Take a fresh look at your lifestyle.

జి. ఓ. 45 – పౌరుల హక్కులు ప్రొ. కోదండ రామ్ అధ్యక్షుడు, తెలంగాణ జన సమితి

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ లాక్ డౌన్ అమలుకోసం విడుదలైన జి.ఓ. 45 ప్రకారం ప్రజలకు కొన్ని సౌకర్యాలు లభించాయి. వాటి గురించి తెలుసుకుందాము, మన అవగాహనా పెంచుకుందాము.అంటు వ్యాధులు ఇటీవల కాలంలో మనం చూడలేదు. అందుకనే వాటి నివారణకు కొత్తగా చట్టాలు లేవు. గతంలో ఈ వ్యాధులు వస్తూవుండేవి. అప్పటి కాలంలో వ్యాధులు నియంత్రణకు, అప్పటి నిరంకుశ పాలనా నేపథ్యంలో బ్రిటిష్ పాలకులు 1897 లో అంటు వ్యాధుల చట్టం తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం కరోనా నివారణకు ప్రభుత్వం జి.ఓ. జారీ చేసింది. అయితే ఆ చట్టం తో పాటు డిసాస్టర్ మేనేజ్మెంట్ చట్టాన్ని కూడా ఉపయోగించ వలసింది. 22 – 3 – 2020 నాడు జారీ అయిన జి.ఓ. నెంబరు 45 లాక్ డౌన్ ప్రకటించడమే కాకుండా లాక్ డౌన్ వలన బతుకు దెరువు కోల్పోయిన ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తున్నది.

జి.ఓ. లోని సెక్షన్ 12 ప్రకారం:
రేషన్ కార్డు వున్న 87 . 59 లక్షల కుటుంబాలకు కుటుంబ సభ్యులకు తలా 12 కిలోలు బియ్యం ఇస్తారు. ఉచితంగా ఇస్తామని జి.ఓ. స్పష్టం చేయలేదు. కానీ ముఖ్య మంత్రి గారు ఉచితంగా ఇస్తామని అన్నారు. ఆ ప్రకటననే అమలవుతుందని అనుకోవాలి.

జి.ఓ. లోని సెక్షన్ 13 ప్రకారం:
రేషన్ కార్డు కల ప్రతి కుటుంబానికి 1500 రూపాయలు ఇస్తారు.

జి.ఓ. లోని సెక్షన్ 14 ప్రకారం:
ప్రైవేట్ సంస్థలలో పని చేసే ప్రతి ఉద్యోగికి, లాక్ డౌన్ కాలానికి ఆ సంస్థలు సంపూర్ణ వేతనం చెల్లించాలి.

జి.ఓ. లోని సెక్షన్ 20 ప్రకారం:
గ్రామ స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తారు.

ఇవికాకుండా కేంద్ర ప్రభుత్వం:
— రేషన్ కార్డువున్న ప్రతి కుటుంబానికి 5 కిలోల బియ్యం, 1 కిలో పప్పు ఉచితంగా 3 నెలల పాటు ఇస్తానన్నది.
— అదే విధంగా జన్ ధన్ అకౌంట్ వున్న ప్రతి కుటుంబానికి 3 నెలల పాటు నెలకు 500 రూపాయల చొప్పున ఖాతాలో జమ చేస్తామన్నారు.
— ఉపాధి హామీ కూలీల కనీస వేతనాన్ని 202 రూపాయలకు పెంచారు.
— రిజర్వ్ బ్యాంకు అన్ని ఈ.ఎం.ఐ. చేల్లింపుల పైన 3 నెలల పాటు మారటోరియం విధించింది. అంటే 3 నెలల పాటు ఈ.ఎం.ఐ. లను బ్యాంకులు వసూలు చేయ రాదు.

పై నిర్ణయాలను స్వాగతిస్తున్నాం. అయితే ఇవి ఇంకా అమలులోకి రాలేదు. వలస కార్మికులు పనులు దొరకక పోవడంతో, తిండికి లేక స్వస్థలాలకు కాలినడకనే బయలు దేరుతున్నారు. డిసాస్టర్ మేనేజ్మెంట్ చట్టాన్ని అమలులోకి తెచ్చి ఎప్పటికప్పుడు పనులు కోల్పోయిన వారిని గుర్తించి ఆదుకోవాలి. ప్రభుత్వం ప్రకటించిన సహాయక చర్యలు పేదలందరికీ అందాలంటే వాటిని ఇంకా పెంపొందించ వలసిన అవసరం వున్నది. అందుకు గాను అదనంగా దిగువ చర్యలను తీసుకోవలసిందిగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాము.

— రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు వున్నా, లేకున్నా పేదలందరికీ సహాయం అందించాలి. బయటి రాష్ట్రాలనుండి వచ్చిన వారికి కార్డు ఉండదని గమనించాలి. అలాగే మన రాష్ట్రానికి చెందిన పెదాలతో కూడా రేషన్ కార్డు లేనివారు వున్నారు.

—బియ్యం తో పాటే పప్పు, వంట నూనె, చెక్కర కూడా ఇవ్వాలి. కనీసం మూడు నెలలపాటు ఉచితంగా రేషన్ సరఫరా చేయాలి.

—1500 రూపాయల నగదు సహాయం చాలదు. 31 మార్చి వరకు లాక్ డౌన్ ఉంటదని ఈ సహాయాన్ని ప్రకటించారు. లాక్ డౌన్ కాలం పొడిగించారు కనుక సహాయాన్ని పెంచాలి.

— జన్ ధన్ ఖాతా లేని పేదలకు కూడా కేంద్రం ఆర్ధిక సహాయం చేయాలి. ఆర్ధిక సహాయం 1000 రూపాయలకు పెంచాలి.

— తక్షణమే వలస కార్మికులను గుర్తించి వారికి వసతి, తిండి సౌకర్యం కల్పించాలి.

—- అంటు వ్యాధుల చట్టంతో పాటు డిసాస్టర్ మేనేజ్మెంట్ చట్టాన్ని కూడా వుపయోగించి నిరాశ్రయులు అయిన వారిని ఆదుకోవాలి.

Leave a Reply