Take a fresh look at your lifestyle.

సమస్యలతో నగర ప్రజల నిత్య పోరాటం

కార్పొరేషన్‌పై పట్టుకోసం పార్టీల ఆరాటం 

గ్రేటర్‌ ‌రణన్నినాదం ఆదివారం నుంచీ తార స్థాయికి చేరుకుంది. సిద్ధాంతాలు, నగరాభివృద్ధి, జనసంక్షేమం, సౌకర్యాల మాట ఎలా ఉన్నా సవాళ్ళు ప్రతి సవాళ్ళు, ఆగ్రహోపన్యాసాలు, దూషణ భూషణలతో గ్రేటర్‌ ‌లోని 150 డివిజన్లు దద్దరిల్లుతున్నాయి. గ్రేటర్‌ ఎన్నికల్లో పార్టీల నాయకత్వ పేరుప్రతిష్ఠలు గెలుపే ప్రధానమై నేతల ఉపన్యాసాలు శృతిమించాయి. ఈ సారి కొత్తగా మతం ప్రత్యేక ప్రస్తావన అంశమై గ్రేటర్‌ ‌వాసుల గుండెల్లో గుబులు మొదలైంది. పేరుకు రంగంలో అన్ని పార్టీలు ఉన్నా.. ప్రచారంలో అధికార పార్టీ టి ఆర్‌ ఎస్‌,
‌దేశంలో అధికార పార్టీ బి జె పి ప్రధాన ప్రత్యర్ధులుగా పోరు సాగుతున్నది. టి.ఆర్‌.ఎస్‌.‌కు మిత్ర పక్షం ఎం.ఐ.ఎం. అనే విషయం జగమెరిగిన సత్యం. ఇక కాంగ్రెస్‌ ‌శాశ్వతంగా తృతీయ స్థానంలో నిలదొక్కుకున్నట్లే. టిడిపి, ఉభయ కమ్యూనిస్టులు కాకుండా స్వతంత్రులు ఉనికి నిరూపించుకునేందుకు గట్టి ప్రయత్నం చేస్తున్నాయి.

ఎన్నికల కమిషన్‌ ‌ప్రకటించిన నామినేషన్ల తుదిజాబితా ప్రకారం 150 డివిజన్లకు గాను రంగంలో మొత్తం 1121 మంది అభ్యర్ధులు మిగిలారు. బరిలో టి.ఆర్‌.ఎస్‌., ‌బి.జె.పి., కాంగ్రెస్‌ 150 ‌స్థానాల్లోనూ పోటీ చేస్తుండగా టి.డి.పి.105 మందిని రంగంలో నిలిపింది. ఎం.ఐ.ఎం. 50 డివిజన్లకు పైగా అభ్యర్ధులను బరిలో దింపింది. ఇతరపార్టీలు, స్వతంత్రులు సుమారు 500 మంది బ్యాలెట్‌ ‌పేపర్‌పై స్థానం సంపాదించారు. గుర్తుల కేటాయింపుకూడా పూర్తయింది. డిసెంబరు 1వ తేదీన 74 లక్షల వోటర్లు అభ్యర్ధుల భవితవ్యం తేల్చాల్సి ఉంది. ప్రచార హోరు ఎంతగా ఉన్నా, అభ్యర్ధులు పార్టీలు ఎంత హంగామా చేసి సొమ్ము నీళ్ళలా ఖర్చుచేసినా వోటింగ్‌ ‌శాతం పైనే ఫలితాలు ఆధార పడిఉంటాయి. 2004 నుంచీ అన్ని ఎన్నికల సరళి గమనిస్తే.. ఏ ఎన్నికలోనూ గ్రేటర్‌ ‌పరిధిలో 52 శాతం మించి పోలింగ్‌ ‌జరగలేదు.

ఒక్క సారి హైదరాబాద్‌ ‌మునిసిపల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికలు పునరావలోకనం చేసుకుంటే, అయిదుగురు కాంగ్రెస్‌, ఆరుగురు ఎం.ఐ,ఎం. ఒక టిడిపి ఒక టి.ఆర్‌.ఎస్‌ ‌వ్యక్తులు మేయర్‌ ‌పీఠం అలంకరించారు. 2002లో ఒక పర్యాయం మేయర్‌ ‌కు ప్రత్యక్ష ఎన్నిక జరగగా టిడిపికి చెందిన తీగల కృష్ణారెడ్డి ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు ముగ్గురు మహిళలు.. రాణి కుముదినీ దేవి, సరోజినీ పుల్లారెడ్డి, బండకార్తీక రెడ్డి మేయర్‌ ‌స్థానాన్ని అలంకరించారు. 2002 ఎన్నికల్లో మొత్తం 99 డివిజన్లకుగాను 43 స్థానాల్లో ఎం.ఐ.ఎం 34 స్థానాల్లో ఢంకామోగించి పెద్ద పార్టీగా ఆవిర్భవించగా, పొత్తు పెట్టుకున్న టిడిపి 22, బిజెపి 18 దక్కించుకున్నాయి. నాటి ప్రతిపక్షం కాంగ్రెస్‌ 19‌స్థానాలలో నెగ్గగా.. మిగిలిన వారు ఆరు స్థానలతో సరిపెట్టుకున్నారు. అప్పుడు 11 లక్షల మంది మాత్రమే వోటుహక్కు వినియోగించుకున్నారు.

