Take a fresh look at your lifestyle.

ప్రచారం ఫుల్‌ … ‌వోటింగ్‌ ‌డల్‌

“విద్యావంతులు అధికంగా ఉండే రాజధాని నగర వాసులెవరికీ తమ వోటుహక్కును వినియోగించుకోవాలన్న ధ్యాసే లేదన్నది స్పష్టమయింది. తమ వోటు హక్కును సద్వినియోగం చేసుకోవాలంటూ అనేక ప్రకటనలు, విఐపిలతో అనేక విజ్ఞప్తులను చేయించినా విద్యాధికులెవరూ వోటింగ్‌ ‌కేంద్రాలకు రాకపోడం విచారకరం. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలే నాయకుడిని ఎన్నుకునే విధానాన్ని రాజ్యాంగం మనకు కల్పించింది. ప్రజలకు, సమాజానికి సేవ చేస్తారని నమ్మకమున్న వ్యక్తులను వోటు ద్వారా ఎన్నుకోవాల్సి ఉండగా చాలామంది ఇంటి నుండి బయటికి రావడానికే ఇష్టపడడం లేదన్నది దీని ద్వారా తెలుస్తున్నది.”

పోటాపోటీగా జరిగిన గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ‌మున్సిల్‌ ‌కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచార సరళి చూసిన వారికెవరికైనా ఈసారి నగర ప్రజలు పెద్దఎత్తున వోటింగ్‌కు తరలి వొస్తారన్న నమ్మకం ఏర్పడింది. గతంలో జరిగిన అనేక ఎన్నిక)ను పరిశీలించినప్పుడు చాలా తక్కువ సంఖ్యలో వోటర్లు తమ వోటు వినియోగొంచుకోవడం జరుగుతూ వొస్తోంది. అయితే ఈసారి మేయర్‌ ‌స్థానాన్ని దక్కించుకోవడంతో పాటుగా, తమ ఉనికిని చాటుకునేందుకు దాదాపు అన్ని పార్టీలు విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహించాయి. ఇంచు మించు అన్ని రాజకీయ పార్టీలు తమ అధినేతలను ప్రచారంలో దింపాయి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతాపార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోటీపడ్డాయి కూడా. రాజధాని నగరంలో ఎక్కడ చూసినా ఈ రెండు పార్టీల జండాలు, కటౌట్లు, ప్రచార రథాలు దర్శనమిచ్చాయి. పెద్దపెద్ద ర్యాలీలు, బహిరంగ సభలను నిర్వహించి, విమర్శలు, ప్రతి విమర్శలు, తీవ్రతర ఆరోపణలు గుమ్మరించుకున్నాయి. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీచేసిన బిజెపి ఈ ఎన్నికల్లో మేయర్‌ ‌సీటు తమదేనంటూ ధీమాను వ్యక్తం చేస్తూ ఒంటరిగానే బరిలోకి దిగింది.

ఆ పార్టీ అధికార పార్టీకి ఊపిరి మెసలకుండా చేస్తూ చేపట్టిన ప్రచార సరళికి నిజంగానే నగర వోటర్లంతా ఈసారి కదలి వొస్తారన్న భావన కలిగింది. కాని, మంగళవారం నాటి పోలింగ్‌ ‌సరళి పూర్తిగా నిరాశ పర్చింది. విద్యావంతులు అధికంగా ఉండే రాజధాని నగర వాసులెవరికీ తమ వోటుహక్కును వినియోగించుకోవాలన్న ధ్యాసే లేదన్నది స్పష్టమయింది. తమ వోటు హక్కును సద్వినియోగం చేసుకోవాలంటూ అనేక ప్రకటనలు, విఐపిలతో అనేక విజ్ఞప్తులను చేయించినా విద్యాధికులెవరూ వోటింగ్‌ ‌కేంద్రాలకు రాకపోడం విచారకరం. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ప్రజలే నాయకుడిని ఎన్నుకునే విధానాన్ని రాజ్యాంగం మనకు కల్పించింది. ప్రజలకు, సమాజానికి సేవ చేస్తారని నమ్మకమున్న వ్యక్తులను వోటు ద్వారా ఎన్నుకోవాల్సి ఉండగా చాలామంది ఇంటి నుండి బయటికి రావడానికే ఇష్టపడడం లేదన్నది దీని ద్వారా తెలుస్తున్నది. ఐటి ఇలాఖాలుగా ఉన్న కొండాపూర్‌, ‌రాజేంద్రనగర్‌, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో తక్కువ శాతం ఓట్లు పో)వడమే ఇందుకు నిదర్శనం. దీనివల్ల వోటింగ్‌ ‌సరళిని మేనేజ్‌ ‌చేసుకునే రాజకీయ పార్టీ అభ్యర్థే నాయకుడయ్యే అవకాశం ఏర్పడుతున్నది. ఈ ఎన్నికల్లో అదే ప్రస్ఫుటిస్తోంది. మంగళవారం ఉదయం వోటింగ్‌ ‌ప్రారంభమైనప్పటి నుండి నగరంలో వివిధ డివిజన్‌ల పరిధిలో డబ్బులు పంచుతూ గందరగోళం సృష్టించిన సంఘటనలనేకం వెలుగుచూసాయి.

