యూయన్ ఎన్విరాన్‌మెంటల్ ప్రోగ్రాం (ఐరాస పర్యావరణ కార్యక్రమం) కేంద్ర కార్యాలయం, కెన్యాలో ఇటీవల జరిగిన ఐరాస పర్యావరణ అసెంబ్లీ సమావేశంలో ప్లాస్టిక్ కాలుష్య దుష్ప్రభావాలను గుర్తించి ప్రపంచ మానవాళి తగు చర్యలు తీసుకుంటూ ప్లాస్టిక్ రహిత సమాజా నిర్మాణంలో చురుకైన బాధ్యతను తీసుకోవాలని కోరారు. జీవ అవిచ్ఛిన్న విషపూరిత ప్లాస్టిక్ వాడకాన్ని నేరసమానంగా భావిస్తూ చట్టబద్దత కలిగించాలని సూచించారు. పర్యావరణ సంబంధ ఖనిజాలు, లోహాల నియంత్రణ చర్యలు తీసుకోవాలని, సుస్థిరాభివృద్ధి దిశగా ఉత్పత్తి, వినియోగ రంగాలు నవ్య నడకలు జరపాలని, వీటికి కావలసిన మౌళిక వనరులు కల్పించడం అనివార్యమని తెలిపారు. జీవవైవిధ్య పర్యావరణ ఆరోగ్య పరిరక్షణకు సహజ ప్రకృతి-ఆధార సమాధానాలు వెతకాలని నిర్ణయించారు. కరోనా అనంతర రికవరీలో భాగంగా పర్యావరణ హిత సుస్థిర చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. 2015 వాతావరణ మార్పుల ప్యారిస్ ఒప్పందం ఆధారంగా ఐరాస సభ్యదేశాలు విధిగా ప్లాస్టిక్ కాలుష్య నిర్మూలనకు ప్రతినబూనాలని విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ కాలుష్య అంతానికి చేపట్టవలసిన కార్యాచరణను చర్చించిన సమావేశంలో 175 ఐరాస సభ్యదేశాలు, 3,400 సభ్యులు, 1,500 మంది ఆన్‌లైన్ హాజరు, 79 మంత్రులు, 17 హైలెవల్ అధికారులు పాల్గొన్నారు. 01 మార్చి 2024లో మరోసారి సమావేశం కావాలని, అంత వరకు ప్రపంచ దేశాలు తీసుకోవలసిన చర్యలను సూచించారు.
భూమాతకు చేటు చేసే ప్లాస్టిక్ కాలుష్య విష ప్రభావంతో శిలావరణం, జలావరణం, జీవావరణం, వాతావరణం ప్రభావితం కావడం పెను ప్రమాదాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. ప్లాక్టిక్ భూతాన్ని కట్టడి చేయటానికి అంతర్జాతీయ సమన్వయం, సహకారం కనీస అవసరమని తెలిపారు. జీవవైవిధ్యం, రసాయనాలు, వ్యర్థాలు, ప్లాస్టిక్ లాంటివి దగ్గరి సంబంధాన్ని కలిగి ఉంటాయని మరువరాదు. ఆరోగ్యకరమైన వాతావరణ వ్యవస్థ స్థాపనలో హరిత క్షేత్రాలు, వ్యర్థ రసాయనాల నియంత్రణ, నత్రజని నియంత్రణ, జీవవైవిధ్యం సంక్లిష్ట సవాళ్ళు ఇమిడి ఉంటాయి. ప్లాస్టిక్స్ వాడకంతో వ్యర్థాల తగ్గుదల, శక్తి ఆదా, వాహనాల బరువు తగ్గడం, కార్బన్ ఉద్గారాల తగ్గుదల, నాణ్యమైన ఉత్పత్తులు, తక్కువ ధర, నీటి నిరోధకత, లాంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయని మరువరాదు.
