గ్రేటర్ హైదరాబాద్ మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి
- డిప్యూటి మేయర్‌గా మోతె శ్రీలక్ష్మి ఎన్నిక
- ప్రశాంతంగా ముగిసిన గ్రేటర్ మేయర్ ఎన్నిక
- తొలుత కార్పోరేట్లతో ప్రమాణస్వీకారం చేయించిన కలెక్టర్
- అనూహ్యంగా చివరి నిముషంలో మద్దతు తెలిపిన ఎంఐఎం
గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌గా మోతె శ్రీలక్ష్మి ఎన్నికయ్యారు. చేతులెత్తే సంప్రదాయంతో వీరు ఎన్నికయ్యారు. ఎంఐఎం మద్దతుతో సిఎం కెసిఆర్ నిర్ణయించిన మేరకు వీరిని కొత్తగా ఎన్నికైన కార్పోరేటర్లు ఎన్నుకు న్నారు. హైదరాబాద్ కలెక్టర్ శ్వేతామహంతి ఈ ఎన్నిక ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించారు. తొలుత మున్సిపల్ కార్పొరేషన్ నూతన కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయం లో ఎన్నికల నిర్వహణ అధికారి శ్వేతా మహంతి నూతన కార్పొరేటర్ల చేత ప్రమాణస్వీకారం చేయించారు. కార్పొరేటర్లు ఆయా భాషల్లో సామూహికంగా ప్రమాణం చేశారు. మొదట తెలుగు భాష, తర్వాత ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కార్పొరేటర్లు ప్రమాణస్వీకారం చేశారు. కార్పొరేటర్ల ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఎక్స్ అఫిషియో సభ్యులు హాజరయ్యారు. మధ్యాహ్నం 12:30 గంటలకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక లాంఛనంగా పూర్తయ్యింది.
అంతకుముందు టిఆర్ఎస్ భవన్లో కొత్తగా ఎన్నికైన కార్పోరేటర్లకు మంత్రి కెటిఆర్ దిశానిర్దేశం చేశారు. అనంతరం అంతా బస్సులో జిహెచ్ఎంసి కార్యాలయానికి చేరుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా బంజారాహిల్స్ కార్పొరేటర్ గద్వాలవిజయలక్ష్మి ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా తార్నాక కార్పొరేటర్ మోతె శ్రీలత ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణ అధికారి శ్వేతా మహంతి అధికారికంగా ప్రకటించారు. మేయర్, డిప్యూటీ మేయర్‌తో పాటు కార్పొరేటర్లకు శ్వేతామహంతి శుభాకాంక్షలు తెలిపారు. నూతనంగా ఎన్నికైన మేయర్ విజయలక్ష్మికి, డిప్యూటీ మేయర్ శ్రీలతకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు శుభాకాంక్షలు తెలిపారు. మేయర్‌గా విజయలక్ష్మి పేరును కార్పొరేటర్ బాబాఫసీయుద్దీన్ ప్రతిపాదించగా, గాజులరామారం కార్పొరేటర్ శేషగిరి బలపరిచారు.
డిప్యూటీ మేయర్‌గా శ్రీలత పేరును మచ్చబొల్లారం కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ ప్రతిపాదించగా, కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ బలపరిచారు. అనంతరం ఎన్నికల నిర్వహణ అధికారి శ్వేతా మహంతి ఎన్నిక ప్రక్రియ చేపట్టారు. చేతులెత్తే విధానం ద్వారా మేయర్‌ను ఎన్నుకున్నారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు ఎంఐఎం మద్దతు ఇచ్చింది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నప్పటికీ.. ఈ ప్రక్రియ ఎలాంటి సంచలనాలు లేకుండా సాఫీగా సాగిపోయింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్‌లోనే కొనసాగింది. పాఠశాల విద్య హైదరాబాద్‌లోని హోలీ మేరి స్కూల్లో పూర్తిచేశారు. రెడ్డి ఉమెన్స్ కాలేజీలో ఇంటర్, భారతీయ విద్యాభవన్‌లో జర్నలిజం చేశారు. సుల్తాన్ ఉల్ లూమ్ లా కాలేజీలో న్యాయవిద్యను అభ్యసించారు. వివాహానంతరం ఆమె 18 ఏండ్లపాటు అమెరికాలో ఉన్నారు. ఆ సయమంలో ఉత్తర కరోలినాలోని డ్యూక్ యూనివర్సిటీ కార్డియాలజీ డిపార్ట్మెంట్లో రిసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేశారు.
2007లో అమెరికా పౌరసత్వాన్ని వదులుకొని భారత్‌కు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి ఆమె రాజకీయాల్లో కొనసాగుతున్నారు. 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి బంజారాహిల్స్ కార్పొరేటర్‌గా భారీ విజయం సాధించారు. డివిజన్ అభివృద్ధికి తనవంతుగా కృషిచేశారు. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత తార్నాక నుంచి ఎన్నికయ్యారు. కొంతకాలంపాటు టీఆర్ఎస్ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ అఫీషియో సభ్యులగా ఉన్న మంత్రులు, ఎంపిఉల, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. మంత్రులు తలసాని,మహ్మూద్ అలీలు హాజరైన వారిలో ఉన్నారు.