మీరు డబ్బు పంచారంటే మీరే నంటూ ఈ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పడుతున్న రెండుపార్టీల కార్యకర్తలమధ్య ఘర్షణలు జరిగాయి. వోటుకు వెయ్యి నుంచి పదివేల రూపాయలవరకు ఇవ్వడానికైనా అభ్యర్థులు సిద్ధపడ్డారంటే ఏవిధంగానైనా వోటును కొనుగోలు చేసుకోగలమన్న ధీమా అభ్యర్థుల్లో ఉండడమే. అలాంటి అభ్యర్థి గెలిచిన తర్వాత అక్రమ వసూళ్ళకు పాల్పడడనుకోలేము. ఈ విషయం ప్రజల అవగాహనలో లేదని అనుకోవలేము. కాని, విద్యాధికులు వోటింగ్‌కు దూరం ఉండటమే డబ్బుల పంపిణీతో నెగ్గగలమన్న ధీమా విచ్చలవిడిగా వ్యయం చేయగలిగే అభ్యర్థుల్లో ఉంది. అప్పుడు తమ ప్రాంతం లేదా డివిజన్‌ అభివృద్ధి గురించి అడిగే అధికారం, నిలదీసే అధికారాన్ని వోటర్లు కోల్పోయే అవకాశముంది. కనీసం నిలబడిన అభ్యర్థులెవరూ నచ్చని పరిస్థితిలో అ అభిప్రాయాన్ని కూడా తెలిపే విధంగా ప్రభుత్వం నోటాను కూడా ఏర్పాటు చేసింది. దీన్ని వాడుకోవడానికైనా పోలింగ్‌ ‌కేంద్రాలకు తరలి రాకపోవడం దురదృష్టకరం.

ఇప్పటికే అనేక వోట్లు గల్లంతవుతున్నాయి. ఎన్నికల కమిషన్‌ ‌పరిశీలన లోపమో, అధికారుల నిర్లక్ష్యం కారణంగానో ప్రతీ ఎన్నికల్లో వోట్ల గల్లంతు అంశం వెలుగుచూస్తూనే ఉంది. రెండేళ్ళ కింద జరిగిన శాసనసభ ఎన్నికల్లో వోటేసిన వ్యక్తుల వోట్లుకూడా కనిపించక పోవడం విచిత్ర పరిణామం. తాజాగా జరిగిన జిహెచ్‌ఎం‌సి ఎన్నికల్లో పలు డివిజన్‌లలో వందల సంఖ్యలో వోట్లు గల్లంతు కావడం గమనార్హం. జియాగూడలో ఒక పోలింగ్‌ ‌బూత్‌లో 914 వోట్లుంటే 657 వోట్లు గల్లంతు అయినాయంటే ఏమేరకు వోట్లు మాయమయ్యాయన్నది అర్థమవుతున్నది. ప్రతీ ఎన్నికల్లో ఇలాంటి సంఘటనలు ఎదురవుతున్నా ఎన్నికల కమిషన్‌ ఈ ‌విషయంలో తీసుకుంటున్న శ్రద్ధ ఏమీ కనిపించడంలేదు. ప్రతీ ఎన్నికల్లో అనుకోవడం..వొదిలేయడమన్నది సహజమైపోయింది. ఇప్పటికైనా ప్రజలు తమ బాధ్యతగా, హక్కుగా వోటు హక్కును సద్వినియోగంచేసుకుని తమ నాయకుడిని ఎన్నుకునే అంశంలో భాగస్వాములవ్వాల్సిన అవసరాన్ని గుర్తించాలి.

manduva ravindhar roa
మండువ రవీందర్‌ ‌రావు

Leave a Reply