ఎన్నికలు అయిపోయాయి. బాదుడు ప్రారంభమైంది. వంటగ్యాస్ ధర సిలిండర్ కు 50 రూపాయిలను కేంద్రం పెంచడం నిస్సందేహంగా మధ్యతరగతి, సామాన్య పౌరుల నడ్డి విరవడమే. కొరోనా కోరల్లో చిక్కి ఆర్థికంగా చితికి పోయింది ఈ వర్గాలే. ఉద్యోగాలు పోయికొందరు, ఇళ్ళనుంచి కదల లేక స్వచ్చందంగా ఉద్యోగాలు మానుకున్నవారు మరికొందరు. ఇలాంటి వారు ఇప్పుడిప్పుడే చాలీచాలని ఆదాయాలతో బతుకులు వెళ్ళదీస్తున్నారు. ఇలాంటి సమయంలో కేంద్రం వంటగ్యాస్ ధర పెంచడం ఈ వర్గాలపై దాడి చేయడమే. కళ్ళు మంటలెక్కించే కట్టెపోయ్యిలొద్దు, గ్యాస్ పొయ్యిలను వాడమని ప్రధానమంత్రి నరేంద్రమోడీ మన దేశంలో గ్రామీణ ప్రాంతాల మహిళలకు ఓ వరంలా గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేశారు. దానికి ఆయిల్ కంపెనీ వారు చాలా పెద్ద ఎత్తున ప్రచారాన్ని కూడా ఇచ్చారు. పెట్రోలు బంకుల్లో పెద్ద పెద్ద హోర్డింగ్ లు వేలాడదీశారు. గ్యాస్ పొయ్యి వల్ల లాభాల గురించి పాఠాలు చెప్పారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా ఈ అంశాన్ని రెండు సార్లు ప్రధానంగా ప్రస్తావించారు.
కట్టె పొయ్యిలతో తన తల్లి తన బాల్యంలో పడిన ఇబ్బందులను వివరించారు. వాటిని కళ్ళారా చూడటం వల్లే తాను స్పందించి గ్రామీణ మహిళలకు గ్యాస్ సిలిండర్లు, కనెక్షన్ల పంపిణీ పథకాన్ని ప్రారంభించినట్టు చెప్పారు.అంతా బాగానే ఉంది. దేశానికి ఇప్పుడు గ్యాస్ ధర పెంచనిదే ఆర్థికంగా కోలుకోలేని పరిస్థితి ఏమీ లేదు. ఈ త్రైమాసికంలో వస్తు సేవల పన్ను (జిఎస్ టి) వసూళ్ళు లక్ష కోట్లు దాటినట్టు ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది. కోవిడ్ సృష్టించిన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకుంటోందని రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలు యథావిధిగా సాగుతున్నాయి.ఈ తరుణంలో గ్యాస్ ధర పెంచాల్సిన అవసరం ఏమొచ్చిందో ప్రభుత్వమే చెప్పాలి. ప్రస్తుతం దిల్లీలో 594 రూపాయిలు ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు 644 రూపాయిలకు పెరిగింది. ఈ సిలిండర్లపై రాష్ట్రాల వారీగా ధరల్లో తేడా ఉంది. అందువల్ల ఒకే విధంగా ఉంటాయనుకుంటే పొరపడినట్టే. పెంచిన గ్యాస్ ధర అమలులోకి వొచ్చింది. అంతర్జాతీయంగా చమురు ధర పెరిగినప్పుడల్లా పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్ కు 50 పైసల నుంచి రూపాయి, రెండు రూపాయిల వరకూ వంతున పెంచుతూనే ఉన్నారు.ఇప్పుడు గ్యాస్ ధర పెంపుదల భారంతో మధ్యతరగతి వర్గాల పై అదనపు భారం పడనుంది. కరోనా కాలంలో గ్యాస్ ధరలు పెంచలేదు కనుక, ఇప్పుడు పెంచాల్సి వచ్చిందన్న వివరణ సమంజసంగా లేదు.పెంచాలనే రూలు ఏమైనా ఉందా.. పెంచకపోతే ప్రభుత్వానికి నష్టం వస్తుందా.. అనే ప్రశ్నలు వినియోగదారుల నుంచి వినవస్తున్నాయి. కొరోనా లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం ప్రకటించిన ఇరవై లక్షల కోట్ల రూపాయిల పరిహారం సామాన్యులకేమీ దక్కలేదు. అది చిన్న, మధ్యతరహా పారిశ్రామిక వేత్తలకూ, పెద్ద పారిశ్రామిక వేత్తలకు మాత్రమే చేరింది.
