- వందలాదిగా ఆసుపత్రికి క్యూ కట్టిన టెక్కీలు
కరోనా వైరస్ వుందంటూ పెద్ద సంఖ్యలో వస్తున్న కేసులను పరీక్షించలేమంటూ హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి డాక్టర్లు చేతులెత్తేశారు. గాంధీ ఆస్పత్రిక వందల సంఖ్యలో ప్రజలు క్యూ కట్టడంతో వైద్యులు నిస్సహాయత వ్యక్తం చేశారు. కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోందని రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, కే. తారక రామారావు ప్రకటించి, 24 గంటలు కాకముందే గాంధీ వైద్యులు ఇబ్బడిముబ్బడిగా రెఫర్ అవుతున్న కేసులను పరీక్షించలేమంటూ అశక్తత వ్యక్తం చేయడం గమనార్హం. దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చిన సాప్ట్వేర్ ఉద్యోగికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన విషయం విదితమే. ఈ ఉద్యోగితో కలిసిమెలిసి తిరిగిన వారి సంఖ్య 88 అని ఆరోగ్య శాఖ నిర్దారించింది. ఇందులో 45 మందిని గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వీరందరికి కరోనా వైరస్ సోకలేదని గాంధీ వైద్యులు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్-19 గుర్తింపుతోపాటు.. పాజిటివ్ కేసులకు చికిత్స అందించేందుకు, అనుమానితులను పరీక్షించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఎవరూ ఆందోళన చెందనవసరం లేదని ప్రకటించింది. అయితే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. బుధవారం ఉదయం నుంచి భారీ సంఖ్యలో క్యూ కట్టిన టెక్కీలతో గాంధీ ఆస్పత్రి కిక్కిరిసిపోయింది. విదేశాలకు ప్రయాణం చేసే వారిలో టెక్కీలే ఎక్కువగా వుండడం, పాజిటివ్ కేసుల్లోను వారి సంఖ్యనే ఎక్కువగా వుండడంతో టెకీలు పెద్ద సంఖ్యలో తమ ఆరోగ్యంపై ఆందోళనతో గాంధీ ఆస్పత్రికి తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో గాంధీ ఆవరణలో పెద్ద పెద్ద క్యూలు దర్శనమిచ్చాయి. మాకు జలుబు, దగ్గు , జ్వరం ఉంది అని మొర పెట్టుకుంటున్న టెకీలను, సామాన్య ప్రజలను అడ్రస్ చేయడంలో గాంధీ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కేవలం విదేశాలకు వెళ్ళి వచ్చిన వారికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తామని, మిగిలిన వారికి అక్కర లేదని గాంధీ ఆస్పత్రి వర్గాలు చెబుతూ వారిని తిప్పి పంపుతున్నాయి. గత వారం రోజుల నుండి దగ్గు , జలుబు, తుమ్ములతో ఇబ్బంది పడుతున్న టెకీలు.. తాము విదేశాలకు వెళ్ళకపోయినా.. వెళ్ళి వచ్చిన వారితో కలిసి పని చేశామని చెబుతూ వారికి వైద్య పరీక్షలు నిర్వహించాల్సిందిగా బతిమాలుతుండడం కనిపించింది. వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాతనే ఆఫీసులకు రావాలని సాప్ట్ వేర్ కంపెనీలు తమ సిబ్బందికి చెప్పడంతో వారంతా గాంధీ ఆస్పత్రికి క్యూకట్టారు. అయితే.. ప్రభుత్వం చెబుతున్న దానికి వాస్తవంగా గాంధీ ఆస్పత్రిలో అనుసరిస్తున్న విధానానికి పొంతనే లేదని వైద్య పరీక్షల కోసం వస్తున్నవారు చెబుతున్నారు.