ప్లాస్టిక్ కాలుష్య విషవలయంలో భూగోళం :
విచక్షణారహితంగా, విచ్చలవిడిగా ప్లాస్టిక్ తయారీ, వాడకం, పారవేయడం అనే ప్రమాదకర అంశాలను మరోసారి పునర్‌సమీక్షించాల్సిన సమయం ఆసన్నమైంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులు పర్యావరణ ప్రతికూల కారకులుగా గత రెండు దశాబ్దాలుగా మానవాళిని తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి ఒక మిలియన్ ప్లాస్టిక్ బాటిళ్లు అమ్మబడుతూ, ఏడాదికి 5 ట్రిలియన్ ప్లాస్టిక్ సంచులు వినియోగించబడుతున్నాయి. ప్లాస్టిక్ ఉత్పత్తుల్లో 50 శాతం ఒకేసారి వాడి పారవేయడం అత్యంత ప్రమాదాలకు నెలవు అవుతున్నది. ప్లాస్టిక్, మైక్రోప్లాస్టిక్‌లు భూగోళంపై సర్వవ్యాప్తం అవుతూ పర్యావరణంలో శిలావరణం, జీవావరణం, జలావరణంతో పాటు రానున్న రోజుల్లో ‘ప్లాస్టికావరణం, ప్లాస్టిస్పియర్’ ఓ భాగంగా ఏర్పడే ప్రమాదం ఏర్పడింది. 1950-70ల మధ్య తక్కువ పరిమాణంలో ప్లాస్టిక్ ఉత్పత్తి, వాడకం ఉండడంతో కొంత వరకు నియంత్రించే స్థాయిలోనే ఉండేది. 2000-10 మధ్య అపరిమితంగా, విచక్షణారహితంగా ప్లాస్టిక్ వాడడానికి ప్రతి ఒక్కడు బానిసలా అలవాటు పడడంతో ప్రమాదం అదుపుతప్పడం ప్రారంభమైంది. నేడు విశ్వ జనాభా బరువుకు సమానంగా ఏడాదిలో దాదాపు 300 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు విసర్జించబడుతున్నాయి. 2050 నాటికి 34 బిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి కానుందని అంచనా. దాదాపు 98 శాతం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తి శిలాజ ఇంధనాలతో తయారవుతున్న కారణంగా కార్బన్ ఉద్గారాలు కూడా పెరగడం తప్పనిసరి అవుతున్నది. వ్యర్థ ప్లాస్టిక్‌లో 10 శాతం మాత్రమే రీసైకిల్ అవుతున్నది. ఫుడ్ వ్రాఫర్స్, సిగరెట్ ఫిల్టర్స్, ప్లాస్టిక్ బాటిల్స్, బాటిల్ క్యాప్స్, గ్రాసరీ బ్యాగ్స్, ప్లాస్టిక్ స్ట్రాస్, ఫుడ్ కంటేనర్స్, పెన్స్, ఫర్నీచర్స్, టూత్ బ్రష్‌లు లాంటివి పర్యావరణ విచ్ఛిన్నకారులుగా ఆధునిక మానవుడికి సవాలు విసురుతున్నాయి.
ప్లాస్టిక్ కాలుష్య కారకాలన్నీ సముద్రాలు, నదులు, సరస్సులు, నీటి వనరులు, మురికి కాలువలు, భూగర్భం చేరి దాదాపు నాలుగు శతాబ్దాల పాటు జీవవిచ్ఛిన్నం కాకుండా మానవాళి ఆరోగ్యానికి అవరోధంగా, జలచరాలకు ప్రాణాంతకంగా మారడం అత్యంత ప్రమాదకరమైన కాలుష్య అంశంగా చెప్పబడింది. విశ్వవ్యాప్త సాగర గర్భాల్లో దాదాపు 200 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ భూతం తిష్ట వేసిందని అంచనా వేస్తున్నారు. 2016లో ఏడాదికి దాదాపు 14 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వాతావరణ వ్యవస్థకు చేరుతుండగా, 2040 నాటికి సాలీన 37 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థం మానవాళి మెడకు చుట్టుకోనుంది. ప్రతి ఏట ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న 1,000 నదులలో సాలీన 2.7 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ సముద్రానికి చేరుతున్నది. నేల, నీరు, గాలి కాలుష్యానికి ప్రధాన కారణంగా నిలుస్తున్న జీవ అవిచ్ఛిన్నం ప్లాస్టిక్ వ్యర్థాలు విషాన్ని గుప్పించే కాలుష్య కారకాలుగా నిలుస్తూ జీవవైవిధ్యానికి, ప్రజారోగ్యానికి, జలచరాల మనుగడకు సవాలుగా నిలుస్తున్నాయి. ప్లాస్టిక్ అవశేషాలు కలిగిన సముద్ర ఆహారాన్ని తీసుకొని ప్రజలు అనారోగ్యం పాలౌతున్నారు. ప్లాస్టిక్ ప్యాకెట్లలోని ఆహార పదార్థాలు తినడంతో మానవ శరీరంలోకి ప్లాస్టిక్ విషం చేరుతోంది. ప్లాస్టిక్ బాటిల్ పానీయాలు సేవించడం ద్వారా మైక్రోప్లాస్టిక్స్ శరీరంలోకి చేరుతున్నది. మానవాళి ధరిస్తున్న వస్త్రాల శోషణ ధర్మం ద్వారా ప్లాస్టిక్ శరీరంలోకి ప్రవేశిస్తున్నది. వ్యర్ధాలను కాల్చి వేయడంతో ప్లాస్టిక్ అవశేషాలు ఊపిరితిత్తులను చేరుతున్నాయి. ఐరాస తీర్మానానికి ఆమోదం తెలుపుతూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, జీవవిచ్ఛిన్న ప్లాస్టిక్ వాడకాన్ని ప్రోత్సహించడం, ప్రమాదకర ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించడం లాంటి చర్యలు మాత్రమే ప్లాస్టిక్ కాలుష్యం నుంచి ప్రజలను, జీవకోటిని, వాతావరణ వ్యవస్థను, ప్రకృతి సహజత్వాన్ని కాపాడుతాయని నమ్ముదాం. గరళ ప్లాస్టిక్ లేని ప్రశాంత ఆరోగ్యకర ప్రపంచాన్ని నిర్మించుకుందాం.