సామాన్యులు ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టుకుని కుటుంబాలను పోషించే ఆదాయాలు లేక రోజులు ఈడ్చుకుని వచ్చి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్నారు.ఇలాంటి వర్గాలపై మునిగే నక్కపై తాటిపండు చందంగా గ్యాస్ ధర పెంచాల్సిన అవసరం ఏమాత్రం లేదు. చలికాలంలో వంటల కోసమే కాకుండా వేడి నీటి స్నానాల కోసం కూడా గ్యాస్ ను వినియోగించుకోవడం ఎక్కువైన మాట నిజమే. వర్షాలు, వరదల వల్ల కట్టెలన్నీ తడిసి ముద్దలయ్యాయి. వేరే మార్గం లేక , చలి బాధ తట్టుకోలేక వంటగ్యాస్ పైనే వేడినీటిని కాచుకుంటున్న మధ్యతరగతి వారికి ఇది పిడుగులాంటి వార్తే. గ్యాస్ కనెక్షన్ల విషయంలోనూ, గ్యాస్ సరఫరా విషయంలోనూ గతంలో మాదిరి ఆంక్షలు లేనిమాట నిజమే అయినా, ధరలు మాత్రం సామాన్యులపై విపరీతమైన భారాన్ని మోపుతున్నాయి. రైతుల ఆందోళన ఓ వైపు సాగుతుండగా,ఇప్పుడు గ్యాస్ దరలు పెంపు వల్ల సామాన్యులు, మధ్యతరగతివారిని ఆందోళనవైపు ఉసిగొల్పే రీతిలో కేంద్రం గ్యాస్ ధరలను పెంచింది. గ్యాస్ ధరలను జిఎస్ టి పరిధిలోకి తేవాలని రాజకీయ పార్టీలు చాలాకాలంగా కోరుతున్నాయి. కానీ, కేంద్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్రాల వారీగా గ్యాస్ పై విలువ ఆధారిత పన్ను ( వ్యాట్ ) వేర్వేరుగా ఉంటోంది. అన్నీ కలిపి వినియోగ దారుని నెత్తి మీద పెద్ద బండ ఉంచుతున్నారు. ఇది అమానుషమని ఎంతో కాలంగా మొత్తుకుంటున్నా, కేంద్రం కానీ, రాష్ట్రాలు కానీ పట్టించుకోవడం లేదు. గ్యాస్ సిలిండర్లు సామాన్యులకు దొరకడంలో ఇబ్బందులు ఎదురవుతున్నా, హొటల్స్, రెస్టారెంట్లు, ఆఖరికి రోడ్డుపై వ్యాపారాలు చేసే తినుబండారాల వారికీ సిలిండర్ల బ్లాక్ లో దొరుకుతున్నాయి.
ఈ మాదిరిగా సిలిండర్ల ద్వారా అదనపు ఆదాయ మార్గాలకు అలవాటు పడిన గ్యాస్ కంపెనీల డీలర్లు సామాన్యుల విషయంలో నిబంధనల ప్రకారం నడుచుకుంటున్నామంటూ భారం మోపుతున్నారు. వంటగ్యాస్ పై కేంద్రం రాయితీ ఇస్తోన్న సంగతి నిజమే. ఏటా పన్నెండు సిలిండర్లను మాత్రమే రాయితీరేట్లకు అందిస్తారు. ఇంకా ఎక్కువ అవసరం వస్తే అధిక ధరకు బహిరంగ మార్కెట్ లో కొనక్కోవల్సిందే. రాయితీ సిలిండర్ల సక్రమంగా సరఫరా కాక, ఇప్పటికే సబ్సిడీ దారులు బయట కొనుక్కుంటున్నారు. ఈ పరిస్థితులలో కేంద్రం ఇప్పుడు మళ్లీ సబ్సిడీ గ్యాస్ ధర పెంచడం వాంఛనీయం కాదు. సామాన్యుల పై అధిక భారం మోపడం ఈ సమయంలో అంతకన్నా సమంజంసం కాదు. మోడీ తొలివిడత ప్రభుత్వంలో ఎన్ డిఏలో ఉన్న శివసేన ఈ విషయమై బహిరంగంగానే విమర్శించింది. అయితే, ప్రతిపక్షాల విమర్శలనూ, సూచనలను కేంద్రం పట్టించుకోవడం లేదు.అందుకే , రైతుల ఆందోళనల వంటివి పెద్దవి అవుతున్నాయి.