- 70 వేల ఇళ్లకు రూ.198 కోట్ల నిధులు
- కెసిఆర్ కుటుంబంలో అందరికీ ఫామ్ హౌజ్‌లు
- ‘111’ జీవో కాస్త ‘ట్రిపుల్ మెన్’ జీవోగా మార్చారు
- సంగ్రామయాత్రలో కెసిఆర్‌పై బండి విమర్శలు
పలు పథకాల నిర్వహణకు బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిధులు పంపుతుంటే.. సీఎం కేసీఆర్ తన ఫొటోలు పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమెత్తారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతోంది. మొయినాబాద్ చౌరస్తా వద్ద ప్రజా సంగ్రామ యాత్రలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఫార్మ్ హౌస్ లు ఉన్నాయి.. కానీ రంగారెడ్డి జిల్లాలో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇచ్చాడో కేసీఆర్ చెప్పాలన్నారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం.. 70వేల ఇళ్లు, రూ.198 కోట్ల నిధులను మంజూరు చేసిందని గుర్తు చేశారు. అలాగే రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి రూ.1,040 కోట్లు ఇచ్చిందని పేర్కొన్నారు. రోడ్లు, కొరోనా టీకా, బియ్యం, హరితహారం (కంపా), ఇలా ప్రతి దానికీ పైసలు ఇచ్చేది కేంద్రమే అని తెలిపారు. కేసీఆర్ పాలనలో డబుల్ బెడ్రూం ఇళ్ళు ఎప్పటికీ రావన్నారు. రంగారెడ్డి జిల్లాలో ఎన్ని డబుల్ బెడ్ రూమ్‌లు ఇచ్చారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ’111’ జీవో కాస్త ’ట్రిపుల్ మెన్’ (కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు) జీవోగా మారిందని ఎద్దేవా చేశారు.
111 జీవోపై ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని చెప్పారు. జీతాలు ఇవ్వలేని సీఎం.. ఇప్పుడు దళిత బంధు ఇస్తాడా.. అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఇక అవకాశం ఇవ్వాలని బండి సంజయ్ కోరారు. కేసీఆర్ కుటుంబ పాలన, అవినీతి పాలన గోడలు బద్దలు కొడతామని ఆయన పేర్కొన్నారు. ఎంఐఎం వాళ్ళు ఎక్కడికి రమ్మన్నా వస్తా… దారుస్సలాం రమ్మనా వస్తా… ఛాలెంజ్ చేస్తున్నా.. మా మోడీని ఛాలెంజ్ చేస్తే…ఏం చేయాలో అది చేశాం.. ఏమైనా చేస్తాం..అని బండి సంజయ్ అన్నారు. పాతబస్తీలో గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసే దమ్ము కూడా టీఆర్ఎస్ కు లేకపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. 2023లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సభ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరే నిర్వహిస్తామని ఆయన పునరుద్ఘాటించారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన గడ్డ ….రంగారెడ్డి జిల్లా అని ఆయన గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1400 మంది ప్రాణత్యాగం చేస్తే కేసీఆర్ మాత్రం 600 మందే ప్రాణత్యాగం చేశారని అవమానిస్తున్నాడని, నైతిక విలువ లేని వ్యక్తి కేసీఆర్ అని బండి సంజయ్ విమర్శించారు. దళితుడిని సీఎంను చేస్తానన్న కేసీఆర్… ఎందుకు చేయలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పటికీ వచ్చే పరిస్థితి లేదని బండి సంజయ్ విమర్శించారు. దేశ వ్యాప్తంగా ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత మోడీదేనన్నారు. వ్యాక్సిన్ వేసుకోమని ఇప్పటి వరకు ప్రజలకు పిలుపునివ్వని ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆరే మాత్రమేనని ఆయన ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో వరదలు వస్తే పేదలకు అండగా ఉన్నది భారతీయ జనతా పార్టీనే అన్నారు.
హైదరాబాద్ వరద బాధితులకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానన్న ముఖ్యమంత్రి ఎంతమందికి ఇచ్చాడో చెప్పాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వలేని ముఖ్యమంత్రి కేసీఆరే ఇప్పుడు ’దళితబంధు’ ఇస్తా అంటున్నాడని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి పెద్ద ఎత్తున కేంద్రం నిధులను మంజూరు చేసిందని ఆయన తెలిపారు. రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి 1040 కోట్ల రూపాయలను కేంద్రం ఇచ్చిందన్నారు. రోడ్లు, కరోనా వ్యాక్సిన్, బియ్యం, హరితహారం(కంపా)….ఇలా ప్రతి దానికి పైసలు ఇచ్చేది కేంద్రమేనన్నారు. కేంద్రం ఇచ్చే నిధులకు కేసీఆర్ తన ఫోటోలు పెట్టుకుని కార్యక్రమాలకు ప్రచారం చేసుకుంటున్నాడని, గద్ద ముక్కు ఫోటోలను పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. ఒక్కసారి బీజేపీకి అవకాశమిచ్చి చూడాలని బండి సంజయ్ ప్రజలకు పిలుపునిచ్చారు.