Take a fresh look at your lifestyle.

ఎన్నికలు త్వరగా వొచ్చాయి..

జిహెచ్‌ఎం‌సి ఎన్నికల్లో ఈసారి పోటీచేయడం లేదని జనసేన అధినేత పవన్‌ ‌కళ్యాణ్‌ ‌శుక్రవారం ప్రకటించారు. భారతీయ జనతాపార్టీ నాయకులతో చర్చలు జరిపిన అనంతరం ఆయన ఆ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశంలో ఈ మాట వెల్లడించారు. కాని, ఒక రోజు ముందు తమ పార్టీ కూడా జీహెచ్‌ఎం‌సి ఎన్నికల్లో పాల్గొంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ నాయకులు కార్యకర్తల నుండి తీవ్రంగా తనపై వొత్తిడి వొస్తున్నందున తానీ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ట్విటర్‌ ‌ద్వారా వెల్లడించారు కూడా. ఆ మేరకు జనసైనికులంతా సిద్ధం కావాలని కూడా ప్రకటించారు. తమ అధినాయకుడి నుండి గ్రీన్‌ ‌సిగ్నల్‌ ‌రావడంతో జనసేనికులు సమరోత్సహంగా ఎన్నికల బరిలో దిగడానికి సిద్ధపడుతున్న తరుణంలో అధినేత నుండి పిడుగులాంటి వార్త విని నిశ్చేష్టులైనారు. ఇంత పెద్ద నిర్ణయాన్ని కేవలం ఒక్క రోజులోనే తమ అధినాయకుడు తలకిందులు చేయడంపై జన సైనికులు ఆందోళన చెందుతున్నారు. అయితే తాము ఎన్నికల్లో భాగస్వాములు కాకపోవడానికి ఆయన చెప్పిన కారణం కూడా విచిత్రంగానే ఉంది. హడావిడిగా ఎన్నికల నోటిఫికేషన్‌ ‌జారీ కావడం ఒక కారణంగా ఆయన చెప్పుకొచ్చిన తీరు గతంలో జరిగిన ఎన్నికల సందర్భంగా పవన్‌ ‌కళ్యాణ్‌ ‌చేసిన ప్రకటనలే గుర్తుకు వొస్తున్నాయి. 2019లో ఏపిలో జరిగిన ఎన్నికల్లో రెండు చోట్ల నిలబడి ఓడిపోయిన పవన్‌ అం‌తకు ముందు ఏపి, తెలంగాణలో జరిగిన ఎన్నిక)ప్పుడు కూడా ఈలాంటి ప్రకటనే చేశారు.

pawan kalyan ghmc

పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆనాడు ఎన్నికల్లో పాల్గొనడానికి ఎంత వొత్తిడి తీసుకొచ్చినా ఆనాడు కూడా ఎన్నికలు తాము ఊహించిన దానికన్నా ముందు వొచ్చాయని, అభ్యర్థులను ఎంపిక చేయడానికి తమకు వ్యవధి సరిపోనందున పోటీలో పాల్గొనడం లేదని ఆనాడు స్పష్టంచేసిన పవన్‌, ఇప్పుడు జీహెచ్‌ఎం‌సి నోటిఫికేషన్‌ ‌కూడా తన ఊహకు ముందుగానే వొచ్చిందన్నట్లు చెప్పుకొచ్చారు. కాని, వాస్తవంగా ఆయన బిజెపితో మంతనాలు ఒక కొలిక్కి రాకపోవడంవల్లే అభ్యర్థులను ప్రకటించడంలో కావాలనే జాప్యం చేసినట్లు బిజెపి, జనసేన శుక్రవారం సంయుక్తంగా చేసిన ప్రకటన ద్వారా స్పష్టమవుతున్నది. తన నిర్ణయం వల్ల జనసేనకులు బాధ పడాల్సిన అవసరం లేదని, పార్టీ దీర్ఘ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తానీ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ‘ రాజకీయనాయకులు తమ అవసరాలు.. పరిస్థితులను బట్టి మాట మారుస్తుంటారని’ ఏపిలో జరిగిన ఓ కార్యకర్తల సమావేశంలో ఆయన అన్నమాటలు ఈ సందర్భంగా గుర్తుకు వొస్తున్నాయి. అధికారం తాలూకు అంతిమ లక్ష్యం వేలకోట్లు మోసుకోవడంకాదు…ప్రజలు కోల్పోయిన వాటిని అందజేయడం కావాలని.. జనసేనపార్టీ అదే ఆశిస్తుందన్న మాటలు మననం చేసుకుంటే తెలంగాణ ప్రజలకు ఏం ఒనగూర్చాలనుకుని బిజెపికి మద్ధతిస్తున్నదన్న చర్చజరుగుతోంది.

ప్రజలకోసం ఎవరినైనా, ఏలాంటివారినైనా ప్రశ్నిస్తానని చెప్పుకునే పవన్‌ ‌కళ్యాణ్‌ ఏపి ప్రజల సమస్యలను మధ్యలోనే వొదిలేశాడన్న ఆరోపణ మోస్తున్న విషయం తెలియంది కాదు. అక్కడ ప్రధానాంశంగా ఉన్న ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకుని హల్‌చల్‌ ‌చేసిన పవన్‌ ‌తన పోరాటాన్ని ఎందుకు పక్కకు పెట్టారంటూ అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జీహెచ్‌ఎం‌సిపై ఈ సారి ఎట్టి పరిస్థితిలో కాషాయ జెండాను ఎగురవేసేందుకు అమితోత్సహంతో ఉన్న బిజెపి కూడా ఈ ఎన్నికల్లో మరే పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశంలేదని, ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించింది. ఎన్నికల నోటిఫికేషన్‌ ‌వెలువడిన వెంటనే తాము ఏ పార్టీతో పొత్తుపెట్టుకునేది లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. అయితే పొత్తు కాకుండా జనసేన మద్ధతు తీసుకుంటున్న బిజెపి రాష్ట్ర రాజధానిలో సీమాంద్ర వోట్లతో పాటు, యువతలో పవన్‌కున్న ఇమేజ్‌ని వోట్ల రూపంలో మార్చుకునే ఎత్తుగడలో భాగమే ఈ సయోధ్యకు కారణంగా భావిస్తున్నారు. అయితే పవన్‌ ‌ప్రచారం ఈ ఎన్నికల్లో బిజెపికి ఎంతవరకు ఉపయోగపడుతుందో వేచి చూడాల్సిందే మరి.
ప్రజాతంత్ర ఇంటర్‌నెట్‌ ‌డెస్క్

Leave a Reply