తదనంతరం 150 డివిజన్లకు విస్తరించి 2009, 2016 లో జరిగిన జి హెచ్‌ ఎం ‌సి ఎన్నికల్లో 42 శాతం, 45 శాతం మాత్రమే వోటింగ్‌ ‌లో పాల్గొన్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ 52, ‌టిడిపి 45, ఎం.ఐ.ఎం. 43, బిజెపి 4, ఇతరులు 5 డివిజన్లను వశం చేసుకున్నారు. 2016 ఎన్నికల్లో టి.ఆర్‌.ఎస్‌.99 ‌డివిజన్లలో విజయఢంకా మోగించగా, ఎం.ఐ.ఎం. 44, బిజెపి 4, కాంగ్రెస్‌ 2, ‌టిడిపి 1 స్థానానికి పరిమితమయ్యాయి. అదేమాదిరి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జి.హెచ్‌.ఎం.‌సి. పరిధిలో 52 శాతం, 2018 ఎన్నికల్లో 50 శాతం మాత్రమే వోటర్లు ఉత్సాహం ప్రదర్శించారు. ఏతావాతా తేలింది ఏమిటంటే.. స్వప్రయోజనాలున్న పార్టీల కార్యకర్తలు మినహా%••% నగరాన్ని ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా, ఎవరికి ఎంత మొర పెట్టుకున్నా నిష్ప్రయోజనమని నిర్ణయించుకుని సాధారణ ప్రజలు ఎన్నికల పట్ల ఆసక్తి కనబరచడంలేదు. ఎన్నికలొస్తేగానీ ఏ రాజకీయ పార్టీ నాయకులకైనా ప్రజల బాగోగులు, సదుపాయాలుగుర్తురావు. ఫొటొ ప్రచారానికి తప్ప ఎన్ని సమస్యలున్నా ఏనాడూ కార్పొరేటర్లు కూడా డివిజన్లలో కాలు బయటపెట్టిన పాపాన పోరు. తమ పార్టీ నాయకుల భజనలోనే నిరంతరం మునిగిపోతూ వారి చల్లని చూపులను సొమ్ము చేసుకుంటారు. ఆర్జన మినహా వారికే ఆశయమూ లేదు. ఎవ్వరూ మినహాయింపుకాదు. ఎన్నికలొచ్చినప్పుడే కులసంఘాలు కూడా ఒళ్ళు విరుచుకుని బయటకొస్తాయి.

నగరాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలను ఒక్క సారి దివిటీ పెట్టి చూస్తే…అధ్వాన్నంగా రోడ్లు, పారిశుధ్యం, మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల, రోడ్లు, నాలాలు, పేవ్‌మెంట్ల ఆక్రమణ, దవాఖానాలలో పేదలకందని వైద్యం, నిమ్స్ , ‌గాంధి, ఉస్మానియా ప్రభుత్వ దవాఖానా లలో దుర్భర వాతావరణం, రోగులను పట్టి పీడించే హాస్పిటల్‌ ‌సిబ్బంది, విచ్చలవిడిగా బహిరంగ మద్యపాన పర్మిట్‌ ‌రూములు, మీటర్లు లేని ఆటోలు, నీడలేని సిటీ బస్‌ ‌షెల్టర్లు, ఎప్పుడు తెరుచుకుంటాయో తెలీని రేషన్‌ ‌దుకాణాలు.. వీటికితోడు గత మార్చి నుంచీ ఆగిపోయిన ఎం.ఎం.టి.ఎస్‌. ‌ప్రజారవాణా…ఒకటా రెండా.. ఎన్ని ఈతిబాధలు… నాలుగున్నరేళ్ళుగా ఏనాడూ ఎమ్మెల్యేలుకాని, కార్పొరేషన్‌ ‌పాలకవర్గం కానీ ఒక్కరూ తొంగి చూడలేదు. మార్చిలో అర్ధంతరంగా కోవిడ్‌ ‌లాక్‌ ‌డౌన్‌ ‌తో ప్రజలు నరకం చవిచూశారు. ఒక్క కార్పొరేటర్‌, ఎమ్మెల్యే, మంత్రి. కలికం వేసి చూసినా కనబడ లేదు.

వీటికితోడు తాజాగా భారీ వర్షాలతో సంభవించిన వరదలవల్ల నగరజీవనం అతలాకుతలమైంది. వందలకొద్దీ పక్కా కాలనీలు, లోతట్టు ప్రాంతాల ఇల్లు నీట మునిగి ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. సిద్ధమైన ఎన్నికల పుణ్యమా అని యంత్రాంగంలో కొంత కదలిక వచ్చింది తప్ప నష్ట నివారణకు తీసుకున్న పకడ్బండీ చర్యలు లేవు. అభ్యర్ధులందరూ తమ పార్టీ నాయకత్వం మాటపై ఆధార పడ్దారు మినహా ఒక్కరూ తామేమి చేసేదీ నోరు విప్పడం లేదు. ఒక్కొక్క కార్పొరేటర్‌ ఇన్నేళ్ళుగా సంపాదించిందెంతో తెలుసుకున్న జనం ఈ సారి దూరంగా ఉంటున్నారు.

Leave a Reply