Take a fresh look at your lifestyle.

గద్దెకు చేరిన సారక్క మేడారం జాతర షురూ..

Medaram Jathara Start

‘‘భక్తుల కోలాహలం..శివసత్తుల పూనకాలు..గిరిజనుల డోలు వాయిద్యాల ఘోష.. ఆనందోత్సాహాలు..‘అమ్మ’ల రాక కోసం లక్షల మంది ఎదురుచూపులు.. ఉత్కంఠల మధ్య, ‘చిన్నవ్వ’ సారక్క  గద్దెను అలంకరించింది. ఆమెతోపాటు గోవిందరాజు, పగిడిద్దరాజు కూడా గద్దెను చేరుకున్నారు. వీరి రాకతో జాతర బుధవారం అధికారికంగా ప్రారంభమైంది. గురువారం ‘పెద్దవ్వ’ సమ్మక్క తల్లి గురువారం గద్దెకు చేరుకోవడంతో ఉత్సవం జోరందుకుంటుంది.’’

నాలుగు రోజుల మేడారం సమ్మక్క జాతర బుధవారం రాత్రి సారమ్మతల్లి గద్దెకు రావడంతో ప్రారంభమైయింది. దీంతో జాతర తొలిఘట్టం శ్రీకారం చుట్టుకున్నట్లైంది. జాతర స్థలానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న కన్నెపల్లిలోని దేవాలయంలో రెండేళ్ళకాలంగా పూజలు అందుకుంటున్న సారలమ్మకు కాక వంశస్థుడైన వడ్డె కాక సారయ్య బృందం క్రితం రోజునుండే ప్రత్యేక పూజలు చేసి, గద్దెలకు తరలించడానికి సిద్దంచేశాడు. పూర్తిగా గిరిజన సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం చేసే పూజలకు కుటుంబసభ్యులను తప్ప ఇతరులనెవరినీ అనుమతించలేదు. ఈ సందర్భంగా స్థానికులు తమ గ్రామాలను అందంగా తీర్చిదిద్దారు. ప్రతీ గుమ్మానికి మామిడి తోరణాలు కట్టారు. పసుపు కుంకుమలతో గడపలను, ముంగిళ్ళను అలంకరించారు. కాకతీయ చక్రవర్తి సైన్యంతో పోరాడి వీరమరణం పొందిన సమ్మక్క కూతురైన సారలమ్మను ఎప్పుడు దర్శించుకుంటామా అని మేడారంలో ఎదురుచూస్తున్న లక్షలాదిమంది భక్తులకు ఆ తల్లి దర్శనం కావడంతో చెప్పలేని ఆనందం, సంతోషంతో పడిపడి దండాలు పెడుతూ, తమను చల్లంగా చూడాలితల్లి అంటూ గద్దెల ప్రాంగణానికి తమ మొక్కుబడులతో బారులు తీరిన జనంతో ఆ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. సారలమ్మతోపాటు, మహబూబాబాద్‌ ‌జిల్లా గంగారం మండలం పూనుగండ్ల నుండి సమ్మక్క భర్త గోవిందరాజును, ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి పగిడిద్ద రాజులను మేడారం గద్దెకు చేర్చారు. అంతకుముందు సారలమ్మతోపాటు గోవిందరాజును, పగిడిద్దరాజును సమ్మక్క ఆలయానికి చేర్చారు., అక్కడున్న సమ్మక్క పూజారులు గిరిజన సంప్రదాయ ప్రకారం సమ్మక్కకు మొదట వివాహం జరిపారు. అనంతరం పగిడిద్దరాజును, గోవిందరాజును, సారలమ్మను మేడారంలోని జాతర ప్రాంతంలోని వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గద్దెలకు చేర్చడంతో భక్తులు వారిని సందర్శించుకోవడానికి పరుగులు తీసారు.

Medaram Jathara Startకాగా గురువారం సమ్మక్క గద్దెకు చేరుకోవడంతో ఈ జాతర సంపూర్ణతకు చేరుకుంటుంది. ఇప్పటికే లక్షలాది జనంతో నిండిపోయిన మేడారం సమ్మక్క తల్లి గద్దెకు వచ్చే సమయానికి భక్త కోటి సంఖ్య కోటికిపైగా చేరుకుంటుందని భావిస్తున్నారు. తెలంగాణ ప్రాంతమేకాకుండా చుట్టుపక్కల ఉన్న ఛత్తీస్‌గఢ్‌, ‌మహారాష్ట్ర, ఒడిషా, ఏపి తదితర రాష్ట్రాలనుండికూడా అశేషంగా భక్తజనం వస్తుండడం విశేషం. ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆర్టీసి బస్సులే కాకుండా ప్రేవేటు బస్సులు, కార్లు, ట్రాక్టర్లు, ఇతర వాహనాలతోపాటు పూర్వంలా ఎండ్లబండ్ల వరుసలు మేడారంవైపు నిరంతరంగా సాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే మేడారమంతా జనసంద్రంగా దర్శనమిస్తోంది. జాతర చుట్టుపక్కల పది కిలోమీటర్ల దూరం వరకు వేలాది గుడారాలతో మరో కుంభమేళాగా కనిపిస్తున్నది.

Leave a Reply