“1908లో హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలు ఎదుర్కొన్న ‘గ్రేట్ మూసీ వరదలు’ మిగిల్చిన జల ప్రళయ దుఃఖానికి విరుగుడుగా 1920లో 7వ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్, నిజామ్ హైదరాబాద్ స్టేట్ మూసీ ఉపనది ఈసా నదిపై గండిపేట సమీపాన ఉస్మాన్ అలీ ఖాన్ పేరుతో ‘ఉస్మాన్ సాగర్’ జలాశయం నిర్మించబడింది.”
1908లో హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాలు ఎదుర్కొన్న ‘గ్రేట్ మూసీ వరదలు’ మిగిల్చిన జల ప్రళయ దుఃఖానికి విరుగుడుగా 1920లో 7వ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్, నిజామ్ హైదరాబాద్ స్టేట్ మూసీ ఉపనది ఈసా నదిపై గండిపేట సమీపాన ఉస్మాన్ అలీ ఖాన్ పేరుతో ‘ఉస్మాన్ సాగర్’ జలాశయం నిర్మించబడింది. నగరాన్ని వర్షాకాల వరదల నుంచి కాపాడడానికి మరియు వేసవిలో తాగు నీటి కొరతను తీర్చడానికి గండిపేట చెరువు(జలాశయం)ను సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సాంకేతిక సహకారంతో ఆధునిక ఇంజనీరింగ్ నైపుణ్యంతో నిర్మించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. హైదరాబాద్కు తాగునీరు అందిస్తూ, వరదలను అడ్డుకుంటున్న గండిపేట జలాశయం గత 100 సంవత్సరాలుగా నగరవాసులకు విశేష సేవలను అందిస్తున్నది. రంగారెడ్డి జిల్లాలో నిర్మించిన ఉస్మాన్ సాగర్ సరస్సు 46 చదరపు కిమీ(29 చదరపు కిమీ గండిపేట జలాశయం) పూర్తి వైశాల్యంతో 3.9 టియంసీల నీటి సామర్థ్యం మరియు 1,790 ఫీట్ల గరిష్ట నీటిమట్టాన్ని కలిగి ఉంది. ఉస్మాన్ సాగర్ సమీపాన నిజాంకు వేసవి విడిది నిమిత్తం ‘సాగర్ మహల్’ అనబడే అద్భుత అతిథి గృహం నిర్మించబడింది.
వారసత్వ సంపదగా గుర్తించబడిన ప్రముఖ పర్యాటక కేంద్రమైన సాగర్ మహల్ నుండి అద్భుత గండిపేట జలాశయ అందాలను వీక్షించడానికి అనుకూలత ఉంది. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసిన ఉస్మాన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో పార్కులు, రిసార్టులు మరియు అమ్యూజ్మెంట్ పార్కులు ప్రణాళికాబద్దంగా ఎర్పాటు చేయబడ్డాయి. నగరానికి పశ్చిమాన 20 కిమీ దూరంలో ఉన్న గండిపేట చెరువు విదేశీ ప్రజలతో సహ అందరికీ విహార స్థలంగా ఖ్యాతి గాంచింది. మూసీకి ఉపనదిగా ఉన్న ఈసా నదిపై మానవ నిర్మితమైన గండిపేట చెరువు చుట్టు పక్కల పచ్చటి వాతావరణంలో విలక్షణ వృక్షజంతు జాలం చూపరులకు అహ్లదకర విందును కళ్ల ముందు నిలుపుతున్నది.
పిక్నిక్, ఫోటోగ్రఫీ, వైవిధ్యభరిత పక్షులు, ఓసియన్ పార్క్, ఎల్స్ వరల్డ్, ట్రెజర్లాండ్, ఈత కొలను, సాగర్ మహల్, బోటింగ్ విహార వసతులు, పలు హోటల్స్ మరియు పలు ఆకర్షణీయ వసతులు కల్పించబడినవి. 1920లో నగర జనాభా 5 లక్షలకు తాగునీటిని సమకూర్చే నిమిత్తం నిర్మించబడిన గండిపేట చెరువు నేటి కోటి జనాభాకు కూడా తాగునీటిని అందించే ప్రధాన ఆధారంగా నిలుస్తున్నది. నేటి పాలకులు నగర పరిసర ప్రాంతాలను గుర్తించి వరదలను తట్టుకునేలా మరియు తాగునీటిని అందించేలా మరికొన్ని జలాశయాలను నిర్మించాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజధానికి మణిపూసగా నిలుస్తున్న గండిపేట ఉస్మాన్ సాగర్ జలాశయ వైభవాన్ని గుర్తించి ‘శతవసంతాల గండిపేట ఉస్మాన్ సాగర్’ వేడుకలను జరుపుకుందాం. జీవవైవిధ్యానికి పెద్ద పీట వేస్తున్న గండిపేట చెరువును ఆరాదిద్దాం.

జాతీయ ఉత్తమ అధ్యాపక ఆవార్డు గ్రహీత , విశ్రాంత ప్రధానాచార్యులు, ప్రభుత్వ డిగ్రీ పిజీ, కళాశాల
కరీంనగర్ – 99497 00037