Take a fresh look at your lifestyle.

నాసిక్‌ ‌హాస్పిటల్‌లో ఘోరం

  • లీక్‌ ‌కారణంగా ఆక్సీజన్‌ అం‌దక 22 మంది కొరోనా బాధితులు మృతి
  • ఘటనపై ప్రధాని మోడీ, అమిత్‌ ‌షా, రాజ్‌నాథ్‌ల దిగ్భ్రాంతి

దేశంలో కోవిడ్‌-19 ‌విజృంభణతోపాటు ప్రాణవాయువు కొరత వేధిస్తున్న సమయంలో మహారాష్ట్రలోని నాసిక్‌లో లీక్‌ ‌కారణంగా సంఘటనలో ఆక్సిజన్‌ అం‌దక దాదాపు  22 మంది కొరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. నాసిక్‌లో ఉన్న డాక్టర్‌ ‌జకీర్‌ ‌హుస్సేన్‌ ‌హాస్పిటల్‌లో బుధవారం ఈ విషాద ఘటన జరిగింది. నాసిక్‌ ‌జిల్లా కలెక్టర్‌ ‌సూరజ్‌ ‌మంధరే తెలిపిన వివరాల ప్రకారం, ఈ సంఘటన నేపథ్యంలో 22 మంది మరణించారు. వీరంతా కోవిడ్‌-19 ‌వైరస్‌ ‌బాధితులే. ఆక్సిజన్‌ ‌లీక్‌ అయిన తర్వాత హాస్పిటల్‌లో రోగులకు ఆక్సిజన్‌ ‌సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో వీరు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే మహారాష్ట్ర మంత్రి డాక్టర్‌ ‌రాజేంద్ర షింగనే వివరాలు వెల్లడిస్తూ.. ‘డాక్టర్‌ ‌జకీర్‌ ‌హుస్సేన్‌ ‌హాస్పిటల్‌లో బుధవారం ఆక్సిజన్‌ ‌ట్యాంకర్‌లో ఆక్సిజన్‌ను వేరొక ఆక్సిజన్‌ ‌ట్యాంకర్‌ ‌ద్వారా నింపుతున్న సమయంలో ప్రాణవాయువు బయటకు పెల్లుబికింది. దీంతో సరఫార నిలిపివేశారు. దీంతో ప్రాణవాయువు అందక 22మంది దుర్మరణం చెందారు. ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన’ అని తెలిపారు. దీనిపై సవివరమైన నివేదికను తెప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఈ దారుణానికి బాధ్యులైనవారిని వొదిలిపెట్టేది లేదన్నారు.

మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్‌ ‌టోపే మాట్లాడుతూ, నాసిక్‌లో ట్యాంకర్‌ ‌వాల్వులు లీక్‌ అయినందువల్ల పెద్ద మొత్తంలో ఆక్సిజన్‌ ‌లీక్‌ అయినట్లు తెలిపారు. దీని ప్రభావం హాస్పిటల్‌పై కూడా ఉండే అవకాశం ఉందన్నారు. ఇంకా వివరాలు అందవలసి ఉన్నాయన్నారు. అసలే మహారాష్ట్రలో కొరోనా వైరస్‌ ‌విలయ తాండవం చేస్తున్నది. మరోవైపు ఆక్సిజన్‌ ‌కొరత తీవ్రంగా వేధిస్తున్నది. ఇటువంటి సమయంలో ఈ దుర్ఘటన జరగడం మరింత బాధాకరం. నాసిక్‌లో ఆక్సిజన్‌ ‌లీక్‌ ‌దుర్ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓ హాస్పిటల్‌లో జరిగిన విషాదం హృదయాన్ని కలచివేసిందని పేర్కొన్నారు. 22 మంది ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా బాధించిందన్నారు. ఈ విషాద సమయంలో బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ఇచ్చిన ట్వీట్‌లో, నాసిక్‌ ‌నుంచి చాలా దుర్వార్త అందిందన్నారు.   కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా ఇచ్చిన ట్వీట్‌లో, నాసిక్‌లోని హాస్పిటల్‌లో జరిగిన దుర్ఘటన వార్త కలచివేసిందని పేర్కొన్నారు. అత్యంత ఆత్మీయులను కోల్పోవడం వల్ల జరిగిన నష్టాన్ని ఎన్నటికీ పూడ్చడం సాధ్యంకాదని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. చికిత్స పొందుతున్నవారంతా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

Leave a Reply