై ఆదేశం
  • ఇప్పటికే గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ
  • ఎన్నికల వాయిదా వేయించాలని గవర్నర్‌కు టి పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ ‌లేఖ

రాష్ట్రంలో కొరోనా  మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించే విషయంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర గవర్నర్‌ ‌తమిళిసై రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు. మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణను వాయిదా వేసేలా ఆదేశాలు జారీ చేయాలని ఇప్పటికే బీజేపీ గవర్నర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టులో సైతం పలు పిటిషన్లు దాఖలయ్యాయి. తాజాగా, ఇదే అంశంపై శుక్రవారం టీ పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి సైతం గవర్నర్‌కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ ‌తమిళిసై స్పందించారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫోన్‌ ‌చేసి ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు లేవనీ, వివిధ వర్గాలు లేవనెత్తుతున్న అంశాలపై చర్చించారు. ఆరోగ్య శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎన్నికల నిర్వహణకు సిద్ధమయ్యామనీ, అన్ని ముందు జాగ్రత్తలు తీసుకునే ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్‌ఈసి గవర్నర్‌కు వివరించారు.మరోవైపు, కొరోనా భయంకర పరిస్థితుల్లో మున్సిపల్‌ ఎన్నికలు వాయిదా వేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ టి పిసిసి చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్గి గవర్నర్‌ ‌తమిళిసైకి లేఖ రాశారు. రాష్ట్రంలో కొరోనా తీవ్ర స్థాయిలో ఉందనీ,  మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు భారీ సంఖ్యలో కొరోనా బారిన పడతారంటూ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనీ, ప్రభుత్వ నిర్ణయానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా తలొగ్గిందని లేకలో పేర్కొన్నారు. ఇంతటి భయానక పరిస్థితుల్లో గవర్నర్‌ ఎన్నికల నిర్వహణ విషయంలో జోక్యం చేసుకోవాలనీ, ఎన్నికలు వాయిదా వేసేలా తగిన చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్‌ ఉత్తమ్‌కు ఫోన్‌ ‌చేసి రాష్ట్రంలో కొరోనా పరిస్థితిపై మరిన్ని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘంతో మాట్లాడతానని ఉత్తమ్‌కు గవర్నర్‌ ‌హామీ ఇచ్చారు.

Leave a Reply