- వెల్లువెత్తిన ప్రజాగ్రహం.. వరద సాయం నిలిపివేత
- డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యేల ఇళ్ల ముట్టడి
- ఎటు చూసినా నిలదీతలు, ఆందోళనలు
- సాయం పంపిణీలో నేతలు, అధికారుల చేతివాటం
- ఆర్థిక• సాయం అందలేదన్న ఆవేదనతో వ్యక్తి మృతి, మరో వ్యక్తి ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయంపై గల్లీగల్లీలో లొల్లి ఊపందుకుంది. ఎక్కడ చూసినా తమకు పరిహారం అందలేదంటూ ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వరద సాయం పంపిణీతి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కాగా, వరద సాయం పంపిణీలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ శనివారం సికింద్రాబాద్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మారావు కార్యాలయంతో పాటు నగరంలోని పలువురు కార్పొరేటర్ల ఇళ్లను పెద్ద ఎత్తున ప్రజలు ముట్టడించారు. సికింద్రాబాద్‌లోని అడ్గగుట్ట, మెట్టుగూడ, బౌద్ధనగర్, సీతాఫల్‌మండి తదితర ప్రాంతాలలో ఎక్కడికక్కడ భారీ సంఖ్యలో మహిళలు ఆందోళన చేపట్టారు. దీంతో ఈ ప్రాంతాలలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసలైన అర్హులకు సాయం చేయకుండా ఆర్థిక సాయం అసలైన బాధితులకు కాకుండా కేవలం అధికార పార్టీల నేతల కుటుంబాలకు, , వారి అనుచరులకు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం స్పందించి అసలైన బాధితులను గుర్తించి వారికే నష్టపరిహారం అందేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళన చేస్తున్న మహిళలకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. అలాగే, ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలోని బంజారాహిల్స్,జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, ఖైరతాబాద్, సోమాజిగూడ, హిమాయత్‌నగర్ డివిజన్ల పరిధిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
ఖైరతాబాద్ నియోజకవర్గంలో వరద సాయం కింద రూ. 40 కోట్లు మంజూరు కాగా, ఇప్పటి వరకు కేవలం 35 వేల మందికి మాత్రమే వరద సాయం పంపిణీ జరిగినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే, వరదలలో నష్టపోయిన వారి సంఖ్య ఈ నియోజకవర్గం పరిధిలో దాదాపు లక్షకు పైగానే ఉంటుందని గతంలోనే అధికారులు పేర్కొన్నారు. దీంతో వీరందరికి వరద సాయం పంపిణి ఎప్పుడు పూర్తవుతుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక్కడ కూడా అర్హులైన బాధితులను పక్కనబెట్టి ఇంటి యజమానులు, లీడర్లు, టాక్స్ ఇన్స్‌పెక్టర్లు ఇలా ఎవరికి దోచిన రీతిలో వారు నిధులను పంచుకుంటున్నారని ఆరోపించారు. రికార్డుల్లో రూ. 10 వేలు ఇచ్చినట్లు రాసుకుని రూ. 5 వేలు మాత్రమే ఇవ్వడమేంటని మరికొన్ని చోట్ల బాధితులు అధికారులను నిలదీశారు. ఇంకొన్ని చోట్ల డబ్బు పంచి వెళ్తిన తరువాత అధికార పార్టీకి చెందిన స్థానిక నేతలు వచ్చి అందులో రూ. 3 వేల వరకూ తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని పులువరు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే, తమకు వచ్చే సొమ్మును కూడా కొందరు మధ్య దళారులు రానివ్వడం లేదని ఉప్పల్ ఎమ్మెల్యే కార్యాలయం వద్ద బాధితులు ధర్నాకు దిగారు. సికింద్రాబాద్ జిహెచ్‌ఎంసి కార్యాలయం వద్ద భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవిపల్లిలో తమకు వరద సాయం అందలేదని బాధితులు ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఇంటిని ముట్టడించారు.
వరద సాయం పక్కదారి పడుతోందనీ, అధికార పార్టీ నేతలు, అధికారులు రాత్రి పూట దొంగచాటుగా డబ్బు పంచుకుంటున్నారని తమకు న్యాయం జరిగే వరకూ అక్కడి నుంచి కదిలేది లేదని బైఠాయించారు. అయితే, ఎమ్మెల్యే ఇంటి వద్ద లేరని చెప్పి పోలీసులు వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. జీడిమెట్లలోనూ వరద సాయంపై బాధితులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ప్రకటించిన రూ. 10 వేల ఆర్థిక సాయం తమకు అందడం లేదని జీడిమెట్ల పోలీస్ స్షేషన్ వద్ద మహిళలు భారీ సంఖ్యలో బైఠాయించారు. దీంతో జీడిమెట్ల రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఇంటి ముందు వరద బాధితులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఇంటి ఎదుట ఓ బాధితుడు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అలాగే, ఎంఎస్ మక్తా, బీఎస్ మక్తా, ప్రేమ్‌నగర్, ఫిలింనగర్, వినాయకనగర్, బీఎన్‌రెడ్డి నగర్, బాల్‌రెడ్డినగర్ తదితర ప్రాంతాలలో వరద బాధితులు తమకు సాయం ఏదీ అంటూ స్థానిక ప్రజాప్రతినిధులను, అధికారులను నిలదీశారు. వరదలతో సర్వం కోల్పోయిన తమకు చేయూత ఇవ్వాల్సింది పోయి అధికార పార్టీ నేతలే వాటిని బొక్కుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, వరద సాయం అందలేదన్న మనస్థాపంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. సింగడికుంట ఉదయ్‌నగర్‌లో నివాసముండే బిక్షపతి (50) అనే వ్యక్తి ఇటవలి భారీ వర్షాల కారణంగా సర్వం కోల్పోయాడు. ప్రభుత్వం ప్రకటించిన వరద సాయం అందుతుందని ఆశగా ఎదరుచూశాడు. అధికారులు అతనికి వరద సాయం అందించడానికి నిరాకరించడంతో గుండెపోటుతో మృతి చెందాడు. పాతబస్తీలో సైతం వరద సాయం పంపిణీపై ఇదే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ప్రకటించిన రూ10 వేలలో తనకు రూ. 5 వేలు మాత్రమే ఇచ్చారనీ, ఓ బాధితుడు జీహెచ్‌ఎంసి కార్యాలయంలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు.