Take a fresh look at your lifestyle.

రాజకీయ కార్యక్రమాలకు కాస్త బ్రేక్‌ ఇవ్వండి ..!

‘అందరూ సురక్షితంగా ఉండే వరకు ఎవరూ వైరస్‌ ‌నుండి సురక్షితంగా ఉండరు…’ ఇది ఈ రోజు మన ముందున్న వాస్తవ దృశ్యం. దేశవ్యాప్తంగా కొరోనా వైరస్‌ ‌విస్తరణ ఆందోళన కలిగిస్తుంది. గురువారం ఒక్క రోజే లక్షా 30 వేల పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో బుధవారం కంటే గురువారం 20 శాతం అధికంతో 2478 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. విస్తరిస్తున్న వైరస్‌కు ప్రజలను మాత్రమే బాధ్యులను చేస్తూ ప్రభుత్వాలు కఠినమయిన నిబంధనలను అమలు చేస్తామనడం హాస్యాస్పదం. గత సంవత్సరం వైరస్‌ ‌విస్తరణ కట్టడికి విధించిన లాక్‌ ‌డౌన్‌ అనుభవంతో రెండవ దశ వైరస్‌ ‌వ్యాప్తి నివారణకు ప్రయత్నించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం ముఖ్యమంత్రుల వీడియో కాన్ఫరెన్స్‌లో సూచించారు. అవసరమయితే రాత్రి పూట ‘కొరోనా కర్ఫ్యూ’ ప్రయత్నించవొచ్చు అన్నారు. విస్తృతంగా వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమం చేపట్టాలని ప్రధాని సూచిస్తుంటే ..మరో వైపు టీకా సరఫరాపై రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. విస్తరిస్తున్న వైరస్‌ ‌దృష్ట్యా న్యూజిలాండ్‌ ‌మన దేశ విమాన సర్వీసులను అనుమతించడం లేదు. ఈ రోజు  న్యూజిలాండ్‌..‌రేపు మరో దేశం కావొచ్చు..! విస్తరిస్తున్న వైరస్‌కు ప్రజలను మాత్రమే బాధ్యులను చేస్తున్న పాలకులు..తమ రాజకీయ సమావేశాలకు, ఎన్నికలకు మాత్రం బ్రేక్‌ ఇవ్వడం లేదు. ప్రజలకు సూచనలు చేస్తున్నవారే స్వయంగా కొరోనా నిబంధనలకు వ్యతిరేకంగా బహిరంగ సమావేశాలను ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రంలో  కోవిడ్‌ ‌నియంత్రణలో భాగంగా ప్రభుత్వ ఆదేశాలు, పోలీసు శాఖ తీసుకోవలసిన చర్యల గురించి రాష్ట్రవ్యాప్తంగా పోలీస్‌ అధికారులతో రాష్ట్ర డిజిపి  ఎం మహేందర్‌ ‌రెడ్డి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ‌నిర్వహించారు. రాష్ట్రంలో కొరోనా సెకండ్‌ ‌వేవ్‌ ‌తీవ్రత గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం అత్యంత ప్రధానమని, కొరోన కట్టడికి ప్రతి ఒక్కరు మాస్క్ ‌ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఇతర ఆరోగ్య సూత్రాలు పాటించడం వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని డిజిపి సూచించారు. గ్రామాలలో గ్రామ పోలీస్‌ అధికారులు సర్పంచ్‌, ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్కరు మాస్క్ ‌ధరించడంపై అవగాహన కల్పించాలన్నారు. కొరోనా వైరస్‌ ‌విస్తృతిపై గ్రామీణ ప్రాంత ప్రజలకు, అడవుల్లో నివసించే గిరిజనులకు ఉన్న అవగాహనను మొదటి దశలో గమనించాము. గత సంవత్సరం కొరోనా వైరస్‌ ‌విస్తరణ ప్రారంభంలో ఈ ప్రజలు తమ గ్రామాల్లో రాక పోకలను నియంత్రిస్తూ మహిళలు గస్తీ నిర్వహించిన దృశ్యాలు, గిరిజన ప్రాంత ప్రజలు ముఖాన్ని ఆకులతో రక్షించుకున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో  విస్తృతంగా ప్రచారం పొందాయి. డిజీపీ స్థాయి రాష్ట్ర అధికారులు సామాన్య పౌరులకు వైరస్‌ ‌పట్ల అవగాహన కల్పించాలన్న ఆలోచనను రాజకీయ కార్యక్రమాలలో జరుగుతున్న కోవిడ్‌ ‌నిబంధనల ఉల్లంఘనల వైపు మళ్లించాలి.

ఒక వైపు కొరోనా వైరస్‌ ‌విస్తృతిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ..మరో వైపు ఖమ్మంలో షర్మిల బహిరంగ సభకు భారీ కాన్వాయ్‌ను ఏ నిబంధనలకు లోబడి అనుమతి ఇచ్చారో డిజీపీ సమాధానం చెప్పాలి. నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల ప్రచారంలో  రాజకీయ పార్టీల కోవిడ్‌ ‌నిబంధనల ఉల్లంఘనలపై దృష్టి పెట్టాలి. రాష్ట్రానికి ఆదాయ వనరు మద్యం దుకాణాలు, బార్లు, పబ్బుల వద్ద కోవిడ్‌ ‌నిబంధనలు గాలికొదిలేస్తున్న సంఘటనలు మన ముందున్నాయి. ఇదే అంశంపై న్యాయ స్థానం కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ప్రజలు బాధ్యతను గుర్తించి..గ్రామీణ ..మండల స్థాయి నుంచి వైరస్‌ ‌కట్టడికి కొందరు తమ ప్రాంతాల్లో లాక్‌ ‌డౌన్‌ ‌వంటి చర్యలను తీసుకుంటున్నారు. వ్యాపార వర్గాలు సమయాన్ని కుదించుకుంటున్నారు. ప్రజలు టీకా తీసుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు.కొరోనా వైరస్‌ ‌విస్తరణ పట్ల బాధ్యత లేని రాజకీయ పార్టీలకు డిజీపీ స్థాయి అధికారులు తమదైన శైలిలో అవగాహన కల్పించాలి.

Leave a Reply