- ప్రభుత్వ వినియోగం ద్వారా వృద్ధి రికవరీకి అవకాశం
- దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం ప్రారంభం
- లోక్సభలో ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టిన నిర్మలా సీతారామన్
కొరోనా సంక్షోభం, వాక్సినేషన్, మూడు వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనల మధ్య ఈ దశాబ్దంలో తొలి పార్లమెంట్ బ్జడెట్ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభ మయ్యాయి. సమావేశాల తొలిరోజు కోవిడ్ సంబంధిత నిబంధనలతో కొలువు దీరిన ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ప్రసంగించారు. అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టారు. మెగా కొరోనా వ్యాక్సినేషన్ పక్రియతో శరవేగంగా ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందనుందని ఆర్థిక సర్వే అభిప్రాయ పడింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రియల్ జీడీపీ వృద్ధి రేటు 11 శాతమని ఆర్థిక సర్వే వెల్లడించింది. నామినల్ జీడీపీ వృద్ధి రేటు 15.4 శాతమని తెలిపింది. ప్రభుత్వ వినియోగం ద్వారా వృద్ధి రికవరీ అయ్యే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
కంబైన్డ్ ఫిస్కల్ డెఫిసిట్ 2020-21 ఆర్థిక సంవత్సరంలో లక్ష్యానికి మించిపోతుందని పేర్కొంది. ఈ ఆర్థిక సర్వే నివేదికను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శుక్రవారం పార్లమెంటుకు సమర్పించారు. అనంతరం లోక్సభ సోమవారానికి వాయిదా పడింది. కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం ప్రారంభమైనందువల్ల ఈ ఆర్థిక సర్వే నివేదికకు ప్రాధాన్యం ఉంది. ఈ సర్వేలో వెల్లడైన అంశాల ఆధారంగానే ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బ్జడెట్ను రూపొందిస్తారు. ప్రభుత్వం ప్రకటించిన అంచనాల ప్రకారం భారత దేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.7 శాతం క్షీణించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం వ్యయ ప్రణాళికను కొనసాగిస్తుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.
ఓ ప్రైవేట్ సర్వే వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ ఏడాది మార్చినాటికి ద్రవ్య లోటు జీడీపీలో 7.25 శాతం ఉండవచ్చు, దీనిని 3.4 శాతానికి పరిమితం చేయాలని అంతకుముందు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ప్రభుత్వం ముందు ఉన్న ప్రధాన సవాలు కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోయినవారికి ఉపాధి అవకాశాలను సృష్టించడ మేనని ఆర్థికవేత్తలు చెప్తున్నారు. ప్రస్తుత ఆర్థిక వృద్ధి రేటు రుణాత్మకంగా ఉంది. దీనికి కరోనా లాక్డౌన్ కారణమని, దీని వల్ల ఒక్క ఇండియానే కాకుండా అనేక దేశాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయని ఆమె పేర్కొన్నారు. ఇక ఆర్థిక సర్వే 2020-21 ప్రకారం.. 2021 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి -7.7 శాతంగా ఉందని, ఇక 2022 ఆర్థిక సంవత్సరంలో 11.5 శాతంగా ఉండనుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ లెక్కల్ని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఆధారంగా తెలిపినట్లు ఆమె పేర్కొన్నారు. పార్లమెంట్ బ్జడెట్ సమావేశాలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి.